Asianet News TeluguAsianet News Telugu

టాటాల ‘చేతి’కి జెట్‌: నేడే భేటీ.. సంబంధం లేదన్న సర్కార్

ఎట్టకేలకు జెట్ ఎయిర్వేస్ సంస్థ చేతులు మారబోతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. టాటా సన్స్ మేనేజ్మెంట్ తనకు గల ఆసక్తి నేపథ్యంలో జెట్ ఎయిర్వేస్ సంస్థను టేకోవర్ చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సన్నిహిత వర్గాల కథనం.

Tata Sons said to have been asked by government to explore buying Jet Airways stake
Author
Mumbai, First Published Nov 16, 2018, 8:53 AM IST

ఎట్టకేలకు ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న ‘జెట్ ఎయిర్‌వేస్’ను కైవసం చేసుకునే దిశగా టాటా సన్స్ అడుగులేస్తున్నది. అందుకోసం శుక్రవారం టాటా సన్స్ బోర్డు ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పిన సమాచారం దీనికి నేపథ్యం.

దీంతో భారత విమానయాన రంగంలో ఆసక్తికర కొనుగోలుకు తెరలేవనుంది. ఈ వార్తల నేపథ్యంలోనే జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర గురువారం 26 శాతం దాకా దూసుకెళ్లడం ఆసక్తి కర పరిణామం. అసలు గమ్మత్తేమిటంటే కష్టాల్లో చిక్కుకున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థను కాపాడాలని టాటా సన్స్ యాజమాన్యాన్ని నరేంద్రమోదీ ప్రభుత్వం కోరినట్లు సన్నిహిత వర్గాల కథనం. 

జెట్ ఎయిర్ వేస్ సంస్థకు ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇచ్చిన రుణాలు, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఎఐ)కి అద్దె చెల్లింపులు తదితర అంశాలపై ప్రభుత్వంతో టాటా సన్స్ ప్రతినిధులు మాట్లాడినట్లు తెలుస్తోందని, అయితే ఈ వ్యవహారం అంతా అనధికారికంగా జరుగుతున్నదని పేరు చెప్పడానికి ఇష్ట పడని అధికార వర్గాలు తెలిపాయి. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ అమిత్‌ అగర్వాల్‌ ఈ వారం ప్రారంభంలో మాట్లాడుతూ ‘కంపెనీలోకి పెట్టుబడులు ఆహ్వానించడానికి; మా ఆరు బోయింగ్‌ 777 విమానాలను, జెట్‌ ప్రివిలేజ్‌లో వాటాను విక్రయించడానికి ఆసక్తి గల సంస్థలతో చర్చలు జరుపుతున్నాయి’ అని అంగీకరించిన సంగతి తెలిసిందే.

మరోపక్క, ‘జెట్‌ ఎయిర్‌వేస్‌కు బిడ్‌ వేసే ప్రతిపాదనను పరిశీలించడానికి టాటా సన్స్‌ బోర్డు శుక్రవారం(నేడు) సమావేశం కానుంద’ని పీటీఐకి విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టాటా సన్స్‌ రెండు విమానయాన సంస్థలను నడుపుతోంది.  

సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారాను, ఎయిర్ ఏషియాతో కలిసి ఎయిర్ ఏషియా ఇండియాను నిర్వహిస్తోంది. కాగా, ఊహాగానాలపై స్పందించలేమని జెట్‌ ప్రతినిధి పేర్కొనగా.. టాటా సన్స్‌ ప్రతినిధి కూడా అదే విధంగా స్పందించారు.

నరేశ్‌ గోయెల్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న జెట్‌ ఎయిర్ వేస్ సంస్థలో గోయెల్‌, గోయెల్‌ కుటుంబానికి 51 శాతం వాటా ఉంది. ఇక గల్ఫ్‌ విమాన సంస్థ ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌కు 24% వాటా ఉంది. గత మూడు త్రైమాసికాలుగా జెట్‌ ఎయిర్‌వేస్‌ భారీ నష్టాలను నమోదు చేస్తోంది. తాజాగా గత వారం ప్రకటించిన సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీకి రూ.1261 కోట్ల నష్టం వాటిల్లింది. 

అంతక్రితం ఏడాది ఇదే మూడు నెలల కాలంలో రూ.71 కోట్ల లాభాన్ని నమోదు చేయడం విశేషం. ద్రవ్యలభ్యత సమస్యల వల్ల కంపెనీ తన వద్ద ఉన్న ఆరు బోయింగ్‌ 777 విమానాలను విక్రయానికి పెట్టింది కూడా.

