Asianet News TeluguAsianet News Telugu

రూ.8 లక్షల కోట్లు దాటిన టీసీఎస్.. రిలయన్స్‌పై పైచేయి

మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.8 లక్షల కోట్లు దాటి అగ్రశ్రేణి సంస్థగా నిలిచింది. ఇంతకుముందు రిలయన్స్ ఈ స్థాయిని చేరుకున్న తొలి కార్పొరేట్ సంస్థ.
 

TCS 2nd Indian firm to cross Rs.  8 trillion market cap after RIL
Author
Bombay, First Published Sep 5, 2018, 12:16 PM IST

ముంబై: దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసె‌స్ (టీసీఎస్‌) మరో రికార్డును నమోదు చేసింది. తాజాగా టీసీఎస్‌ మార్కెట్‌ విలువ రూ.8 లక్షల కోట్ల స్థాయిని దాటేసింది. స్టాక్‌ మార్కెట్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో కంపెనీ ఇదే. మంగళవారం బిఎస్ఈ అంతర్గత ట్రేడింగ్ ట్రేడింగ్‌లో టీసీఎస్‌ షేర్ ధర ఒక దశలో 2.19 శాతం బలపడి రూ.2,100 స్థాయి వద్ద 52 వారాల సరి కొత్త గరిష్ఠ రికార్డు నమోదు చేసుకుంది. చివర్లో 1.86 శాతం లాభంతో రూ.2,093.20 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ ఒక్క రోజే రూ.14,644.36 కోట్ల మేరకు పెరిగి రూ.8,01,397.36 కోట్లకు చేరుకున్నది.
 
ప్రస్తుతం టీసీఎస్‌ దేశంలో అత్యంత విలువైన కంపెనీ. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.8 లక్షల కోట్లకు చేరిన తొలి కంపెనీగా గత నెల 23న రికార్డును నమోదు చేసుకున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. ఆ తర్వాత కాలంలో షేరు ధర కాస్త తగ్గడంతో మార్కెట్‌ విలువ రూ.7,87,357.93 కోట్లుగా నమోదైంది. 2018లో ఇప్పటివరకు బీఎస్ఈ ప్రామాణిక సూచీ సెన్సెక్స్‌ 13.5 శాతం పెరగగా, టీసీఎస్‌ షేర్ల ధర సుమారు 54.6 శాతం వృద్ధి చెందింది.

సాధారణంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల రాబడిలో మెజారిటీ వాటా విదేశాలు, అందునా అమెరికా మార్కెట్‌ నుంచే సమకూరుతుంది. రూపాయితో పోలిస్తే డాలర్‌ విలువ క్రమంగా బలపడుతూ వస్తుండటం సాఫ్ట్‌వేర్‌ సంస్థలతోపాటు ఎగుమతుల ఆధారిత కంపెనీలన్నీ ఆదాయపరంగా కలిసివచ్చే అంశం. ఈ నేపథ్యంలో టిసిఎ్‌సతో పాటు మిగతా ఐటి కంపెనీల షేర్లన్నీ దూకుడుగా ఉన్నాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఐటీ సేవలకు డిమాండ్‌ మళ్లీ పుంజుకుంటోంది. భారీ స్థాయి, క్లిష్టమైన, మిషన్‌ కీలక ప్రాజెక్టుల అమలులో మిగతా ఐటీ కంపెనీల కంటే అధిక అనుభవమున్న టీసీఎస్‌ మరిన్ని ప్రాజెక్టులు దక్కించుకోవటంతో పాటు రాబడులను పెంచుకోనుందనేది విశ్లేషకుల అంచనా.
 
ఈ నెల 6 (గురువారం) నుంచి ప్రారంభం కానున్న టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ (తిరిగి కొనుగోలు) 21న ముగియనున్నది. ఇందులో భాగంగా సంస్థ ఈక్విటీ వాటాదారుల నుంచి రూ.16వేల కోట్ల విలువైన 7.619 కోట్ల షేర్లు కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌కు రూ.2,100 చెల్లించనున్నట్లు కంపెనీ గతంలోనే ప్రకటించింది. కంపెనీ వద్దనున్న నగదు నిల్వలను వాటా దారులకు పంచడంతో పాటు దీర్ఘకాలంలో షేర్‌హోల్డర్ల పెట్టుబడి విలువను పెంచే ఉద్దేశంతో కంపెనీ ఈ ప్రక్రియను చేపట్టింది. టీసీఎస్‌ బైబ్యాక్‌ ప్రకటించడం వరుసగా ఇది రెండో ఏడాది. గత సంవత్సరం కూడా సంస్థ రూ.16 వేల కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios