Asianet News TeluguAsianet News Telugu

జెట్ ఎయిర్‌వేస్ పై టాటా ‘ఐ’: మెజార్టీ వాటా కైవసం యత్నాలు?

రతన్ టాటా చైర్మన్‌గా ఉన్నప్పుడు నెరవేరని కలను సాకారం చేసుకోవాలని టాటా సన్స్ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది. విమాన యాన రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్న టాటా సన్స్.. ఆర్థికంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్ వేస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 

Tatas in talks to pick up stake in struggling Jet Airways
Author
Mumbai, First Published Oct 19, 2018, 10:20 AM IST

ముంబై : దేశీయ అతిపెద్ద కార్పొరేట్ సంస్థ టాటా సన్స్ కన్ను ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌ ఎయిర్‌వేస్‌’పై పడింది. జెట్‌ ఎయిర్‌వేస్‌లో అతిపెద్ద మొత్తంలో వాటా దక్కించుకోవాలని టాటా గ్రూప్‌ చర్చలు జరుపుతుందని ఆ సంస్థ సన్నిహిత వర్గాలు చెప్పాయి. నరేష్‌ గోయల్‌ ఆధ్వర్యంలోని జెట్ ఎయిర్ వేస్ పైలెట్లకు వేతనాలు ఇవ్వకుండా కొన్ని నెలలుగా తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో పైలెట్లు, సీనియర్‌ ఉద్యోగులు మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న తాము వేతనాలను వాయిదాల్లో చెల్లిస్తామని జెట్ ఎయిర్ వేస్ చెబుతోంది. 
రెండు నెలలుగా ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ వస్తున్న జెట్ ఎయిర్ వేస్ సెప్టెంబర్‌ వేతనాలను కూడా తన ఉద్యోగులకు చెల్లించలేదు. సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు, పైలెట్లకు, ఇంజనీర్లకు వేతనాలను ఆలస్యం చేస్తున్నందుకు క్షమాపణలు చెబుతున్నట్టు జెట్‌ ఎయిర్‌వేస్‌ తెలిపింది. క్షమాపణలు ప్రకటించిన మేనేజ్‌మెంట్‌, ఎప్పుడు ఆ వేతనాలను ఇస్తారో మాత్రం చెప్పలేదు. ఆగస్టు నెల వేతనాలను ఆలస్యం చేసిన తర్వాత ఈ కంపెనీ, తన మూడు కేటగిరీ స్థాయిలో ఉన్న ఉద్యోగులకు వేతనాలను రెండు విడతలు చెల్లించనున్నట్టు పేర్కొంది. 

ఆగస్టు నెల వేతనాన్ని సెప్టెంబర్‌ 11, 26వ తేదీల్లో చెల్లించనున్నట్టు ప్రకటించింది. దానిలో కూడా రెండో విడతను కూడా మరో రెండు విడుతలుగా చేసింది. సెప్టెంబర్‌ 26, అక్టోబర్‌ 9న చెల్లించనున్నట్టు పేర్కొంది. అదేమాదిరి సెప్టెంబర్‌ నెల వేతనాన్ని అక్టోబర్‌ 11, 26 తేదీల్లో చెల్లించాల్సి ఉంది. కానీ ముందుగా నిర్ణయించిన తుది గడువు ముగిసినా సెప్టెంబర్‌ నెల వేతనాన్ని కంపెనీ ఇంకా అందించలేదు. త్వరలోనే మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పిన జెట్‌ ఎయిర్‌వేస్‌, చెల్లింపుల తేదీపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

‘వేతనాలు చెల్లించకుండా ఆపుతున్నందుకు ముందుగా మీకు క్షమాపణలు. ఈ విషయంలో మీ సహనాన్ని మెచ్చుకోవాలి. మీరు మీ డ్యూటీలను అంకితభావంతో చేస్తున్నారు. కంపెనీ తరఫున ఉద్యోగులకు కృతజ్ఞతలు’ అని జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్‌ రాహుల్‌ తనేజా అన్నారు. అయితే యూనియన్‌ నాయకులపై జెట్‌ ఎయిర్‌వేస్‌ పైలెట్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారు వేతనాలు చెల్లించాలని మేనేజ్‌మెంట్‌పై ఎలాంటి ఒత్తిడి తేవడం లేదని ఆరోపిస్తున్నారు.  

ఇలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జెట్‌ ఎయిర్‌వేస్‌లో టాటా గ్రూప్‌ మెజార్టీ వాటా దక్కించుకుని, మేనేజ్‌మెంట్‌ కంట్రోల్‌ పొందాలని చూస్తోంది. జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆ కంపెనీ ప్రమోటర్‌ నరేష్‌ గోయల్‌కు 51 శాతం వాటా ఉంది. మిగతా మొత్తంలో 24 శాతం ఇతిహాద్‌ ఎయిర్‌వేస్‌, 2.1 శాతం ఎల్‌ఐసీ, 3.6 శాతం ఎంఎఫ్‌ఎస్‌, ఇతరుల చేతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం నరేష్‌ గోయల్‌కు గల వాటాలో 26 శాతం టాటా సన్స్ కొనుగోలు చేయబోతున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే టాటా రెండు ఏవియేషన్‌ జాయింట్‌ వెంచర్లను కలిగి ఉంది. ఒకటి సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆపరేటింగ్‌ విస్తారా, రెండు బడ్జెట్‌ ఎయిర్‌లైన్‌ ఎయిర్‌ ఏసియా. విస్తారా ఎయిర్‌లైన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఏవియేషన్‌ మార్కెట్‌లో తీవ్ర పోటీ ఉంది. ఒకవేళ ఈ డీల్‌ కుదిరితే టాటా గ్రూప్‌ నెట్‌వర్క్‌ పరంగా, మార్కెట్‌ షేర్ పరంగా తన ఏవియేషన్‌ వ్యాపారాలను విస్తరించుకోనుంది. అయితే ఈ విషయాలపై స్పందించడానికి టాటా సన్స్‌ అధికార ప్రతినిధి నిరాకరిస్తే, జెట్‌ ఎయిర్‌వేస్‌ అధికార ప్రతినిధి అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు.

ప్రస్తుత చర్చల్లో కంట్రోలింగ్‌ హక్కులపై ఇరు సంస్థల నుంచి తేడాలు వచ్చినట్టు తెలిసింది. ఒకవేళ చర్చలు కనుక సఫలమైతే, ఇతిహాద్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌లో ఉన్న తన వాటాను విక్రయించనుంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేయాలని టాటా సన్స్ చూస్తున్నది. కానీ ప్రభుత్వం పెట్టే షరతులతో టాటా సన్స్ బిడ్డింగ్‌ తుది దశకు చేరుకోలేదు. అసలు ఎయిరిండియా తొలుత టాటా సన్స్ గ్రూపుదే. టాటా ఎయిర్‌లైన్స్‌గా స్థాపించి, ఎయిరిండియాగా పబ్లిక్‌లోకి వచ్చింది. కానీ 1953లో దాన్ని ప్రభుత్వం తన పరం చేసుకుంది. ఇప్పుడు ఎయిరిండియాకు కూడా అప్పులు విపరీతంగా పెరిగిపోవడంతో, దాన్ని అమ్మేయాలని చూస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios