నా దారి రహదారి అంటే కుదర్దు: హెచ్1బీపై పేచీతో మనకే నష్టం.. ట్రంప్‌కు సీఈఓల లేఖ

హెచ్1 బీ వీసా విధానంలో మార్పులు చేయడానికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కట్టుబడి ఉండటంతో ఆ దేశంలోని వివిధ కంపెనీల సీఈఓలు ఆందోళనకు గురయ్యారు. తక్షణం నిబంధనల్లో మార్పులు తెచ్చే అంశాన్ని విరమించుకోవాలని, పట్టు విడుపులు ప్రదర్శించాలని ట్రంప్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tim Cook, Indra Nooyi and 57 Other US CEOs Call Out Trump For 'Disruptive' H1-B Visa Policy

న్యూయార్క్‌: ట్రంప్‌ ప్రభుత్వ వీసా విధానాలపై ప్రముఖ అమెరికన్‌ కంపెనీల సారథులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్‌1బీ వీసాలతోపాటు వలస చట్టాల్లో మార్పులతో అమెరికాకు, ఇప్పటి వరకు అమెరికా సంస్థల పోటీ తత్వానికే నష్టమని హెచ్చరించారు. వ్యాపార అనిశ్చితి పెరుగుతుందని, ఆర్థిక వృద్ధికి గండిపడుతుందని యూఎస్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టిన్‌ నీల్సన్‌కు అందజేసిన లేఖలో వారు హెచ్చరించారు. 

యాపిల్‌ కంప్యూటర్స్‌ సారథి టిమ్‌కుక్‌, పెప్సికో సీఈఓ ఇంద్రా నూయి, మాస్టర్‌ కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగా, జేపీ మోర్గాన్‌ చీఫ్‌ జేమీ డిమోన్‌, అమెరికన్‌ ఎయిర్‌లైన్స్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డగ్‌ పార్కర్‌, సిస్కో సిస్టమ్స్‌ చైర్మన్‌ చక్‌ రాబిన్స్‌తోపాటు మొత్తం 59 కంపెనీల సీఈఓలు ఆ లేఖపై సంతకం చేశారు. అమెరికా చట్టాలను గౌరవిస్తున్న నిపుణులైన విదేశీ ఉద్యోగుల జీవితాలను ట్రంప్ ప్రతిపాదిత చట్టాలు ఆందోళనకు గురి చేస్తున్నాయన్నారు. 

అస్థిర విధానాలతో అమెరికా సంస్థల కార్యకలాపాలకు భంగం కలుగుతుందని హెచ్చరించారు. దాంతో సంస్థల పోటీతత్వం తగ్గడంతోపాటు విదేశాల నుంచి వలస వచ్చిన ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రీన్‌ కార్డుల కొరత వల్ల చాలా మంది ఉద్యోగులు దశాబ్దకాలంగా ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియలో ఇరుక్కుపోయారని సీఈఓలు తమ లేఖలో గుర్తు చేశారు. కనుక అమెరికన్‌ కంపెనీలకు అనవసర ఖర్చులు, చిక్కులు తప్పాలంటే అర్ధంతరంగా నిబంధనలు మార్చవద్దని సూచించారు. 

విదేశీ నైపుణ్యం గల ఉద్యోగుల్లో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమకు మాత్రమే పరిమితం అన్న అభిప్రాయం ఉండేదని, కానీ హెచ్ 1 బీ వీసా పొందుతున్న వారిలో ఆర్కిటెక్ లు, ఆర్థికవేత్తలు, డాక్టర్లు, ఉపాధ్యాయులు, ఇతర వ్రుత్తుల్లో జీవనం సాగిస్తున్న వారు ఉన్నారని సీఈఓలు గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం హెచ్1 బీ వీసా పట్ల సర్కార్ అనుసరిస్తున్న విధానం ఆందోళనకు గురి చేస్తున్నదని స్పష్టం చేశారు. 

గత జూలైలో విడుదల చేసిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికా పాలసీ ప్రకారం వీసాలు నిరాకరిస్తున్న ఘటనలు పెరుగుతున్నాయని అమెరికా సంస్థల సీఈఓలు తెలిపారు. ఏళ్ల తరబడి హెచ్ 1 బీ వీసా అమలు చేయడంతో అత్యధికంగా లబ్ధి పొందుతున్న సంస్థల్లో భారత ఐటీ దిగ్గజాలే కావడం గమనార్హం. కాకపోతే ఇటీవల నార్త్ కరోలినాలో ఇన్ఫోసిస్ స్థానిక అమెరికన్లు నాలుగు వేల మందికి శిక్షణనిచ్చి మరీ ఉద్యోగావకాశాలు కల్పించింది. 

ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో గతనెలలో ఆమోదం పొందిన వర్క్‌ వీసా తరహా మరో దరఖాస్తుకు ప్రస్తుతం అనుమతి లభిస్తుందో లేదో కూడా తెలియనంత గందరగోళం నెలకొందని అమెరికా కంపెనీల సీఈఓలు ఆందోళన వ్యక్తం చేశారు. నిపుణులకు జారీ చేసే హెచ్‌1బి వీసాల సమీక్ష ప్రక్రియలో మార్పులతోపాటు హెచ్‌1బి వీసాపై అమెరికాలో పనిచేస్తున్న వారి జీవిత భాగస్వాముల విషయమై మారనున్న నిబంధనలపై తమ యాజమాన్యాలు కలత చెందుతున్నాయన్నారు. ఇటీవల తీసుకున్న ప్రత్యేక నియంత్రణ చర్యలతో ఐటీ నిపుణుల జీవిత భాగస్వాములను ఏ క్షణంలోనైనా తొలిగించే పరిస్థితి నెలకొన్నదని వారు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. అదే జరిగితే నిపుణులు తమ కుటుంబాలపై దీర్ఘ కాల ప్రభావం పడుతుందన్న ఆందోళనలో ఉన్నారని తెలిపారు. 

హెచ్‌1బీ వీసా జీవిత భాగస్వాములకు సంబంధించిన నిబంధనల్లో ప్రతిపాదిత మార్పుల వల్ల నిపుణులు అమెరికాను వీడి విదేశాల్లో అవకాశాలు వెతుక్కునే ప్రమాదం ఉందని ట్రంప్‌ను సీఈఓలు హెచ్చరించారు. కనుక అమెరికాలో నిపుణుల కొరత రికార్డు స్థాయికి పెరిగిన నేపథ్యంలో వలస విధానాల్లో మార్పులు చేయడానికి ఇది సరైన సమయం కాదని హితవు చెప్పారు. విదేశ నిపుణులను ఆకర్షించేందుకు హెచ్‌1బి వీసాలను మరింత పెంచాలని, అమెరికా విశ్వవిద్యాలయాల్లో ఉన్నత డిగ్రీలు పూర్తి చేసిన విదేశీయులు తక్షణమే గ్రీన్‌కార్డు పొందేందుకు అర్హత కల్పించాలని అమెరికా కంపెనీల సీఈఓలు డిమాండ్ చేశారు. 

కానీ ట్రంప్ ప్రతినిధి నీల్సన్ వైట్ హౌస్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వం కేవలం చట్టాన్ని కఠినతరం మాత్రమే చేస్తున్నదని చెప్పారు. కుటుంబాలను విడదీసేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఎటువంటి విధానాన్ని తయారు చేయలేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారికి ఏమాత్రం మినహాయింపులు ఇవ్వరాదన్నదే తమ ప్రభుత్వ విధానమని చెప్పారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios