టాటా సన్స్’కు ఎయిరిండియా? సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి బిడ్?

ఎటు తిరిగి ఎటు వెళ్లినా.. కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ తిరిగి టాటాసన్స్ ‘శిఖ’లోనే చేరనున్నదా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. త్వరలో ఎయిర్ఇండియాను టేకోవర్ చేసుకోవడానికి అవసరమైన కసరత్తును టాటా సన్స్ చేయనున్నదని సమాచారం. 

Tatas, Singapore Airlines close to making a joint bid for Air India

దాదాపు 87 ఏళ్ల చరిత్ర ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను సొంతం చేసుకోవడానికి టాటా సన్స్ గ్రూప్‌‌ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. దీని కొనుగోలు కోసం సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌తో కలిసి త్వరలోనే టాటా సన్స్ బిడ్డింగ్‌‌ వేయనున్నది. 

ఎయిర్ ఇండియాతోపాటు ఎయిర్‌‌ఏషియాను విలీనం చేసుకోవడం తదితర అంశాలపై రెండు కంపెనీలు కసరత్తు మొదలుపెట్టాయి. ఎయిర్‌‌ ఏషియాలో టాటాలకు 51 శాతం వాటా ఉంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ మాత్రం ఎయిర్ ఇండియా సబ్సిడరీ. 

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేయడానికి టాటా గ్రూప్‌‌ మలేషియా ఇండస్ట్రియలిస్టు, ఎయిర్‌‌ ఏషియా బెర్హాద్‌‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌‌తో చర్చించింది. ఎయిర్‌‌ ఏషియాలో టోనీకి 49 శాతం వాటా ఉంది. షేర్‌‌హోల్డర్ల ఒఫ్పందం‌ ప్రకారం టాటా సన్స్ గ్రూప్ మరో బడ్జెట్‌‌ ఎయిర్‌‌లైన్‌‌లో పది శాతానికి మించి వాటాలు కొనకూడదు. 

కొనాలనుకుంటే టోనీ ఫెర్నాండేజ్ అనుమతి తీసుకోవాలి. ఇందుకోసం రెండు కంపెనీలు త్వరలోనే ఒక ఒప్పందంపై సంతకాలు చేయనున్నాయి. ఎయిర్ ఇండియాలో వాటాలను కొనుగోలు చసేందుకు అనుమతి ఇచ్చినందుకు, టాటా సన్స్ సంస్థ ఎయిరిండియాను ఎయిర్‌‌ ఏషియాలో విలీనం చేస్తుంది. ఫలితంగా టోనీకి ఇండియా ఏవియేషన్‌‌పై పట్టు పెరుగుతుంది. ఇది ఇద్దరికీ మేలు చేసే ఒప్పందమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

టాటా సన్స్‌‌, టోనీ ఎయిర్‌‌లైన్స్‌‌ కంపెనీ కలిసి 2013లో ఎయిర్‌‌ ఏషియాను ప్రారంభించాయి. ఎయిరిండియాను జాతీయం చేయకముందు దానిని టాటాలు నడిపిన సంగతి తెలిసిందే. విస్తారా పేరుతో టాటాలు సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌తో కలిసి మరో ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇందులో టాటాలకు 51 శాతం, సింగపూర్‌‌ ఎయిర్‌‌లైన్స్‌‌కు 49 శాతం వాటాలు ఉన్నాయి. టాటా సన్స్‌‌ చైర్మన్‌‌ చంద్రశేఖర్‌‌ ఇటీవల మాట్లాడుతూ విలీనం చేయకుండా మూడో ఎయిర్‌‌లైన్‌‌ కంపెనీని నడిపే అవకాశం లేదని అన్నారు.

విస్తారాతోపాటు ఎయిరిండియా టాటా సన్స్ చేతుల్లో ఉంటే ఏవియేషన్‌‌ మార్కెట్‌‌పై వీరికి గుత్తాధిపత్యం వస్తుంది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ 20 ఇండియన్‌‌ సిటీలకు, 13 ఇంటర్నేషనల్‌‌ సిటీలకు విమానాలు నడుపుతోంది. దీని దగ్గర 25 బోయింగ్‌‌ 737 విమానాలు ఉన్నాయి. 

ఎయిర్‌‌ ఏషియా దగ్గర 29 ఎయిర్‌‌బస్‌‌ ఏ320 విమానాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇది 21 నగరాలకు సేవలు అందిస్తోంది. విదేశీ సర్వీసులకు ఇంకా అనుమతులు రాలేదు. ఎయిర్ ఏషియాలో టాటా నామినీ ఆర్ వెంకట్రామన్‌తోపాటు ఫెర్నాండేజ్‌లపై మనీ లాండరింగ్, క్రిమినల్ కాన్స్పిరసీ కేసులు ఉండటం గమనార్హం. 

ఎయిర్ ఏషియా విదేశీ సర్వీసులకు అనుమతి రావడానికి టైం పట్టొచ్చు. బుధవారం ఫెర్నాండేజ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటికైతే ఎయిర్ ఇండియా కోసం దాఖలు చేసే బిడ్‌లో ఎయిర్ఏషియా గానీ, ఫెర్నాండేజ్ గానీ భాగస్వాములవుతారా? లేదా? అన్న సంగతి ఇంకా తెలియ రాలేదు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios