ప్రతిష్టాత్మక ఏరో ఇండియా 2023 భారత్, అమెరికా రక్షణ ఒప్పందంలో సరికొత్త అధ్యాయానికి తెర లేపింది. భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎయిర్-లాంచ్డ్ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రోటోటైప్ విమానం ఈ సంవత్సరం సెప్టెంబర్ నాటికి టెస్టింగ్ దశకు చేరుకుంటుందని ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ డిప్యూటీ అండర్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ మేజర్ జనరల్ జూలియన్ సి చీటర్ స్వయంగా పేర్కొనడం విశేషం. 

భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఎయిర్-లాంచ్డ్ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ ప్రోటోటైప్ (UAV prototype) సెప్టెంబర్ 2023 నాటికి టెస్టింగ్ దశలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఏరో ఇండియా 2023 లాంచ్ సందర్భంగా అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అసిస్టెంట్ డిప్యూటీ అండర్ సెక్రటరీ, ఇంటర్నేషనల్ అఫైర్స్ మేజర్ జనరల్ జూలియన్ సి చీటర్ ఈ మేరకు ప్రకటిస్తూ, ఇలా అన్నారు: "ఎయిర్-లాంచ్ చేసిన UAVకి సంబంధించి, మేము త్వరలోనే విమాన-పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొన్నారు.. 2023 సెప్టెంబర్ నాటికి ఇది టెస్టింగ్ దశకు చేరకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది భారత్, అమెరికా సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రాజెక్టు కావడం విశేషం. దీనిపై మరిన్ని విషయాలను ఆయన పంచుకుంటూ, మేము ఈ ప్యాకేజీలో భాగంగా సెన్సార్‌లను అభివృద్ధి చేస్తున్నామని, UAV C-130J విమానం త్వరలోనే ప్రయోగదశకు చేరకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఇది ఏడేళ్ల ప్రాజెక్ట్ ఏర్పాటు కావడం గమనార్హం. దీన్ని బట్టి ఇది దీర్ఘకాలిక ఒప్పందంగా చెప్పవచ్చని రక్షణ నిపుణులు చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ (DTTI)లో జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఎయిర్ సిస్టమ్స్ కింద ఎయిర్-లాంచ్ UAV ప్రాజెక్ట్ ఒప్పందం జూలై 2021లో ముగిసింది. యుఎవిని యుఎస్ ఎయిర్ ఫోర్స్ రీసెర్చ్ లాబొరేటరీ, ఇండియాస్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ), ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కలిసి రూపొందించి, అభివృద్ధి చేస్తున్నాయి. రక్షణ రంగంలో భారత్‌తో పలు ఒప్పందాల కోసం అమెరికా ముందుకు వస్తున్న తరుణంలో మేజర్ జనరల్ చీటర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు. 

దీనిపై అమెరికన్ మేజర్ జనరల్ చీటర్ మాట్లాడుతూ, "ఇండో-పసిఫిక్‌ మహా సముద్రాలను పంచుకుంటున్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలైన, యునైటెడ్ స్టేట్స్, భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలతో కలిసి అడుగు వేస్తాయని, ఏరో ఇండియా వంటి ప్రపంచ స్థాయి ఈవెంట్‌ల ద్వారా ఈ బంధం మరింత బలపడిందన్నారు. ఇలాంటి ఈవెంట్ల ద్వారా పరస్పర నమ్మకం, అవగాహన పెంచుకోవడానికి వ్యక్తిగతంగా నిమగ్నమవ్వడానికి దోహద పడుతుందని ఆయన అన్నారు. 

భారతదేశం-అమెరికా సంబంధాలు ఇప్పుడు ఎంత బలంగా ఉన్నాయో అనే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇలా అన్నారు: "అమెరికా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంతో ఎక్కువ సైనిక విన్యాసాలను ఇప్పటికే చేస్తోంది. భారతదేశాన్ని తమ రక్షణ భాగస్వామిగా ఎందుకు గుర్తించాము అనే దానికి ఇది సరైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. 

అంతకుముందు, ఏరో ఇండియా 2023కి అమెరికా ప్రతినిధి బృందం అధిపతి, అంబాసిడర్ ఎ ఎలిజబెత్ జోన్స్, గత సంవత్సరంలో భారత్, యుఎస్ మధ్య పెరుగుతున్న దౌత్య, భద్రతా సహకారాన్ని 'వ్యూహాత్మక భాగస్వామ్యం తమకు అత్యంత ముఖ్యమైన సంబంధాలలో ఒకటి అని పేర్కొనడం గమనార్హం.

అమెరికన్ రాయబారి జోన్స్ మాట్లాడుతూ "భారత్, యునైటెడ్ స్టేట్స్ కలిసి స్వేచ్ఛగా కలిసి పనిచేస్తాయని తద్వారా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి వెల్లివిరిసేందుకు శాయశక్తులా కృషి చేస్తామని పేర్కొన్నారు. అంతేకాదు ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికాలు భాగస్వాములుగా కలిసి పనిచేయడం ద్వారా, వాతావరణ మార్పులను పరిష్కరించడం, ప్రపంచ ఆరోగ్య రంగాన్ని మెరుగుపరచడం, కరోనా లాంటి ఇతర మహమ్మారుల కోసం సిద్ధం అవడం, సైబర్ సవాళ్లపై సహకారం, నాణ్యమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం, స్థిరమైన సప్లై చెయిన్ నిర్వహణ వంటి రంగాల్లో భారత్ తో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అంతరిక్ష వాహనాల భాగాల నుండి సెమీకండక్టర్ల వరకు క్లిష్టమైన సాంకేతికతలపై ఇరు దేశాల సహకారం నానాటికీ బలోపేతం అవుతోందని ఈ సందర్బంగా జోన్స్ పేర్కొన్నారు.