Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ ట్రేడ్ వార్ అంటే మజాకా: అమెరికన్లపై 12.2 బిలియన్ డాలర్ల భారం

అగ్రరాజ్యం అమెరికా విధిస్తున్న వాణిజ్య దిగుమతి సుంకాల ప్రభావం ఆ దేశ పౌరులకే చుట్టుకుంటున్నది. ఏటా 12.2 బిలియన్ డాలర్ల మేరకు అమెరికన్లు నష్టపోవాల్సి వస్తుందని తెలుస్తోంది.

The Trade War With China Has an Upside for Consumers, Too
Author
Washington D.C., First Published Jun 23, 2019, 11:03 AM IST

 అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం ఆ దేశస్థులకే భారంగా మారింది. చైనా నుంచి దిగుమతి అయ్యే 300 బిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులపై సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీంతో అమెరికన్లు అదనంగా 12.2 బిలియన్‌ డాలర్లను వెచ్చించాల్సి వస్తోంది.  

అమెరికన్లు ముఖ్యంగా దుస్తులు, ఫుట్‌వేర్‌, గృహోపకరణలపై ఈ భారం పడుతోందని ది నేషనల్‌ రీటైల్‌ ఫెడరేషన్‌(ఎన్‌ఆర్‌ఎఫ్‌)  పేర్కొంది. టారీఫ్‌ల వల్ల దుస్తులపై 4.4బిలియన్‌ డాలర్లు, పాదరక్షలపై 2.5 బిలియన్‌ డాలర్లు, బొమ్మలపై 3.7 బిలియన్‌ డాలర్లు, గృహోపకరణాలపై 1.6 బిలియన్‌ డాలర్లు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. 

‘ఇదే పరిస్థితి కొనసాగితే మార్కెట్లు ఈ వ్యాపారాలకు అనుకూలంగా ఉండవు. దిగుమతుల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంటుంది.కొద్ది  రోజులు చైనా సరఫరాదారులనే కొనసాగించి ఆ భారం వినియోగదారులపై మోపుతారు’ అని ఎన్‌ఆర్‌ఎఫ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డేవిడ్‌ఫ్రెంచ్‌ తెలిపారు. 

మరోపక్క అమెరికా ఫ్యాషన్‌ ఇండస్ట్రీ అసోసియేషన్‌ లెక్కల ప్రకారం టారీఫ్‌ల కారణంగా వినియోగ దారులపై 4.9 బిలియన్‌ డాలర్ల మేరకు అదనపు భారం పడుతోందని తేలింది. ఇదిలా ఉంటే అమెరికా వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది.

తమ ఎగుమతులపై భారీగా సుంకాలు విధించిన అమెరికా ఎగుమతులపై ప్రతిగా టారిప్‌లు చైనా పెంచేసిన సంగతి తెలిసిందే. అయితే తమ నుంచి వస్తువులు దిగుమతి చేసుకునే ఇతర దేశాలపై సుంకాల భారం తగ్గించి వేస్తోంది చైనా.

2018 నుంచి అమెరికా ఎగుమతులపై చైనా 20.7 శాతం సుంకాలు పెంచింది. కానీ ఇవే ఉత్పత్తులను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే సగటున సుంకం 6.7 శాతంగా ఉంటోంది. 

అమెరికా విసిరిన ప్రతిబంధకాలకు ప్రత్యామ్నాయంగా ప్రపంచ దేశాలకు రెడ్ కార్పెట్ మార్గాలు కల్పించింది చైనా. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా 140 కోట్ల మంది మార్కెట్ ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

ఉదాహరణకు కెనడా, బ్రెజిల్, జపాన్, యూరప్ యూనియన్ సభ్య దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు 14 శాతం తక్కువ. ఇండోనేషియా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి చౌకగా అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నట్లే చైనా కూడా అమెరికా మిత్ర దేశాల మార్కెట్లపై కేంద్రీకరించింది. 

అధ్యక్షుడు ట్రంప్ అమలు చేస్తున్న సుంకాల పెంపు విధానంతో చైనాపై మోయలేని భారం పడుతుందని అధికార యంత్రాంగం నమ్మ బలుకుతోంది. కానీ ఇక ముందు ఏమాత్రం చైనా నుంచి దిగుమతులపై సుంకాలు విధించొద్దని వాల్ మార్ట్ సహా అమెరికాలోని 600 కంపెనీలకు పైగా ప్రభుత్వానికి లేఖ రాశాయి. 

సుంకాలను పెంచడంతో ప్రతి ఏటా సగటున 20 లక్షల ఉద్యోగాలపై ప్రభావం పడుతుందని ఆయా సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. సగటున ఒక్కో కుటుంబంపై రెండు వేల డాలర్ల ప్రభావం పడుతుందని, 20 లక్షల ఉద్యోగాలు నష్టపోవాల్సి వస్తుందని చెబుతున్నాయి. ప్రతి అమెరికన్ పై సగటున 414 డాలర్ల భారం పడుతోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios