ముంబై: ఎయిర్‌ ఏషియా ఇండియాలో మలేషియా భాగస్వామి ఎయిర్ ఏషియా సంస్థకు చెందిన 49 శాతం వాటాను కొనుగోలు చేయడంకోసం టాటా సన్స్‌ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. తద్వారా ఎయిర్‌ ఏషియా ఇండియా పూర్తిగా టాటా సన్స్ పరం అవుతుంది.

ప్రస్తుతం ఈ ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌కు 51 శాతం, మలేషియాకు చెందిన బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌కు 49 శాతం వాటా ఉంది. ఎయిర్‌ ఏషియా నుంచి ఈ వాటాను టాటా సన్స్‌ చాలా చౌకగా దక్కించుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, కరోనా సంక్షోభంతో ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ ఆర్థిక కష్టాలు తీవ్రతరం అయ్యాయి.

ఆస్తులను మించిన అప్పులు, అన్ని జాయింట్‌ వెంచర్లు నష్టాల్లో నడుస్తుండటంతో ప్రస్తుతం ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్‌ గ్రూప్‌ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఆర్థిక కష్టాల్లోంచి గట్టెక్కేందుకు అవసరమైన నిధుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 

also read ఇక దేశవ్యాప్తంగా రిలయన్స్- బీపీ బంకులు.. త్వరలో జియోబీపీగా రీ-బ్రాండింగ్‌.. ...

ఇందులోభాగంగా భారత్, జపాన్‌తోపాటు పలు దేశాల్లోని జాయింట్‌ వెంచర్లలో వాటా విక్రయించే ఆలోచనలో ఉన్నట్లు ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ సీఈఓ టోనీ ఫెర్నాండెజ్‌ ఈ మధ్యే సంకేతాలిచ్చారు కూడా. మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్‌ ఏషియా బెర్హాద్‌ సంస్థ 18.8 కోట్ల డాలర్ల నష్టాన్ని నమోదు చేసుకుంది. ఇదే కాలంలో ఎయిర్‌ ఏషియా ఇండియా రూ.330 కోట్ల నష్టం చవిచూసింది. 

ఏయిర్ ఏషియా ఇండియాలో వాటాలను కొనుగోలు చేసేందుకు ఇతర సంస్థలతో కలిసి టాటా సన్స్ ముందుకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు ఏయిర్ ఏషియా 234.52 మిలియన్ల డాలర్ల పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది.

ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను పూర్తిగా టేకోవర్ చేసుకునే విషయమై స్పందించడానికి టాటా సన్స్ నిరాకరించింది. మరోవైపు ఎయిర్ ఏషియా ఇండియా కూడా స్పందించేందుకు అందుబాటులోకి రాలేదు. 

గతంలో టాటా సన్స్ గ్రూప్ సొంతంగా విమాన సర్వీసులు నడిపిన అనుభవం ఉన్నది. ఇప్పటికే విస్తారాలో టాటా సన్స్, రతన్ టాటా పెట్టుబడులు ఉన్నాయి. ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేయడానికి టాటా సన్స్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.