న్యూఢిల్లీ/హైదరాబాద్‌: కరోనా మహమ్మారి ప్రభావంతో పసిడి ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే సామాన్యుడికి అందనంత దూరానికి చేరుకున్న అతి విలువైన లోహాల ధరలు బుధవారం మరో మెట్టుపైకి చేరుకున్నాయి.హైదరాబాద్ నగరంలో తులం బంగారం ధర రూ.51 వేలకు చేరువైంది.

ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌తో కకావికలమవుతుండటంతో మదుపరులు తమ పెట్టుబడులను పసిడి, వెండి తదితర విలువైన లోహాల వైపు మళ్లిస్తున్నారు. దీంతో కొన్ని రోజులుగా పసిడి, వెండి ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. 

దేశీయంగా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ గ్లోబల్‌ మార్కెట్ల నుంచి వచ్చిన దన్నుతో బంగారం ధరలు భారీగా పుంజుకున్నాయి. దేశ రాజధాని నూఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.647 ఎగబాకి రూ.49,908 పలికింది. 

పుత్తడి ధర ఒకేరోజు ఇంతటి స్థాయిలో పెరగడం గత రెండు నెలల్లో ఇదే తొలిసారి. మంగళవారం ధర రూ.49,261గా ఉన్నది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.470 అధికమై రూ.50,950 పలికింది. 

also read బ్యాంకు కస్టమర్లపై మళ్ళీ ఏ‌టి‌ఎం చార్జీల మోత...? ...

దీంతో తులం బంగారం త్వరలో రూ.51 వేల మార్క్‌కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 22 క్యారెట్ల పసిడి ధర రూ.46,740కి చేరుకున్నది. పసిడితోపాటు వెండి ధర కూడా పెరిగింది. పారిశ్రామిక వర్గాలతోపాటు నాణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి రూ.1,611 అధికమై రూ.51,870కి చేరుకున్నది.  

అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారం ధరలు అదుపులేకుండా దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం న్యూయార్క్‌ బులియన్‌ మార్కెట్లో 1,800 డాలర్లుగా ఉన్న ఔన్స్‌ ధర త్వరలో 2 వేల డాలర్లను తాకవచ్చని గోల్డ్‌మెన్‌ సాక్స్‌ అంచనావేస్తున్నది. 

ఔన్స్‌ గోల్డ్‌ ధర 1,788 డాలర్లకు పరిమితమవగా, వెండి 18.34 డాలర్లుగా నమోదైంది. 2012 తర్వాత ధరలు ఈ స్థాయిలో పలకడం ఇదే తొలిసారి. స్టాక్‌ మార్కెట్లు కుప్పకూలుతుండటం, మరోవైపు ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతుండటంతో మదుపరులు బంగారాన్ని ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.