TCS Q1 Results: తొలి త్రైమాసికంలో అదరగొట్టిన టీసీఎస్, రూ.11,074 కోట్ల నికర లాభం నమోదు..డివిడెండ్ సైతం ప్రకటన..
TCS బుధవారం సాయంత్రం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దేశంలోనే అతి పెద్ద ఐటీ కంపెనీ అయిన టీసీఎస్ తన తొలి త్రైమాసికంలో రూ.11,074 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అదే సమయంలో టీసీఎస్ ఆదాయం 12.5 శాతం వృద్ధిని నమోదు చేసి 59,381 కోట్లకు పెరిగింది.
దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఏప్రిల్-జూన్ 2024 త్రైమాసిక (Q1 Results) ఆర్థిక ఫలితాలు విడుదల అయ్యాయి. మార్కెట్లో అనిశ్చిత వాతావరణం, మందగమన వృద్ధి, ప్రాజెక్టుల ఆలస్యం వంటి కారణాలు ఉన్నప్పటికీ, మొదటి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాది కాలంతో పోలిస్తే 16.8 శాతం పెరిగి రూ.11,074 కోట్లకు చేరుకుంది. FY2023 మొదటి త్రైమాసికంలో కంపెనీ రూ. 9,478 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
మొదటి త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.52,758 కోట్ల నుంచి రూ.59,381 కోట్లకు ఏప్రిల్-జూన్ 2023లో చేరింది. కానీ ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ లాభం 2.7 శాతం క్షీణించి రూ.11,392 కోట్లకు చేరుకుంది. మార్జిన్లు కూడా త్రైమాసికంలో 23.2 శాతానికి తగ్గాయి. ఉద్యోగుల జీతం పెంచడంతో కంపెనీ వ్యయంలో 200 బేసిస్ పాయింట్ల పెరుగుదల చోటుచేసుకొని లాభం మార్జిన్లు ప్రభావితమయ్యాయి. దీంతో మొదటి త్రైమాసికంలో కంపెనీ వృద్ధి బలంగా ఉన్నప్పటికీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఈ త్రైమాసికంలో బ్లూమ్‌బెర్గ్ ఆదాయ అంచనా రూ.59,600 కోట్లను TCS కోల్పోయింది. నికర లాభం విషయంలోనూ, దాని పనితీరు అంచనా రూ.10,936 కోట్ల కంటే తక్కువగా ఉంది.
టిసిఎస్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ) కె కృతివాసన్ మాట్లాడుతూ, 'కొత్త ఆర్థిక సంవత్సరాన్ని చాలా పెద్ద డీల్స్ ద్వారా ప్రారంభించడం చాలా సంతృప్తికరంగా ఉంది. ఈ కొత్త సాంకేతికతలలో మా సామర్థ్యం పెంపొందించడానికి , పరిశోధన, ఆవిష్కరణలలో ముందస్తు పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. ఈ త్రైమాసికంలో కంపెనీ మొత్తం కాంట్రాక్ట్ విలువ (TCV) 10.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే US, యూరప్ నుండి డిమాండ్ వృద్ధి మందగించింది.
కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్ గణపతి సుబ్రమణియన్ మాట్లాడుతూ, “ ఈ త్రైమాసికంలో అనేక ముఖ్యమైన మైలురాళ్లను సాధించాం. UKలో, జీవిత బీమా, పెన్షన్‌ల రంగంలో, మేము మా డిజిటల్ ఇన్సూరెన్స్ ప్లాట్‌ఫారమ్‌లో మూడు కొత్త డీల్‌లను ముగించాము, TCSని స్కేల్‌లో మార్కెట్ లీడర్‌గా చేసాము. మేము జనరేటివ్ AI రంగంలో సామర్థ్యం పొందేందుకు చురుకుగా పని చేస్తున్నామని తెలిపారు.
షేర్‌ఖాన్ బిఎన్‌పి పరిబాస్ రీసెర్చ్ హెడ్ సంజీవ్ హోటా మాట్లాడుతూ, “ఆర్డర్ బుక్ బలంగానే ఉంది. అయితే బ్యాంకులు, ఆర్థిక సేవలు (బిఎఫ్‌ఎస్), సాంకేతికత, కమ్యూనికేషన్‌ల వంటి రంగాలలో కొనసాగుతున్న బలహీనత వినియోగదారుల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తుంది. ఆర్థిక వాతావరణం దృష్ట్యా డిమాండ్‌లో మెతకదనం ఉంటుందని యాజమాన్యం కూడా తెలిపింది. సమీప కాలంలో ఐటీ రంగం ఓ మోస్తరుగా పనిచేస్తుందని భావిస్తున్నాం. మేము దీనికి తటస్థ రేటింగ్ ఇస్తున్నామని ఆయన తెలిపారు.
కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సమీర్ సెక్సరియా మాట్లాడుతూ.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంచాం. ఇది మా ఆపరేటింగ్ మార్జిన్‌పై ఇది 200 బేసిస్ పాయింట్లు భారం పెంచిందని తెలిపారు. మొదటి త్రైమాసికంలో ఉద్యోగుల అట్రిషన్ రేటు త్రైమాసికం క్రితం 21 శాతం నుంచి 17.1 శాతానికి తగ్గింది.
టిసిఎస్ డివిడెండ్ ప్రకటన
ఒక్కో షేరుకు 9 రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను TCS బోర్డు ప్రకటించింది. మధ్యంతర డివిడెండ్ ఆగస్టు 7 సోమవారం నాడు కంపెనీ వాటాదారులకు చెల్లించనుంది. దీనికి రికార్డు తేదీని జూలై 20గా నిర్ణయించారు. మీరు ఈ తేదీ వరకు TCS షేర్లను కలిగి ఉంటే, మీకు డివిడెండ్ చెల్లించనున్నారు. రెగ్యులేటరీ ఫైలింగ్‌లో TCS ఈ సమాచారాన్ని స్టాక్ ఎక్స్ఛేంజీలకు అందించింది.