Asianet News TeluguAsianet News Telugu

మార్కెట్ క్యాపిటలైజేషన్: టీసీఎస్ వర్సెస్ రిలయన్స్ సయ్యాట!

నిత్యం ఒడిదొడుకుల మధ్య సాగే షేర్ మార్కెట్‌ ‘మార్కెట్ క్యాపిటలైజేషన్’లో మొదటి స్థానం కోసం దిగ్గజ సంస్థలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం మొదటిస్థానానికి వచ్చిన రిలయన్స్ ను టీసీఎస్ బుధవారం దాటేసి అతిపెద్ద సంస్థగా అవతరించింది. 

TCS beats Reliance Industries, becomes India's most valued company again

ముంబై: ముకేష్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టీసీఎస్‌ మరోసారి షాక్‌ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద కంపెనీగా అవతరించిన సంతోషం అంతలోనే ఆవిరైపోయింది. కేవలం 24 గంటల్లోనే ఐటీ దిగ్గజం  టీసీఎస్‌ తన అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నది. ఐదేళ్ల క్రితం రిలయన్స్‌ను వెనక్కినెట్టిన టీసీఎస్‌ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. 

దేశీయ అతిపెద్ద కంపెనీలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్ఐఎల్) మధ్య పోటీ ఆకర్షణీయంగా నిలిచింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్ విషయమై రెండు సంస్థలు నువ్వానేనా అన‍్నట్టుగా పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా తొలి త్రైమాసికం ఫలితాల జోష్‌‌తో మంగళవారం భారీగా ఆర్‌ఐఎల్‌ షేర్ లాభపడటంతో రిలయన్స్ నెంబర్‌ వన్‌ స్థానంలోకి  దూసుకొచ్చింది. అప్పటివరకు అగ్ర స్థానంలో ఉన్న టీసీఎస్‌ను వెనక్కి నెట్టేసింది. ఇది మంగళవారం జరిగిన పరిణామం. కానీ బుధవారం ఈ పరిస్థితి తారుమారైంది. తాజాగా  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మళ్లీ రిలయన్స్‌ను పక్కకు నెట్టేసి రేసులో ముందుకు దూసుకొచ్చింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా బుధవారం దేశంలో అత్యంత విలువైన సంస్థగా టీసీఎస్ తన హోదాను తిరిగి దక్కించుకుంది. ప్రస్తుతం టీసీఎస్‌ మార్కెట్ క్యాపిటలైజేషన్ 7.56 ట్రిలియన్ డాలర్లు. ఇది రిలయన్స్ విలువ కంటే 14.08 బిలియన్ డాలర్లు ఎక్కువ. రూ .7.54 ట్రిలియన్లతో  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రెండవ స్థానంతో సరిపెట్టుకుంది. మరో వైపు బీఎస్ఈలో టీసీఎస్ షేర్లు 1.74 శాతం పెరిగి 1,975.10 వద్ద స్థిరపడగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ 0.45 శాతం పెరిగి రూ. 1,191.15 వద్ద ముగిసింది.

ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడంతో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ జోరుగా పెరుగుతోంది. మంగళవారం అంతర్గత ట్రేడింగ్‌లో 3.5 శాతం లాభంతో ఆల్‌ టైమ్‌ హై, రూ.1,190ను తాకిన ఈ షేర్‌ చివరకు 3.1 శాతం లాభంతో రూ.1,186 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్‌ ఇదే. కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్ రూ.7,51,550 కోట్లకు పెరిగింది. దీంతో అతి పెద్ద మార్కెట్‌ క్యాప్‌ కంపెనీ అనే ఘనతను మళ్లీ సొంతం చేసుకుంది. రూ.7,43,222 కోట్ల మార్కెట్‌ క్యాప్‌ ఉన్న టీసీఎస్‌ను అధిగమించి అగ్రస్థానానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఎగబాకింది. మార్కెట్‌ క్యాప్‌ పరంగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టీసీఎస్‌ల తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (రూ.5,75,185 కోట్లు), హిందుస్థాన్‌ యూనిలీవర్‌ (రూ.3,74,828 కోట్లు), ఐటీసీ (రూ.3,63,150 కోట్లు) నిలిచాయి.  


ఐదేళ్ల క్రితం అత్యధిక మార్కెట్‌ క్యాపిటలైజేషన్ గల కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ స్థానాన్ని టీసీఎస్‌ ఎగరేసుకుపోయింది. తాజాగా ఈ స్థానాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మళ్లీ చేజిక్కించుకుంది. ఈ నెల ఆరంభంలోనే 100 బిలియన్‌ డాలర్ల కంపెనీగా రిలయన్స్‌ నిలిచింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకూ టీసీఎస్‌ షేరు విలువ 28 శాతం పెరగ్గా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 29 శాతం లాభపడింది. ఇక ఈ నెలలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌6 శాతం లాభపడగా, టీసీఎస్‌ 4.5 శాతం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌21 శాతం చొప్పున ఎగబాకాయి.

Follow Us:
Download App:
  • android
  • ios