Asianet News TeluguAsianet News Telugu

చిన్న పట్నాల్లోనూ ‘ఈ-కామర్స్‌’ మోజు: 3$ బిలియన్లకు టర్నోవర్?

ఇంతకుముందు మెట్రోపాలిటన్ సిటీలకు పరిమితమైన ఈ- కామర్స్ సేల్స్ చిన్న పట్టణాలు, నగరాలకు విస్తరించాయి. పండుగల సీజన్ ముగిసే నాటికి ‘ఈ- కామర్స్’ టర్నోవర్ మూడు కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా.
 

Tier II, III cities' shoppers throng e-commerce sites for festive offers
Author
New Delhi, First Published Oct 15, 2018, 8:55 AM IST

దసరా, దీపావళి పండుగల సందర్బంగా ఈ-కామర్స్ కొనుగోళ్లు అదిరిపోతున్నాయి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, పేటీఎం తదితర ఈ-కామర్స్ కంపెనీలు వందల కోట్ల వ్యాపారం చేస్తున్నాయి. అన్నింటి కన్నా ఆశ్చర్యకరంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఈ అమ్మకాలు భారీ ఎత్తున జరుగుతున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ కంపెనీలు ఇచ్చిన భారీ డిస్కౌంట్లు బాగానే వర్కవుట్ అవుతున్నాయి. ఈ డిస్కౌంట్లు దీపావళి వరకూ కొనసాగనున్నాయి.

కొత్త వినియోగదారులు మూడింతలు పెరిగినట్టు అమెజాన్ సీనియర్ ఉపాధ్యక్షుడు అమిత్ అగర్వాల్ తెలిపారు. ఇందులో అత్యధికంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోంచే ఉన్నారన్నారు. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ అన్ని విభాగాల్లోనూ రికార్డ్ బ్రేకింగ్ అమ్మకాలు జరుగుతున్నట్టు ప్రకటించింది.

మొబైల్ ఫోన్లు గృహోపకరణాల అమ్మకాలు గతంలో ఎన్నడూ లేనంతగా జరుగుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లోనే పండుగ సీజన్ అమ్మకాల లక్ష్యాన్ని చేరుకున్నట్టు చెప్పారు.

కన్సల్టెన్సీ వేదిక రెడ్ సీర్ తెలిపిన వివరాల మేరకు ఇప్పటికే 46 లక్షల స్మార్ట్ ఫోన్లు (800 మిలియన్ల డాలర్లు) ఆన్‌లైన్‌లో అమ్ముడు పోతే, 170 మిలియన్ల విలువైన గ్రుహోపకరణాలు, 120 మిలియన్ల డాలర్ల విలువైన ఫ్యాషన్ వస్తువుల కొనుగోళ్లు జరిగాయి.

కానీ ఈ రెండు ఈ-కామర్స్ కంపెనీలు నికరంగా ఎంత అమ్మకాలు జరిపింది మాత్రం చెప్పలేదు. ఈ రెండు కంపెనీల సైట్లలో కనిపిస్తున్న బ్రాండ్లు, డిస్కౌంట్లకుతోడు సులభ ఫైనాన్సింగ్ ఆప్షన్లతో వినియోగదారులు ఆకర్షితులయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దాదాపు వంద పట్టణాల నుంచి 6 కోట్ల మంది తమ పేటీఎం మాల్‌ను సందర్శించారని ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా తెలిపారు.

ఈ సంఖ్య మెట్రో నగరాలకు అదనమని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న కొనుగోళ్ల ఊపు కొనసాగితే 500 కోట్ల డాలర్ల అమ్మకాలను సాధించే అవకాశాలున్నట్టు పేటీఎం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ సిన్హా చెప్పారు.

ఇదిలాఉండగా, ఇప్పటికే కొత్త వినియోగదారులు 38 శాతం మేర ఉన్నారని స్నాప్‌డీల్ తెలిపింది. ఆదివారం నాటికి 15 లక్షల ఆర్డర్లను పొందినట్టు షాప్‌క్లూస్ పేర్కొంది. తమకు మూడు, నాలుగో తరగతి పట్ణాణాల నుంచి కూడా ఆర్డర్లు అందుతున్నాయని వెల్లడించింది. ప్రత్యేకించి కర్ణాటక, కేరళ, తమిళనాడు, అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఆన్ లైన్ కొనుగోళ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది.

పండుగ సీజన్ అమ్మకాలను పేటీఎం మాల్ అక్టోబర్ 9 నుంచే ప్రారంభించగా, మిగతా ఈ-కామర్స్ కంపెనీలు 10వ తేదీ నుంచి ప్రారంభించాయి. కొన్నిసోమవారంతోనే ఆఫర్లు ముగుస్తున్నాయి. అయితే దీపావళికి మరిన్ని ఆఫర్లతో రావాలని చూస్తున్నాయి.

కాగా, గత మూడు రోజుల్లోనే రూ. 11,085 కోట్ల అమ్మకాలను జరిపినట్టు రెడ్‌సీర్ కన్సల్టింగ్ అంచనా వేసింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు 46 లక్షల మేరకు జరగ్గా, గృహోపకరణాలు కోటీ 70 లక్షల యూనిట్లను విక్రయించాయని తెలిపింది.

పండుగల సీజన్ ముగిసేనాటికి ఈ ఏడాదికి నిర్దేశించుకున్న300 కోట్ల డాలర్ల అమ్మకాల లక్ష్యాన్ని ఈ-కామర్స్ పరిశ్రమ చేరుకోగలదని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఆన్ లైన్ విక్రయాలు రెట్టింపు అవుతాయని నిర్ధారణకు వచ్చారు. చిన్న చిన్న పట్టణ వాసులు కూడా ఆన్ లైన్ కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios