జూమ్ కాల్ ద్వారా 800 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది పీ అండ్ ఓ ఫెర్రీస్ అనే కంపెనీ. బ్రిటన్‌కు చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ ఇది.
కొద్దిరోజుల కిందటే విశాల్ గర్గ్ సారథ్యంలోని బెటర్ డాట్ కామ్ కంపెనీ సింగిల్ జూమ్ కాల్ ద్వారా 900 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ ఘటన కార్పొరేట్ సెక్టార్‌లో తీవ్ర కలకలం రేపింది. విశాల్ గర్గ్ వ్యవహారం వివాదాస్పదమైంది. ఆయనపై విమర్శల జడివాన కురిసింది. నెటిజన్లు ట్రోల్ చేశారు. ఆయన వైఖరిని ఎండగట్టారు. కార్పొరేట్ సెక్టార్‌లో ఇదో అనారోగ్యకరమైన వాతావరణానికి దారి తీసిందంటూ కామెంట్స్ చేశారు.
ఇప్పుడు తాజాగా మరో కంపెనీ- అదే బాటలో ప్రయాణించింది. జూమ్ కాల్ ద్వారా 800 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది.. పీ అండ్ ఓ ఫెర్రీస్ అనే కంపెనీ. బ్రిటన్‌కు చెందిన షిప్పింగ్ కార్పొరేషన్ ఇది. జూమ్ కాల్‌ను ప్రారంభించిన మూడే మూడు నిమిషాల్లో ఉద్యోగులను తొలగించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో మెసేజీని కూడా వారికి పంపించింది. వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడానికి గల కారణాలను వివరించింది.
ఈ 800 మంది ఉద్యోగుల్లో షిప్ క్రూ యూనిట్ పెద్ద సంఖ్యలో ఉన్నట్లు బ్రిటన్ మీడియా తెలిపింది. సంస్థకు చెందిన షిప్‌ల నిర్వహణను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల క్రూ యూనిట్‌ను మిగులు ఉద్యోగులుగా గుర్తించింది. నిర్వహణ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించడం వల్ల ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తోందని, దీనిపట్ల తాము చింతిస్తున్నాం అంటూ పీ అండ్ ఓ ఫెర్రీస్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఈ వీడియోలో ద్వారా స్పష్టం చేశారు. ఉద్యోగం నుంచి టెర్మినేట్ చేస్తున్నామని, ఇవ్వాళే చివరి రోజు అంటూ స్పష్టం చేశారు.
రెండేళ్లుగా పీ అండ్ ఓ ఫెర్రీస్ నష్టాలను చవి చూస్తూ వస్తోంది. 200 మిలియన్ యూరోల మేర నష్టపోయంది. నష్టాలు పేరుకుపోవడం వల్ల షిప్‌ల నిర్వహణను థర్డ్ పార్టీకి అప్పగించాల్సి వచ్చిందని, మిగులు ఉద్యోగులను తొలగిస్తున్నామని వివరణ ఇచ్చిందా కంపెనీ. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఒకేసారి 800 మందిని తొలగించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఎంపీ కార్ల్ టర్నర్ సైతం ఈ చర్యను తప్పు పట్టారు. ఈ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
