దేశీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ (Tata Group) డిజిటల్ ఎకానమీ (Digital Economy) రంగంలో తన సత్తా చాటేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలను అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 7న టాటా సూపర్ యాప్ నియూ (Neu) లాంచ్ చేస్తున్నట్లు టాటా గ్రూప్ (Tata Group) అధికారికంగా ప్రకటించింది. 

టాటా గ్రూపు కొత్త సర్వీసును లాంచ్ చేయనుంది. అదే టాటా నియూ. షాపింగ్, పేమెంట్స్‌ను ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకు వచ్చేందుకు ఈ యాప్‌ను టాటా రూపొందించింది. ఈ యాప్ సాధారణ ప్రజల కోసం ఏప్రిల్ 7వ తేదీన లాంచ్ కానుంది. ప్రస్తుతానికి ఇది టెస్టింగ్ కోసం టాటా గ్రూపు ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఒకసారి లాంచ్ అయితే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల ద్వారా దీన్ని మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు.

నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్స్, విమాన టిక్కెట్లు కూడా ఇందులో అందుబాటులో ఉండనున్నాయి. అమెజాన్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, జియోమార్ట్‌లకు ఈ యాప్ పోటీని ఇవ్వనుంది. ఈ యాప్ ద్వారా ఉత్పత్తులు కొనుగోలు చేస్తే వినియోగదారులకు నియూ కాయిన్స్ అనే రివార్డ్ పాయింట్స్ లభించనున్నాయి. టాటా గ్రూపు సంస్థలు అయిన ఎయిర్ఏషియా ఇండియా, బిగ్ బాస్కెట్, క్రోమా, టాటా క్లిక్, వెస్ట్‌సైడ్ వంటి వాటిపై ఆఫర్లు కూడా లభించనున్నాయి.

షాపింగ్‌తో పాటు ఈ యాప్ ద్వారా బిల్స్ కూడా చెల్లింపులు చేసుకోవచ్చు. యూపీఐని ఇది సపోర్ట్ చేయనుంది. అలాగే వినియోగదారులకు ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించనున్నారు. టాటా నియూ యాప్ ద్వారా వినియోగదారులు బ్యాంకుకు కూడా నగదు పంపుకోవచ్చు. దీంతోపాటు టాటా తన వినియోగదారులకు ఆర్థిక పరమైన సేవలను కూడా అందించనుంది. టాటా నియూ యాప్‌పై కంపెనీ గత కొన్ని నెలల నుంచి పనిచేస్తుంది. ఈ యాప్‌ను ఇంటర్నల్‌గా పరీక్షించడంతో పాటు కొంతమంది నిపుణులతో కూడా పరీక్ష చేయించి వారి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అమెజాన్, గూగుల్, ఫ్లిప్‌కార్ట్, జియో మార్ట్‌లతో పాటు భారతీయ ఫిన్‌టెక్ కంపెనీలు అయిన పేటీయం, మొబిక్విక్‌లకు కూడా టాటా నియూ గట్టి పోటీని ఇవ్వనుంది. టాటా ప్రస్తుతం జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌తో కూడా దీని పెట్టుబడుల విషయంలో సంప్రదింపులు జరుపుతోంది.