వాషింగ్టన్‌: ‘అమెరికన్ ఫస్ట్’ నినాదం అందుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను అనుకున్న నిర్ణయానికే కట్టుబడి ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు భారతీయ ఐటీ నిపుణులంతా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించాలని ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లుతూ హెచ్‌-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేసేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ వీసాకు సంబంధించి ఉపాధి, నైపుణ్య ఉద్యోగాల నిర్వచనాన్ని సవరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

పిల్లలు, జీవిత భాగస్వాములకు ‘హెచ్‌-4 వీసా’ ఉద్యోగ అనుమతులు రద్దు చేసేందుకూ సిద్ధమవుతున్నట్లు అమెరికా ‘హోంలాండ్‌ భద్రతా విభాగం(డీహెచ్‌ఎస్‌)’ స్వయంగా తెలిపింది. డీహెచ్‌ఎస్‌ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే.. అమెరికాలోని భారతీయ ఐటీ సంస్థలు, భారతీయ అమెరికన్లకు చెందిన పలు చిన్న, మధ్య తరహా సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. 
హెచ్‌-1బీ వీసాల ద్వారా విదేశీ నిపుణులను అమెరికా సంస్థలు నియమించుకుంటాయి. ఆ దేశానికి వెళ్లేందుకు భారతీయ ఐటీ నిపుణులు ఎక్కువగా ఈ వీసాలపైనే ఆధారపడుతుంటారు. హెచ్‌-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు, సంతానానికి హెచ్‌-4 వీసాలు మంజూరు చేస్తుంటారు. వారు కూడా ఉద్యోగాలు చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలోగా ‘హెచ్‌-1బీ’పై నూతన ప్రతిపాదనలు చేయాలని యోచిస్తున్నట్లు డీహెచ్‌ఎస్‌ వెల్లడించింది. 

అత్యుత్తమ ప్రతిభ కల విదేశీయులే హెచ్‌-1బీ వీసా అందుకునేందుకు వీలుగా ‘నైపుణ్య ఉద్యోగం’ నిర్వచనాన్ని సవరిస్తామని తెలిపింది. అమెరికా ఉద్యోగులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఉపాధి, ఉద్యోగి-యజమాని సంబంధాల నిర్వచనాలనూ మారుస్తామని పేర్కొంది. హెచ్‌-1బీ వీసాదారులకు యజమానులు సముచిత వేతనాలు చెట్టించేలా అదనపు రక్షణ చర్యలూ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

హెచ్‌-4 వీసాదారులకు ఉద్యోగ అనుమతులు కల్పిస్తూ బరాక్‌ ఒబామా పాలనలో తీసుకొచ్చిన నిబంధనను రద్దు చేయాలని కూడా డీహెచ్‌ఎస్‌ యోచిస్తోంది. స్వదేశీయులకు ఉపాధి అవకాశాలు పెరగడంలో ఈ చర్య దోహదపడుతుందని అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఉద్యోగ అనుమతులు పొందిన 70 వేలమందికిపైగా హెచ్‌-4 వీసాదారులకు డీహెచ్‌ఎస్‌ నిర్ణయం శరాఘాతం కానున్నది. వారిలో ఎక్కువమంది భారతీయ అమెరికన్‌ మహిళలే కావడం గమనార్హం.

భారతీయ ఐటీ నిపుణలకు ప్రతికూలంగా హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో అమెరికా కఠిన మార్పులు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ స్పందించారు. వీసాల అంశంపై ట్రంప్‌ ప్రభుత్వంతో, అమెరికా చట్టసభ(కాంగ్రెస్‌)తో తాము ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.

అమెరికా జారీ చేస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్లలో ప్రతి నలుగురిలో ముగ్గురు భారతీయులేనని అమెరికా అధికారిక నివేదిక తెలిపింది. అమెరికా సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) నివేదిక ప్రకారం 4,19,637 మంది వీసాదారుల్లో భారతీయులు 3,09,986 మంది భారతీయులు ఉన్నారు. గమ్మత్తేమిటంటే లింగ వివక్ష కూడా భారీగానే ఉంది. నలుగురు భారతీయులు హెచ్ 1బీ వీసా పొందితే వారిలో ఒక్కరే మహిళలు ఉండటం గమనార్హం. 

అంటే అమెరికా హెచ్1 బీ వీసాదారుల్లో 73.9 శాతం మంది భారతీయులు అయితే 47,172 మంది చైనీయులు ఉన్నారు. చైనీయుల్లో లింగ వివక్ష అంతగా కానరాదు 54.5 శాతం మంది పురుషులు ఉంటే 45.2 శాతం మంది పురుషులు ఉంటారు. భారత్, చైనా తర్వాత 1.1 శాతం మంది కెనడా, దక్షిణ కొరియన్లు హెచ్ 1 బీ వీసా పొందగా, మిగతా అన్ని దేశాల పౌరులు కలిసి ఒక్క శాతం లోపే హెచ్1 బీ వీసా అందుకున్న వారిలో ఉన్నారు.