ప్రారంభ లాభాలను ఆవిరి చేస్తూ, బుధవారం స్టాక్ మార్కెట్ కీలక సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్ నష్టాల్లో ముగిశాయి.నిఫ్టీ సూచీ 71.15 పాయింట్లు పడిపోయి 16,972 వద్ద ముగిసింది. BSE సెన్సెక్స్ 344.29 పాయింట్లు నష్టపోయి 57,555 పాయింట్ల వద్దకు ముగిసింది.  బ్యాంక్ నిఫ్టీ 359.90 పాయింట్లు నష్టపోయింది. 

బుధవారం మార్కెట్లు నెగిటివ్ గా ముగిశాయి. వరుసగా మూడో రోజు కూడా స్టాక్ మార్కెట్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ 17000 పాయింట్ల దిగువన ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 344.29 పాయింట్లు క్షీణించి 57,555 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 71 పాయింట్లు క్షీణించి 16,972 వద్ద ముగిసింది. భారతీ ఎయిర్‌టెల్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌యుఎల్, నెస్లే ఇండియా టాప్ లూజర్లుగా మిగిలాయి. అదే సమయంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ టాప్ గెయినర్లుగా నిలిచాయి. . మెటల్, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. 

మార్కెట్ ను దెబ్బతీసిన లార్జ్ క్యాప్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి ప్రధానం చెప్పుకోవాలి. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ దాదాపు 1.69 శాతం నష్టపోయింది. ఇండెక్స్ లో మార్కెట్ క్యాప్ పరంగా రిలయన్స్ ఇండస్ట్రీకి వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది. దీంతో రిలయన్స్ షేరు పతనం సెన్సెక్స్, నిఫ్టీ సూచీలను బలహీన పరుస్తుంది. అలాగే మార్కెట్ క్యాప్ పరంగా బలమైన స్టాక్స్ గా పేరొందిన HDFC, HDFC బ్యాంకు స్టాక్స్ కూడా 1 శాతం చొప్పున నష్టపోయాయి. టీసీఎస్, ఎస్బీఐ స్టాక్స్ సైతం నెగిటివ్ గా ముగిశాయి. అయితే నిఫ్టీ సూచీలో నేడు అదానీ కంపెనీలు అయిన అదానీ ఎంటర్ ప్రైజెస్ 5.74 శాతం లాభపడగా, అదానీ పోర్ట్స్ 4.19 శాతం లాభపడింది. అలాగే ఏషియన్ పెయింట్స్ 3 శాతం. భారత్ పెట్రోలియం 1.47 శాతం, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 1.16 శాతం లాభపడ్డాయి. 

సెక్టార్ల పరంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ భారీగా నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 1 శాతం నష్టపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంకు మినహా సూచీలోని అన్ని స్టాక్స్ నష్టపోయాయి. ముఖ్యంగా SBI 1.63 శాతం నష్టపోయింది. అలాగే ప్రైవేటు బ్యాంకు దిగ్గజాలు అయిన HDFC బ్యాంకు ఏకంగా 1.56 శాతం నష్టపోయింది. అలాగే ఐసీఐసీఐ బ్యాంకు 0.68 శాతం నష్టపోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 2 శాతం నష్టపోయింది. అలాగే ఇండస్ ఇండ్ బ్యాంక్ సైతం 2 శాతం నష్టపోయింది. 

అలాగే మరో కీలక సూచీ అయిన నిఫ్టీ ఐటీ సూచీ కూడా నష్ట పోయింది. ఐటీ సూచీలోని ప్రముఖ ఐటీ కంపెనీలు అన్నీ నష్టాల్లో ముగిశాయి. మార్కెట్ క్యాప్ పరంగా అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన టీసీఎస్ నేడు 0.60 శాతం నష్టపోయింది. అలాగే విప్రో 0.80 శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్ మాత్రం ఫ్లాట్ గా ముగిసింది. 

ఈ రోజు మెటల్ స్టాక్స్ అన్నీ లాభాల బాటలో ముగిశాయి. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 1.80 శాతం లాభపడింది. ముఖ్యంగా అదానీ ఎంటర్ ప్రైజెస్ 5.80 శాతం లాభపడగా, టాటా స్టీల్ 2.11 శాతం లాభపడింది. జెఎస్‌డబ్ల్యు స్టీల్ 1.13 శాతం లాభపడింది. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా, జిందాల్ స్టెయిన్ లెస్ లాంటి షేర్లు సైతం పాజిటివ్ గా ముగిశాయి. 

FMCG స్టాక్స్ కూడా నేడు భారీగా నష్టపోయాయి. ముఖ్యంగా బ్రిటానియా 1 శాతం, డాబర్ 0.80 శాతం, హిందుస్తాన్ యూనిలివర్ 1.49 శాతం, ఐటీసీ 0.08 శాతం, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 0.83 శతం నష్టపోయాయి.