Asianet News TeluguAsianet News Telugu

Tata's Air India plans: ఎయిరిండియా విమానాలలో భారీగా మార్పులు.. అవి ఇవే..!

ఎయిరిండియాను అధికారికంగా టేకోవర్ చేసిన టాటా స‌న్స్ గ్రూప్‌… నేటి (శుక్ర‌వారం) నుంచి ఆపరేషన్స్‌ మొదలుపెడుతోంది. టాటా గ్రూప్ నేతృత్వంలో ఎయిరిండియా సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఎయిరిండియాలో జర్నీ సరికొత్తగా ఉండబోతోంది. 

Tatas Air India plans
Author
Hyderabad, First Published Jan 28, 2022, 4:15 PM IST

ఎయిరిండియాను అధికారికంగా టేకోవర్ చేసిన టాటా స‌న్స్ గ్రూప్‌… నేటి (శుక్ర‌వారం) నుంచి ఆపరేషన్స్‌ మొదలుపెడుతోంది. టాటా గ్రూప్ నేతృత్వంలో ఎయిరిండియా సర్వీసులు నడవనున్నాయి. దీంతో ఎయిరిండియాలో జర్నీ సరికొత్తగా ఉండబోతోంది. ఓ ప్రత్యేక‌మైన ప్రక‌ట‌నతో ప్రయాణికులకు స్వాగ‌తం పలకబోతోంది. ఈ ప్రక‌ట‌న ద్వారా ఎయిరిండియా టాటాలో క‌లిసిపోయింద‌న్న వార్తను ప్రయాణికుల‌కు తెల‌ప‌నుంది టాటా సంస్థ. ఈ మేరకు సిబ్బందికి దిశానిర్దేశం చేసింది. అంతేకాదు ఎంపిక చేసిన రూట్లలో భోజ‌న సౌక‌ర్యం కల్పిస్తోంది. ఇకపై టైం టు టైం సర్వీసులు నడపడంతో పాటు, మెరుగైన సేవలందించడంపైనే టాటా ఫోకస్ చేయబోతోంది.

ఎయిరిండియా యాజమాన్య బదిలీ గురువారం పూర్తైంది. విమానయాన సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, పౌర విమానయాన కార్యదర్శి రాజీవ్ బన్సాల్, ఎయిరిండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విక్రమ్ దేవ్ దత్ తదితరులు పాల్గొన్నారు. ఎయిరిండియాకు చెందిన 100 శాతం షేర్లను టాటా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ కు బదిలీ చేయడంతో పాటు, యాజమాన్య నియంత్రణ కూడా అప్పగించినట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే పేర్కొన్నారు. కొత్త సంస్థకు సంబంధించిన బోర్డు ఇకపై ఎయిరిండియా బాధ్యతలను చూసుకుంటుందని తెలిపారు. గత ఏడాది అక్టోబరులో టాటా గ్రూప్ రూ. 18,000 కోట్లతో ఎయిరిండియాకు బిడ్ దాఖలు చేసి విజయవంతమైంది. ఇందులో రూ.2,700 కోట్లు నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించడంతో పాటు రూ.15,300 కోట్ల రుణాలను టాటా గ్రూప్ తీర్చనుంది.

ఎయిరిండియాను 1932లో టాటా గ్రూప్ వ్యవస్థాపకులైన జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా (జేఆర్‌డీ టాటా) టాటా ఎయిర్‌లైన్స్ పేరుతో ప్రారంభించారు. దేశంలో తొలి విమానయాన సంస్థ ఇది. అవిభక్త
భారతావనిలో కరాచీ నుంచి ముంబైకి ఉత్తరాల సర్వీసుతో ఈ సంస్థ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1946లో టాటా సన్స్‌కు చెందిన విమానయాన విభాగం ఎయిరిండియా పేరుతో నమోదైంది. 1948లో ఎయిరిండియా ఇంటర్నేషనల్ ఐరోపాకు విమాన సర్వీసుల్ని ప్రసిద్ధ మహారాజా మస్కట్‌తో ప్రారంభించింది. భారత్‌లో తొలి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం కింద అంతర్జాతీయ సర్వీస్ ను ప్రారంభించారు. ఇందులో ప్రభుత్వ వాటా 49 శాతం, టాటాల వాటా 25 శాతం కాగా, మిగతాది ప్రజలకు ఉండేది. 1953లో అప్పటి ప్రధాని జవహ‌ర్ లాల్ నెహ్రూ సంస్థను జాతీయం చేశాక, నాలుగు దశాబ్దాల పాటు ఎదురులేని విధంగా సాగింది.

