బీజింగ్‌: అగ్ర రాజ్యం అమెరికా, డ్రాగన్‌ చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఒకరి వ్యాపారాన్ని మరొకరు దెబ్బ తీసేందుకు సుంకాల కత్తులు దూస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఎదురవుతున్న పన్నుల ఒత్తిడిని తట్టుకునేందుకు చైనా తయారీదారులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఉత్పాదక వ్యయం తగ్గింపునకు గల ప్రతి అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు.

చైనాలో తయారయ్యే ప్రతి వస్తువుల్లో అత్యధిక భాగం విదేశాలకు ఎగుమతి అవుతోంది. నాణ్యత సంగతి పక్కన పెడితే, అత్యంత చౌకగా లభిస్తుండటంతో విదేశాల్లోని వ్యాపారులు ఎక్కువగా చైనా వస్తువులను దిగుమతికే మొగ్గు చూపుతారు. 

చైనా నుంచి దిగుమతి అయ్యే అనేక వస్తువులపై పెద్దన్న అమెరికా సుంకాలను విపరీతంగా పెంచింది. దీంతో తమ ఉత్పత్తులను వినియోగదారులకు చేర్చేందుకు చైనాలోని ఉత్పత్తిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

తమ వస్తువుల విక్రయానికి డిస్కౌంట్‌లు, వివిధ పన్నులపై రాయితీలు, శ్రామికులను తగ్గించుకోవడం, వేరొక దేశంలో తమ వస్తువులను ఉత్పత్తి చేయడం ఇలా దొరికిన ప్రతి అవకాశాన్ని చైనా కంపెనీలు వినియోగించుకుంటున్నాయి. 

పన్నుకు పన్ను పద్ధతిలో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో పలు వస్తువులు ప్రియమయ్యాయి. దీనికి తోడు యూరోపియన్‌ యూనియన్‌ డ్యూటీలు సైతం చైనా కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా విద్యుత్‌ బైక్‌లు, సోలార్‌ ప్యానెల్స్‌పై వీటి ప్రభావం ఎక్కువగా ఉంది. 

మార్చి గణాంకాలు మాత్రం చైనా వస్తువుల తయారీదారులకు ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. 2014 తర్వాత ఎగుమతులు సైతం అంచనాలను దాటుకుని వృద్ధి బాటలో ప్రయాణిస్తున్నాయి. 

అమెరికా మార్కెట్‌పై ఆధారపడి వస్తువులను తయారు చేస్తున్న చైనా కంపెనీలు మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఒకవేళ ఈ వాణిజ్య యుద్ధానికి తెరపడకపోతే, ఎలా ముందుకు సాగాలో కూడా ఆయా కంపెనీలు ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. 

తమ కంపెనీ తయారు చేసే వస్తువులపై 3-5శాతం డిస్కౌంట్‌ను ఇస్తున్నట్లు బాల్‌ బేరింగ్‌ తయారీ కంపెనీ సిక్సి ఫ్యూషీ మెషనరీ కంపెనీ ప్రతినిధి జానీ వాంగ్‌ తెలిపారు. రాయితీ ఇచ్చినా కూడా నష్టాలను భరించలేక 30వేల డాలర్ల విలువైన ఉత్పత్తిని నిలిపివేసినట్లు ఆమె పేర్కొన్నారు. అధికారికంగా ఒప్పందాలు పూర్తయిన తర్వాత ఉత్పత్తిని తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నట్లు చెప్పారు. 

చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలను 10-15శాతం పెంచినట్లు కాలిఫోర్నియాకు చెందిన ఏసీవో పవర్‌ వ్యవస్థాపకుడు జెఫ్రీ టాంగ్‌ తెలిపారు. ‘ధరలు పెంచడం తప్ప మాకు వేరే దారి లేదు’ అని ఆయన పేర్కొన్నారు.

పోర్టబుల్‌ ఫ్రిడ్జ్‌లను ఇతర దేశాల్లో తయారు చేయడం ఖర్చుతో కూడుకున్న పని అని ఏసీవో పవర్‌ వ్యవస్థాపకుడు జెఫ్రీ టాంగ్‌ చెప్పారు వాణిజ్య ఒప్పందాలు లేకపోతే పన్నులు పెరుగుతుంటే సమీకరణాలు మారిపోతాయన్నారు. అందుకే అన్ని పరికరాలను వియత్నాంకు పంపి అక్కడ అసెంబ్లింగ్‌ చేయిస్తున్నట్లు వెల్లడించారు. 

మరోవైపు పన్నుల ప్రభావంతో పెరిగిన అద్దెలు కట్టుకోలేక, కార్మికులకు వేతనాలు ఇవ్వలేక ఉద్యోగుల సంఖ్యలో కోత విధించినట్లు స్మార్ట్‌ఐ తెలిపింది. యూరోపియన్‌ యాంటి డంపింగ్‌ డ్యూటీలు పెరగడంతో ఎలక్ట్రిక్‌ బైక్‌ల తయారీదారులు వేగంగా స్పందించారు. 

చాలామంది బైక్‌లను దిగుమతి చేసుకోకుండా, కేవలం విడి భాగాలను దిగుమతి చేసుకుని వాటిని అసెంబ్లింగ్‌ చేస్తున్నారు. ‘బ్యాటరీ, ఫ్రేమ్‌, ఇతర విడిభాగాలను ఒక్కొక్కటిగా దిగుమతి చేసుకుంటున్నాం. వాటిని ఇక్కడ ప్రత్యేకంగా అసెంబ్లింగ్‌ చేయిస్తున్నాం’ అని జిహియాంగ్‌ ఎన్జీ వెహికల్‌ కంపెనీ సేల్స్‌ ప్రతినిధి డైలాన్‌ డీ తెలిపారు.