న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం ప్రారంభమై నాలుగు నెలలు కావొస్తోంది. ఈ నాలుగు నెలల కాలంలో బంగారం ధరలు 17 శాతం పెరిగాయి.  గత చరిత్రను పరిశీలిస్తే సంక్షోభానికి, పసిడికి ఎలాంటి బంధం ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. 2008లోనూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

2008లో ఏ పెట్టుబడి సాధనాలు ఇవ్వనంతగా పసిడి భారీగా రిటర్నులు ఇచ్చింది. ప్రపంచం ఇప్పుడు అంతకంటే పెద్ద సంక్షోభం ఎదుర్కొంటోంది. మళ్లీ ఇప్పుడు కూడా పసిడి భారీ లాభాలు ఇస్తోంది. 

పసిడి ధరల పెరుగుదలకు సంక్షోభం ఒక్కటే కారణం కాదని నిపుణులు అంటున్నారు. కరెన్సీ బలహీన పడటం కూడా ఇటీవల పసిడి రికార్డు స్థాయిలను తాకేందుకు కారణం అని ఐఐఎం (అహ్మదాబాద్) గోల్డ్ పాలసీ సెంటర్ అధిపతి సుధీశ్ నంబియత్ చప్పారు. 

అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవటం, డాలర్ విలువ తగ్గినా, పసిడి ధరలు భారీగా పెరగటం వల్ల స్టాక్ మార్కెట్లు, కరెన్సీ, బంగారం మధ్య ఉండే పరస్పర సంబంధం దెబ్బతిన్నట్లు సుధీశ్ నంబియత్ విశ్లేషించారు. గత ఏడాది జూన్​తో పోలిస్తే ఇప్పటి వరకు బంగారం 24 శాతం, ఏడాది మొత్తం మీద చూస్తే 40 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్​ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర ఈ నెల ఒకటో తేదీన రికార్డు స్థాయిలో రూ.48,589కి చేరింది. ఈ స్థాయికి ధర పెరిగిన నేపథ్యంలో చాలా మంది లాభాల స్వీకరణకూ దిగారు. అంతర్జాతీయంగా గత వారం ఔన్సు బంగారం ధర రూర.1,788.96 డాలర్లను తాకింది. 2012 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో ధర పెరగటం మళ్లీ ఇదే ప్రథమం.

also read గూగుల్ ట్యాక్స్ అంటే ఏంటి : అమెరికా అంక్షలతో భారత్‌కు ఎందుకు నష్టం ...

ఇటీవల పసిడి పరుగుల నేపథ్యంలో గోల్డ్​మన్ శాక్స్ బంగారం ధరలపై గతంలో విడుదల చేసిన 12 నెలల అంచనాలను సవరించింది. తాజా అంచనాల ప్రకారం బంగారం ఔన్సుకు 1,800 డాలర్ల నుంచి 2,000 డాలర్ల స్థాయిని తాకొచ్చని తెలిపింది.

మరో దిగ్గజ సంస్థ అమెరికా సెక్యూరిటీస్​ కూడా బంగారం ధరలు 2021లో ఔన్సుకు 2,000 డాలర్ల నుంచి 3,000 డాలర్లకు పెరగొచ్చని తెలిపింది. దేశీయ బ్రోకరేజీ సంస్థలు కూడా ఈ ఏడాది బంగారం ధరలు ఇంకా పెరగొచ్చని అంచనా వేస్తున్నాయి.

రికార్డు స్థాయికి పసిడి ధరలు చేరడంతో స్వల్పకాలంలో కాస్త దిద్దుబాటుకు లోను కావ్వొచ్చని దేశీయ సంస్థలు అంటున్నాయి. అయితే దీర్ఘ కాలంలో మాత్రం భారీగా లాభాలు ఉంటాయంటున్నారు. మంచి లాభాల కోసం మదుపరులు బంగారాన్ని ఎంచుకోవడంలో ఆశ్చర్యం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. 

లాక్​డౌన్ నిబంధనలు, భారీగా పెరిగిన ధరలతో నగల రూపంలో బంగారం కొనడం తగ్గినా.. ఈటీఎఫ్​లో మాత్రం భారీగా పెట్టుబడులు పెరిగిందంటున్నారు.  గోల్డ్ ఈటీఎఫ్​లలో పెట్టుబడులకు ఏప్రిల్​లో రూ.731 కోట్లు వస్తే.. మేలో రూ.815 కోట్లు వచ్చాయి.

పసిడిపై పెట్టుబడులు సానుకూలంగా ఉన్నట్లు తెలిపేందుకు ఇవే నిదర్శనమంటున్నారు. భౌతికంగా బంగారం డిమాండ్​ తగ్గినా.. ఆ ప్రభావం ఈటీఎఫ్​పై అంతగా ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.