ముంబై: పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలు చేసి, సంస్థ నిర్వహణ బాధ్యతలను దక్కించుకునేందుకు టాటా సన్స్ చర్చలు జరుపుతోంది. టాటా సన్స్‌కు చెందిన ముఖ్య ఆర్థిక అధికారి (సీఎఫ్‌ఓ) సౌరభ్‌ అగర్వాల్‌ ఈ చర్చలకు నేతృత్వం వహిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సౌరభ్ అగర్వాల్ సారథ్యంలోని టాటా గ్రూపు బృందం నేరుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ ఛైర్మన్‌ నరేశ్‌ గోయల్‌తో చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల కథనం. అయితే కొన్ని షరతులకు అంగీకరించాల్సి ఉన్నదని ఆ చర్చల సారాంశం అని తెలుస్తోంది.

‘టాటా సన్స్‌కు చెందిన ఉన్నతాధికార బృందం జెట్‌ ఎయిర్‌వేస్‌తో చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు మరికొన్ని వారాలు జరిగే అవకాశాలు ఉన్నాయి’ అని ఈ ఒప్పందం చర్చలతో సంబంధమున్న వ్యక్తి ఓ జాతీయ వార్తా సంస్థకు తెలిపారు. కొన్ని షరతుల మధ్య నిర్వహణ బాధ్యతను టాటాకు అప్పగించేందుకు జెట్ ఎయిర్ వేస్ ప్రమోటర్ నరేశ్‌ గోయల్‌ అంగీకరించినట్లు మరో అధికారి తెలిపారు. 

కానీ ఎంత మొత్తానికి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారనే అంశంపై స్పష్టత లేదని సదరు సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయంపై స్పందించేందుకు రెండు సంస్థల అధికార ప్రతినిధులు నిరాకరించారు. జెట్ ఎయిర్ వేస్ అధికార ప్రతినిధి ఒక అడుగు ముందుకేసి ఇదంతా వదంతులేనని కొట్టి పారేశారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ను గట్టెక్కించేందుకు బలమైన పెట్టుబడి దారుల కోసం చూస్తున్నట్టు గత నెలలో నరేశ్‌ గోయల్‌ తెలిపిన విషయం తెలిసిందే. సంస్థలో వాటా అమ్మి నిధులు సమకూర్చుకునేందుకు రతన్ టాటా, ముకేశ్ అంబానీ తదితర కార్పొరేట్ల అధినేతలను, సంస్థలను సంప్రదించారు. దీనిపై ఆసక్తి చూపిన టాటా సంస్థ నిర్వహణ హక్కును తమకే అప్పగించాలని కోరింది.

ఇప్పటికే టాటా సంస్థ సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి దేశీయంగా విస్తారా ఎయిర్‌లైన్స్‌ను నడుపుతోంది. ఎయిర్‌ ఏసియాలోనూ 49 శాతం వాటా కలిగి ఉంది. జెట్‌ ఎయిర్‌వేస్‌తో ఒప్పందం విజయవంతం అయితే దేశీయ విమానయాన రంగంలో టాటా సంస్థ వాటా 8.2 శాతం నుంచి 24 శాతానికి పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. జెట్ ఎయిర్ వేస్ బాధ్యతలు స్వీకరిస్తే టాటా సన్స్ మూడో విమానయాన సంస్థ నిర్వహిస్తున్న ఘనతను సాధించినట్లవుతుంది. జెట్ ఎయిర్ వేస్ సంస్థలో వాటా కొనుగోలు వల్ల దాని నిర్వహణకు అవసరమైన నిధులు సమకూర్చినట్లవుతుంది. ప్రస్తుతం నిధుల కొరత జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం సిబ్బందికి వేతనాలు చెల్లించడంలోనూ, ఎయిర్ క్రాఫ్ట్ లీజింగ్ కంపెనీలకు చెల్లింపులు చేయలేక సతమతం అవుతోంది.

ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో తమ సంస్థ రూ.1,261 కోట్ల ఏకీకృత నష్టాన్ని నమోదు చేసినట్లు సోమవారం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.71 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇంధన ధరల పెరుగుదల, రూపాయి మారకపు విలువ క్షీణిస్తున్న వల్లే ఈ భారీ నష్టాలు వస్తున్నాయని సంస్థ తెలిపింది. గత 11 ఏళ్లలో ఏనాడూ జెట్ ఎయిర్ వేస్ తొమ్మిదేళ్ల పాటు లాభాలు గడించినట్లు చూపనే లేదు. దీనికి అధిక వ్యయం సాకుగా చూపుతూ వస్తోంది. టాటా సన్స్ నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారన్న సంకేతాల మధ్య జెట్ ఎయిర్ వేస్ షేర్ 6.4 శాతం పెరిగింది.