Titan Share: టైటాన్ అంటే తరతరాల నమ్మకం, టాటా గ్రూపునకు చెందిన ఈ కంపెనీ షేర్లు మార్కెట్లో దూసుకెళ్తున్నాయి. కేవలం చేతి గడియారాలకు మాత్రమే పరిమితం కాకుండా, అనేక విభాగాల్లో కంపెనీ మంచి వృద్ధి సాధిస్తోంది. దీంతో కంపెనీ లాభదాయకత పెరుగుతోంది.
గురువారం, బిఎస్‌ఇలో ప్రారంభ ట్రేడింగ్‌లో టైటాన్ షేర్లు 6 శాతం లాభపడ్డాయి. ఆ తర్వాత కంపెనీ షేరు ధర రూ.2,133 స్థాయికి చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను కంపెనీ బుధవారం విడుదల చేసింది. ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో కంపెనీ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఈ స్టాక్ పనితీరు గురించి నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.
టైటాన్ టార్గెట్ ధర రూ.2520గా ఫిక్స్ చేసిన బ్రోకరేజ్ సంస్థ..
టైటాన్ పనితీరుపై దేశీయ బ్రోకరేజ్ సంస్థ ప్రభుదాస్ లిల్లాధర్ వ్యాఖ్యానిస్తూ, “టైటాన్ వృద్ధికి కొత్త ఆభరణాల, ఔట్ లెట్స్ తెరవడం కూడా ఒక కారణంగా ఉంది. ప్రాంతీయ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని వివాహ విభాగం, తేలికపాటి ఆభరణాలు, డిజైన్, ప్రమోషన్‌పై కంపెనీ దృష్టి సారించింది. టైటాన్ కంపెనీ స్టాక్ ధర రూ. 2520 స్థాయికి వెళ్లగలదని బ్రోకరేజ్ బలంగా నమ్ముతోంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ 463 కొత్త స్టోర్లను తెరిచింది. Wearables,Taneri,Carat Line వంటి కంపెనీ కొత్త వ్యాపారాలు లాభాలను ఆర్జించగలదని బ్రోకరేజ్ బలంగా నమ్ముతోంది.
ఈ స్టాక్ గురించి బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం, “టైటాన్ మా మొదటి ఎంపికగా కొనసాగుతోంది. కంపెనీలో వేగంగా వృద్ధి కనిపిస్తోంది. టాటా గ్రూపునకు చెందిన ఈ స్టాక్‌కు మోతీలాల్ ఓస్వాల్ BUY రేటింగ్ ఇచ్చింది. అదే సమయంలో ఒక్కో షేరుకు రూ.2900 టార్గెట్ ధరను నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఆభరణాల విభాగంలో కంపెనీ 207% వృద్ధిని నమోదు చేసింది. ఆభరణాల విభాగం కంపెనీ ఆదాయానికి 85% వాటా ఇస్తుంది.
గడియారాలు, వేరబుల్స్ విభాగంలో రికార్డు సేల్స్..
FY 2023 మొదటి త్రైమాసికంలో, గడియారాలు, వేరబుల్స్ అమ్మకాలలో కంపెనీ 158 శాతం వృద్ధి నమోదైంది, ఇది త్రైమాసిక ఆదాయంలో అత్యధిక భాగం కావడం విశేషం. మల్టీ-బ్రాండ్ రిటైల్ (MBR), టైటాన్ వరల్డ్, లార్జ్ ఫార్మాట్ స్టోర్స్ (LFS) ప్రధాన ఛానెల్‌లు FY 2022 నుండి మంచి వృద్ధి సాధించాయి. ఏప్రిల్, మే నెలల్లో కంపెనీకి చెందిన అన్ని బ్రాండ్‌లు మంచి సేల్స్ సాధించాయి.
ఐ కేర్ విభాగంలో టైటాన్ రికార్డు...
టైటాన్ ఐ కేర్ విభాగం కింద కళ్లద్దాలు,కాంటాక్టు లెన్సుల విక్రయంలో కంపెనీ ఏడాది ప్రాతిపదికన 176 శాతం వృద్ధిని సాధించింది. ఏడాది ప్రాతిపదికన పెర్ఫ్యూమ్స్ విభాగం 262 శాతం వృద్ధి చెందగా, ఫ్యాషన్ ఉపకరణాలు ఏడాది ప్రాతిపదికన 293 శాతం వృద్ధిని సాధించాయి.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అనేది రిస్కుకు లోబడి ఉంటుంది. దయచేసి పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించండి.)