టాటా గ్రూప్ కు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో కలిసి విస్తారా, మలేసియాకు చెందిన ఎయిరేసియా భాగస్వామ్యంలో ఎయిరేసియా ఇండియాలో కూడా మెజార్టీ వాటాలున్నాయి. 1953లో ఎయిరిండియాను జాతీయ‌కరణ చేసినప్పుడు నెహ్రూ ప్రభుత్వం టాటా గ్రూప్‌కు రూ.2.8 కోట్లు చెల్లించి 100 శాతం వాటా కొనుగోలు చేసింది. గణనీయంగా విస్తరించిన అదే సంస్థను 69 ఏళ్ల తర్వాత రూ.18,000 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ చేజిక్కించుకుంది. టాటా ప్ర‌స్తుతం వివిధ అంశాల‌పై ఫోకస్ చేసింది.


ఎయిర్ ఇండియా కొత్త ప్రకటనలో "ప్రియమైన అతిధులారా, నేను మీ కెప్టెన్ (పేరు)తో మాట్లాడుతున్నాను. ఈ చారిత్రాత్మక విమానానికి స్వాగతం, ఇది ఒక ప్రత్యేక సందర్భం. ఈరోజు ఎయిర్ ఇండియా అధికారికంగా ఏడు దశాబ్దాల తర్వాత తిరిగి టాటా గ్రూప్ భాగమైంది. ప్రతి ఎయిర్ ఇండియా విమానంలో మీకు కొత్త నిబద్ధత, అభిరుచితో సేవలందించేందుకు మేము ఎదురుచూస్తున్నాము. ఫ్యూచర్ ఎయిర్ ఇండియాకు స్వాగతం! మీరు ఈ ప్రయాణాన్ని ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాము. ధన్యవాదాలు." ఉంది.

కొత్త మార్పులను పరిశీలిస్తే, బాధ్యతలు స్వీకరించిన వెంటనే టాటా గ్రూప్ ఎయిర్ ఇండియా  లెట్ లతీఫీ మరకలను తొలిగిస్తుంది. విమాన కార్యకలాపాలు సకాలంలో జరిగేలా చూడటమే టాటా గ్రూప్ మొదటి ప్రయత్నం. అదనంగా ఇతర మార్పులను కూడా పరిశీలిస్తున్నారు. ఇందులో సీటింగ్ అరేంజ్‌మెంట్‌తో పాటు క్యాబిన్ సిబ్బంది డ్రెస్ కోడ్‌ను మార్చడం కూడా ఉంది. టాటా గ్రూప్ కొన్ని విమానాల్లో మెరుగైన భోజన సదుపాయాలు కల్పించింది. ముంబై నుంచి నాలుగు మార్గాల్లో బయలుదేరే సర్వీసుల్లో ప్రత్యేక భోజన సేవలను టాటా ప్రవేశపెట్టింది. ఏఐ 864 (ముంబై -ఢిల్లీ), ఎఐ 687 (ముంబై-ఢిల్లీ), ఎఐ 945 (ముంబై -అబుదాబీ), ఏఐ639 (ముంబై- బెంగళూరు) మార్గాల్లో భోజన సేవలు మొదలయ్యాయి. అలాగే ఈ మెరుగైన భోజన సేవ కార్య‌క్ర‌మం శుక్రవారం ముంబై-నెవార్క్ విమానం, మ‌రో ఐదు ముంబై- ఢిల్లీ విమానాలలో కూడా అందించనున్నారు.  ఆ తర్వాత దశలవారీగా సేవలను పొడిగించనున్నారు. అలాగే ప్ర‌యాణీకుల‌కు ఇబ్బంది లేకుండా  సాంకేతికంగా వై-ఫై స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios