Asianet News TeluguAsianet News Telugu

రూపాయి పతనం: అందుకు కారణాలు ఇవే...

అమెరికా డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం వల్ల రుణాలపై విదేశాల్లో విద్యాభ్యాసం చేసే వారి ఫీజులు పెరుగుతాయి. రూపాయి, డాలర్ మధ్య వ్యత్యాసంతో ఎగుమతులు, దిగుమతుల మధ్య పొంతన కుదరక వాణిజ్య లోటు, ఆ పై కరంట్ ఖాతా లోటు ఏర్పడతాయి.

Top 5 reasons why rupee hit a record low of 69.13/USD on Friday

న్యూఢిల్లీ: డాలర్‌పై రూపాయి మారకపు విలువ 69.13 వద్దకెళ్లి.. శుక్రవారం ట్రేడింగ్‌లో 68.84వ వద్ద స్థిరపడినా 69 మార్కును మాత్రం దాటేసింది. ఇంత కనిష్ఠ స్థాయికి రూపాయి విలువ పతనం కావడం ఇప్పుడే. అమెరికా ద్రవ్యపరపతి విధానాన్ని కఠినతరం చేయడంతోనే డాలర్ బలపడుతోంది. మరోవైపు భారత్ కరంట్ ఖాతా లోటు పెరుగడానికి ముడి చమురు ధరలు కూడా ఒక కారణమే. వీటికి తోడు చైనాతో అమెరికా వాణిజ్య యుద్ధంతో సెంటిమెంట్ రిస్క్‌లో పడుతోంది. మరోవైపు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం సవాళ్ల నేపథ్యంలో వడ్డీరేట్లు పెంచకపోవడంతో కార్పొరేట్ సంస్థల రుణ వ్యయం పెరుగుదలకు కారణమవుతోంది. మరోవైపు దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరత్వం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

రూపాయి విలువలో మార్పు వల్ల ఆర్థిక వ్యవస్థతోపాటు సగటు జీవులపైనా సమానంగా ప్రభావం చూపుతుందన్నది నిజం. గతంలో దేశ రాజకీయాల్లో ఒకప్పుడు ఉల్లి ధర దేశ రాజకీయాల్లో మార్పులు తెచ్చినట్లే, రూపాయి మారకం విలువ కూడా రాజకీయాలను శాసించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో రుణాలతో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న వారికి డాలర్లలో ఫీజు వాయిదాలు పెరుగుతాయి. ఎన్నికల ఏడాది కావడంతో ప్రభుత్వ వ్యయం, ఆదాయానికి పొంతన ఉండే అవకాశాలు లేనందున కరంట్ ఖాతా, వాణిజ్య లోటు మరింత సమస్యాత్మకం అవుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. 

రూపాయి పతనం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై కచ్చితంగా ఉంటుంది. డాలర్లలో కొని, దిగుమతి చేసుకునే చమురు, ఎలక్ట్రానిక్స్‌, బంగారం విలువలు ప్రియం అవుతాయి. భారత పరపతి విధానం మరింత కఠినమవుతుంది. ఎన్నికల ఏడాది కనుక ప్రభుత్వం వ్యయాల విషయంలో వెనకడుగు వేయకపోవచ్చు. ఫలితంగా ఖర్చులకు, ఆదాయానికి పొంతన లేక దేశ కరెంట్‌ లోటు, ద్రవ్యలోటు పెరుగుతాయి. ఇక ప్రత్యక్షంగా రోజువారీ జీవనంపై రూపాయి ప్రభావం ఉంటుంది. సానుకూల, ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఎంత తీవ్రత అన్నది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ముడి చమురు నుంచి వచ్చే పెట్రోలు, డీజిల్‌, సబ్బులు, కాస్మొటిక్స్‌ వంటి ఉత్పత్తుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఈ భారాన్ని కంపెనీలు వినియోగదారుడిపైకి మళ్లిస్తాయి. దీంతో ఆయా ఉత్పత్తులు ప్రియం అవుతాయి. డాలర్లలో దిగుమతి చేసుకునే ప్రతి కంపెనీ ఆ భారాన్ని వినియోగదారుడిపైకి బదిలీ చేస్తే.. సామాన్యుడి రోజువారీ ఖర్చులు పెరగడం ఖాయం.

