న్యూఢిల్లీ: ప్రస్తుతం పత్రికలు, టీవీ చానెళ్లలో తరుచుగా ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ గురించి వార్తలొస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాతోపాటు దేశీయంగా, అంతర్జాతీయంగా మెరుగైన విమానయాన సేవలందిస్తున్న సంస్థగా పేరొందింది జెట్ ఎయిర్ వేస్. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా సేవలందించడంలో సుశిక్షితులైన జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది పాత్ర ఎనలేనిది. ప్రస్తుతం లండన్‌లో తల దాచుకున్న మద్యం వ్యాపారి విజయ్ మాల్య సారథ్యంలోని కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ దారిలోనే  జెట్ ఎయిర్ వేస్ పయనిస్తున్నదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 

అయితే జెట్ ఎయిర్ వేస్ నిజంగానే సమస్యల్లో చిక్కుకున్నదని తెలుస్తోంది. కంపెనీ యాజమాన్యం తమ సంస్థ ఆర్ధిక పరిస్థితి బాగానే ఉన్నదని బయటకు చెబుతున్నా.. వాస్తవంగా ఆర్థిక ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నదన్న సంగతి అర్ధం అవుతూనే ఉంటుంది. సివిల్ ఏవియేషన్ రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న జెట్ ఎయిర్ వేస్ ఎదుర్కొంటున్న సమస్యలు దేశీయ పౌర విమానయాన రంగం నెలకొన్న తీవ్రమైన సంక్షోభానికి సంకేతమని ఆర్ధికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. 

2017 - 18 ఆర్థిక సంవత్సరంలో జెట్ ఎయిర్ వేస్ రూ.25 వేల కోట్ల ఆదాయం సంపాదించినా రూ.636 కోట్ల నష్టం వాటిల్లిందని ప్రకటించింది. సహచర విమాన యాన సంస్థ ఇండిగో దాదాపు రూ.25 వేల కోట్ల ఆదాయంతోపాటు సుమారు రూ.2,243 కోట్ల లాభం సాధించామని పేర్కొంది. ఇండిగో ప్రతి ప్రయాణికుడిపై కి.మీ.కు రూ.3.15 ఖర్చు చేసి, రూ.3.64 లాభం సంపాదిస్తుంది. 

ప్రతి ప్రయాణికుడిపై జెట్ ఎయిర్ వేస్ పలు రకాల ఆఫర్లతో కి.మీ.కు రూ.4.21 ఆదాయం గడించింది. కానీ ఖర్చు చేసిన మొత్తం రూ.4.49. దీంతో సంస్థ నష్టాల భారీన పడినట్లు ప్రకటించింది. ఫలితంగా విమాన సర్వీసుల నిర్వహణ వ్యయం క్రమంగా పెరుగుతోంది. ఏ యేటికాయేడు క్రమంగా పెరిగిన వ్యయ భారం జెట్ ఎయిర్ వేస్ నష్టాలకు, సమస్యల్లో చిక్కుకోవడానికి దారి తీసిందని తెలుస్తున్నది. 

జెట్ ఎయిర్ వేస్ కిలోమీటర్ దూరానికి రూ.4.49 ఖర్చు చేస్తూ ఉంటే, ఇండిగో రూ.3.15 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మందకోడిగా వ్యవహరించడం, పూర్ మేనేజ్మెంట్ అంశాలతో జెట్ ఎయిర్వేస్ వ్యవహరిస్తుందా? లేక నిధులను దారి మళ్లించిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. 

జెట్ ఎయిర్ వేస్ రుణ భారం రూ.11 వేల కోట్లకు చేరుతున్నదని అంచనాలు వ్యక్తం కాగా, ఇండిగో కేవలం రూ.3000 కోట్ల లోపే కావడం గమనార్హం. రూపాయి మారకం విలువ పతనం, అధిక ఇంధన ధరలతో పరిస్థితి విషమించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఇండిగో లాభాలే లేవని ప్రకటించింది. కానీ జెట్ ఎయిర్ వేస్ పరిస్థితి మరింత దారుణంగా మారడం వల్లే ఇప్పటి వరకు ఆర్థిక ఫలితాలను వెల్లడించలేదని తెలుస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తం అవుతున్నది. దీంతో స్టాక్ మార్కెట్‌లో జెట్ ఎయిర్ వేస్ షేర్ 66 శాతం నష్టపోయింది. వార్షిక ప్రాతిపదికన వేల కోట్ల రూపాయల మేరకు జెట్ ఎయిర్ వేస్ నష్టాల పాలవుతున్నదని సమాచారం. భారీ రుణాలు, వడ్డీరేట్ల భారం, కార్యకలాపాల నిర్వహణకు నగదు లభ్యత వంటి సమస్యలు ఎలా పరిష్కారం అవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న కానున్నది. జెట్ ఎయిర్ వేస్ సంస్థకు భారీగా రుణాలిచ్చిన సంస్థలేవి? భారీగా రుణ భారంతో సతమతం అవుతున్న జెట్ ఎయిర్ వేస్ ఎలా బయటపడుతుందని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

కానీ పరిస్థితులు డేంజర్ జోన్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ సంస్థలోకి భారీగా ఈక్విటీ రూపంలో నిధులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. లేదా బ్యాంకర్లు తాము గతంలో ఇచ్చిన రుణాలను పునర్వ్యవస్థీకరించాల్సి ఉంటుంది. కానీ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ మాదిరిగా ప్రధాన మార్పులు చేయడానికి బ్యాంకర్లు సిద్ధంగా లేరు..

అంత తెలివి తక్కువగా లేరు. వీటన్నింటి గురించి బ్యాంకర్లు, కంపెనీ మేనేజ్మెంట్, ఉద్యోగులు, ప్రభుత్వం, ప్రయాణికులు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని పౌరవిమానయాన రంగ నిపుణులు సూచిస్తున్నారు. ప్రత్యేకించి జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం ఇప్పటికైనా సరైన రీతిలో దర్యాప్తు చేయాలన్న సూచనలు వస్తున్నాయి. ఒకవేళ నిధులు దారి మళ్లించడంతో సంస్థ దెబ్బ తింటే అమాయక ఉద్యోగులు కష్టాల పాలవుతారన్న ఆందోళన కూడా వెంటాడుతున్నది. కనుక సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగుల నుంచి దిగువ స్థాయి వరకు సమాధానాలు రాబట్టాల్సిన అవసరం ఉంది. 

మరోవైపు బ్యాంకర్లు సాధారణ ప్రజలకు రుణాలిచ్చే విషయమై సవాలక్ష ప్రశ్నలేస్తారు. కానీ ఉన్నతస్థాయి వ్యక్తులు, గ్లామరస్ సంస్థలకు మాత్రం సరెండర్ అవుతారన్న విమర్శ వినిపిస్తున్నది. నిబంధనలను పట్టించుకోరన్న ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వం కూడా నిబంధనల అమలుపై పునరాలోచించాల్సిన అవసరం ఉన్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కంపెనీ ప్రైవేట్‌దైనా ఎస్బీఐ తరహా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. ఇటువంటి అంశాలపై జవాబుదారీగా ఉండాలన్న అభిప్రాయం వినిపిస్తోంది. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యం కూడా తన వ్యయ నిర్వహణ, ఆర్థిక యాజమాన్యంలో పారదర్శకంగా ఉండాలని సూచిస్తున్నారు.