Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పసిడి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే 24 కేరట్ల బంగారం రూ.52 వేల మేర చేరుకుంది. అయితే భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. అటు క్రూడాయిల్ ధరలు ఆకాశాన్ని తాకడంతో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. MCXలో బంగారం ధర మే 2021 తర్వాత అతిపెద్ద పెరుగుదలను చూసింది. నేడు MCX బంగారం ధర 10 గ్రాములకు రూ.52,549గా ఉంది. సమీప కాలంలో బంగారం (Gold- Silver Rates) రూ.54,000 స్థాయిని తాకగలదని కమోడిటీ నిపుణులందరూ భావిస్తున్నారు.

రెలిగేర్ బ్రోకింగ్‌కు (Religare Broking) చెందిన సుగంధ సచ్‌దేవ్ మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం మార్కెట్‌లో రిస్క్ సెంటిమెంట్‌ను పెంచిందని, దీని కారణంగా ప్రజలు బంగారంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నారని, బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో కరోనా నాటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య ఈ వారం బంగారం ధరలు మే 2021 తర్వాత అతిపెద్ద వారపు పెరుగుదలను చూసాయి. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం తీవ్రమైన మలుపు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో బంగారం ధరల్లో మరింత పెరుగుదల కనిపించవచ్చు.

ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా, ద్రవ్యోల్బణం ఆందోళనలు మరింత పెరిగాయి. దీని కారణంగా ప్రజలు ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి హెడ్జింగ్ వ్యూహంతో బంగారం కొనుగోలు చేయడం కనిపిస్తుంది.

ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్‌కు (IIFL Securities) చెందిన అనుజ్ గుప్తా మాట్లాడుతూ 2022లో ఇప్పటి వరకు స్పాట్ మార్కెట్‌లో డాలర్‌తో రూపాయి 2.48 శాతం నష్టపోగా, వారంలో 1.10 శాతం నష్టపోయింది. పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా, భారతదేశం నుండి డాలర్ల ఉపసంహరణ మరింత ఊపందుకుంటుందని అంచనా వేయబడింది. కరెంట్ ఖాతా లోటు మరింత పెరుగుతుందని, దీని కారణంగా సమీప కాలంలో రూపాయి 77 స్థాయికి పడే చాన్స్ ఉందని పేర్కొంటున్నారు. 

డాలర్‌తో పోలిస్తే రూపాయిలో రూపాయి బలహీనపడితే 10 గ్రాముల బంగారం ధరలో రూ. 250-300 మారుతుందని అనూజ్ గుప్తా పేర్కొన్నారు. అటువంటి పరిస్థితిలో, MCX లో బంగారం ధరలు పెరగడానికి రూపాయి బలహీనత మరొక కారణం కావచ్చు.

53,800-54,000 లక్ష్యంతో MCX గోల్డ్‌ను 51,500 - 51,800 రేంజ్‌లో కొనుగోలు చేయవచ్చని అనూజ్ గుప్తా చెప్పారు. దీని కోసం, మీరు రూ. 51,000 స్టాప్ లాస్ సెట్ చేయాలని పేర్కొన్నారు. 

మరోవైపు స్పాట్ బంగారంలో కూడా ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణ ఒత్తిడి, భౌగోళిక-రాజకీయ అనిశ్చితులు, అస్థిరత స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ. 60,000 వరకు వెళ్లే అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ పేర్కొంది. ఇదిలా ఉంటే పరిస్థితి ఇలాగే కొనసాగితే 12-15 నెలల్లో బంగారం ధర రూ. 80,000 వరకూ అప్‌సైడ్‌ పొందేందుకు అవకాశంగా ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.