చమురు మార్కెటింగ్‌, జౌళి, రత్నాభరణాల వంటి రంగాల కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేకించి వేతనాల పెంపు, ప్రోత్సాహకాలను తగ్గించవచ్చు. ఈ రంగాల్లోని పెద్ద కంపెనీలో పనిచేసే వారు పరిస్థితులు మెరుగుపడే వరకు వేచిచూడొచ్చు. లేదంటే కొత్త అవకాశాలు చూసుకోవాల్సిందే. ఒకవేళ మీ పిల్లలు విద్యా రుణాలతో విదేశాల్లో చదువుతూ ఉంటే, కచ్చితంగా వాయిదాల భారం పెరుగుతుంది. అక్కడ రుసుములు, జీవనానికి డాలర్లలో చెల్లించాల్సి రావడమే ఇందుకు కారణం. డాలర్‌ రూ.65 వద్ద ఉన్నపుడు రుణం తీసుకుంటే ఇపుడు డాలర్‌ రూ.69కి చేరడం వల్ల, మీ నెలవారీ వాయిదా మొత్తం మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది. అదే పిల్లల చదువు పూర్తయి, ఈ సమయంలో ఉద్యోగం వచ్చి, అక్కడ నుంచి డాలర్లు పంపుతూ, ఇక్కడ బకాయి తీర్చేసే వారికి మాత్రం లాభం చేకూరుతుంది. తక్కువ డాలర్లతోనే, రూపాయిల్లో ఎక్కువ మొత్తాన్ని తీర్చేయగలగడం ఇందుకు కారణం. 

గతంలో బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారికి రూపాయి క్షీణత సానుకూలాంశం. డాలర్‌ రూపేణ బంగారం ధరలో మార్పు లేకున్నా, రూపాయల్లో ఇప్పుడు మరింత అధిక ధరకు చేరుతుంది కనుక అమ్ముకోవచ్చు. ఐటీ, ఔషధ, ఎఫ్‌ఎమ్‌సీజీ వంటి ఎగుమతి ఆధారిత కంపెనీల్లో షేర్లు కొంటే, అవి మీకు మంచి ప్రతిఫలాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. దిగుమతులపై ఆధారపడే రంగాల నుంచి మదుపర్లు దూరంగా ఉంటే మంచిది. లాప్‌టాప్‌లు, మొబైల్‌ ఫోన్‌ తయారీకి విడిభాగాలన్నీ దిగుమతవుతున్నాయి. రూపాయి విలువ క్షీణతతో వీటికి అధికంగా చెల్లించాల్సి వస్తుంది. ఇందువల్ల తయారీసంస్థలకు  వ్యయాలు పెరగొచ్చు. రూపాయి క్షీణత కొనసాగితే, ఆ భారాన్ని వినియోగదార్లపై వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే స్మార్ట్ ఫోన్ల సంస్థలు తమ లాభాలను పెంచుకునేందుకు ధరలు పెంచే యోచనలో ఉన్నాయని తెలుస్తోంది.

ఇటీవలి వరకు విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి ప్రజలు కూడా విదేశీ ప్రయాణాలు చేయగలుగుతున్నారు. ఒకవేళ కుటుంబంతో విదేశీ ప్రయాణం చేయాలనుకుంటే ముందు డాలర్‌ విలువ ఎంత ఉందో తెలుసుకుని బయలుదేరితే మంచిది. ఎందుకంటే డాలర్‌ రూ.60 ఉన్నపుడు, 10,000 డాలర్లతో పూర్తయ్యే విదేశీయానం విలువ  రూ.6 లక్షలు అయిదే.. రూ.70 వద్ద అది రూ.7 లక్షలకు చేరుతుంది. అంటే అదనంగా లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నమాట. టికెట్‌ ధర న్యూయార్క్‌కు 3,000 డాలర్లు ఉంటే.. అప్పటి కంటే ఇపుడు రూ.30,000 అదనం అవుతుందన్నమాట. విమాన ఇంధన ధరలు పెరుగుతున్నందున, దేశీయ ప్రయాణానికీ విమానయాన సంస్థలు ఛార్జీలు పెంచుతున్నాయి. ఇప్పటికే మీ పిల్లలు, సన్నిహిత బంధువులు విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే, అక్కడ నుంచి మీకు నెలనెలా వచ్చే పైకం విలువ పెరుగుతుంది. అక్కడి నుంచి వచ్చే డబ్బుతో ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటే.. వాటి విలువ పెరుగుతుంది కాబట్టి మీకు మరిన్ని అవకాశాలు ఉన్నట్లే లెక్క.

Follow Us:
Download App:
  • android
  • ios