నగదు లభ్యత సమస్య పెరగడంతో కొంత మంది విక్రేతలకు కంపెనీ చెల్లింపులు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో 16వేల మందికి పైగా ఉద్యోగుల్లో కొంత మందికి వేతనాలను సైతం ఆలస్యం చేయడంతో కంపెనీలో ఇబ్బందులు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

జెట్‌ ఎయిర్‌వేస్‌ను విస్తారా మాతృ సంస్థ టాటా-సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో మొత్తం షేర్ల ద్వారా విలీనం చేస్తారు. రెండు దశల్లో లావాదేవీ జరపడానికి ఇరు వర్గాలు సిద్ధంగా ఉన్నారు. తొలుత జెట్‌ ఎయిర్‌వేస్‌ను షేర్ల మార్పిడి ద్వారా టాటా-సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేసి కొత్త సంయుక్త సంస్థ(జేవీ)ను ఏర్పాటు చేస్తాయి. ఇందులో గోయెల్‌ కుటుంబం, ఎతిహాద్‌, టాటా సన్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ భాగస్వాములుగా ఉంటాయి. 

ఇక రెండో దశలో విమానాల కొనుగోలు తదితరాలు ఉండొచ్చు. అయితే జెట్‌ ఎయిర్‌వేస్‌ ఈ కథనాలను ఊహాగానాలుగా కొట్టిపారేయడం గమనార్హం. పౌర విమానయాన శాఖకు ఒక ఆంగ్ల దినపత్రిక పంపిన ఈ - మెయిల్ మెసేజ్ కు గానీ, ఫోన్ కాల్స్ కు గానీ స్పందించకపోవడం గమనార్హం.

అసలు గమ్మత్తేమిటంటే వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల ముంగిట జెట్ ఎయిర్వేస్ సంక్షోభం తీవ్రతరమైతే పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అందోళనలు ఉన్నాయి. గత నెలలో ఐఎల్ఎఫ్ఎస్ సంస్థ రుణాల ఊబిలో చిక్కుకోవడంతో కేంద్రమే దాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 

‘బోర్డులో ఏ విధమైన చర్చ కానీ, నిర్ణయం కానీ జరగలేదు. ఊహాగానాల ఆధారంగా అల్లిన కథనాలివి’ అని బీఎస్‌ఈకి జెట్‌ ఎయిర్‌వేస్‌ సమాచారం ఇచ్చింది. మరో పక్క, ‘మేం ప్రస్తుతం ఆసక్తి గల సంస్థలతో చర్చలు చేస్తున్నాం.

అవి వివిధ స్థాయిల్లో ఉన్నాయి. జెట్‌ ప్రివిలేజ్‌లో వాటా విక్రయంతో పాటు తాజా పెట్టుబడులను ఇందుకు పరిశీలిస్తున్నాం. ఇప్పటికే ఈ పనులను చేయడానికి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లు, కన్సల్టింగ్‌ సంస్థలను కంపెనీ నియమించుకుంది’ అని అమిత్‌ అగర్వాల్‌ మంగళవారం ఫలితాల అనంతరం విశ్లేషకులతో తెలపడం గమనార్హం.

జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేయాలని ప్రభుత్వమే టాటాలను అడిగి ఉంటుందంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ప్రభుత్వం ఖండించింది. ‘ఈ కొనుగోలు లేదా ప్రతిపాదనకు సంబంధించి ఎటువంటి అంశంలోనూ ప్రభుత్వ జోక్యం లేదని విమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌.ఎన్‌. చౌబే స్పష్టం చేశారు.

‘ఇప్పటిదాకా ఈ ప్రక్రియలో విమానయాన శాఖ జోక్యం చేసుకోలేదు. కాబట్టి బ్యాంకులు ఇతర వాటాదార్లను ఒప్పించామన్న ప్రశ్నే ఉత్పన్నం  కాదు’ అని ఆయన తెలిపారు. ఈ ఊహాగానాలు, వార్తలపై కంపెనీలు స్పందించకపోయినా షేరు ధర మాత్రం బాగా స్పందించింది.

గురువారం బీఎస్‌ఈలో జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు ధర ఏకంగా 24.52% దూసుకెళ్లి రూ.320.95 వద్ద ముగిసింది. ఒక దశలో రూ.334.90 వద్ద గరిష్ఠ స్థాయినీ తాకింది. నాలుగు రోజుల్లో షేరు 32 శాతానికి పైగా లాభపడడం విశేషం.
 

Follow Us:
Download App:
  • android
  • ios