Asianet News TeluguAsianet News Telugu

భారీ నష్టాల్లో టాటా మోటార్స్...కారణమదేనా?

ఒక్కోసారి సానుకూల నిర్ణయాలు తీసుకున్నా బెడిసికొడుతుంటాయి. జాగ్వార్ లాండ్ రోవర్ ఒక్కప్పుడు టాటామోటార్స్ సంస్థకు లాభాలు గడించి పెట్టింది. కానీ బ్రెగ్జిట్, చైనా మందగమనం తదితర కారణాలతో సొంత సంస్థకే గుదిబండగా మారింది. భారీ నష్టాలను ప్రకటించిన టాటా మోటార్స్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. ఇక దివాళా ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ అధినేత అనిల్ అంబానీది మరో గాథ. వ్యూహ రచనలో దూకుడుగా దూసుకెళ్లగల సామర్థ్యం ఉన్నా.. అనాలోచిత నిర్ణయాలతో అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆయన సోదరుడు ముకేశ్ అంబానీ ఒక్కో అడుగు ముందుకేస్తూ ఆసియా ఖండంలోనే కుబేరుడిగా అవతరించారు.

Tata Motors tanks 15%, Titan at new 52-week high
Author
Mumbai, First Published Feb 9, 2019, 10:10 AM IST

ముంబై: దలాల్‌ స్ట్రీట్‌నే ఆశ్చర్య పరిచేలా టాటా మోటార్స్ భారీ నష్టాలు ప్రకటించడంతో అంతా నిశ్చేష్టులయ్యారు. టాటా మోటార్స్‌ ఆర్థిక ఫలితాల్లో స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలోనే అత్యధిక త్రైమాసిక నష్టాన్ని నమోదు చేసింది.అంతక్రితం మూడు త్రైమాసికాలూ నష్టాలనే ప్రకటించినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకంగా రూ.26,961 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. 

ఇతర సంస్థల కంటే ఎక్కువ నష్టాలు
కొన్ని దిగ్గజ కంపెనీలు ఇటీవల ప్రకటించిన ఆదాయాలతో పోల్చినా ఈ నష్టం ఎక్కువే కావడం గమనార్హం. గురువారం మార్కెట్‌ తర్వాత ఫలితాలను ప్రకటించడంతో ఆ ప్రభావం శుక్రవారం కనిపించింది. 

జాగ్వార్ లాండ్ రోవర్ వల్లే టాటా మోటార్స్ ఇలా
దీనికి కారణం టాటా మోటార్స్ అనుబంధ సంస్థ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్స్ సంస్థే. దాని గురించి తెలసుకోవాలంటే 2008లోకి వెళ్లాలి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం 2008లో ప్రపంచ ఆర్థిక మాంద్యం దెబ్బతో దివాళా కోరల్లోకి జారుకున్నది ఫోర్డ్‌ మోటార్స్‌.ఫోర్ట్ మోటార్స్ తన లగ్జరీ కార్ల బ్రాండ్‌ జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ (జేఎల్‌ఆర్‌)ను అమ్మకానికి పెట్టింది. 

ఇలా రతన్ టాటా పంతంతో జాగ్వార్ లాండ్ రోవర్ సొంతం
అప్పటివరకూ భారత కార్పొరేట్లలో ఎవ్వరూ చేయనంత సాహసాన్ని టాటా గ్రూప్‌ అధిపతి రతన్‌టాటా చేశారు. పంతంపట్టి మరీ దాదాపు 2.3 బిలియన్‌ డాలర్లు (అప్పట్లో మన కరెనీప్రకారం రూ.9,300 కోట్లు) ఖర్చు చేసి టాటా మోటార్స్‌ జేఎల్‌ఆర్‌ను సొంతం చేసుకుంది. అంతభారీ మొత్తం అవసరమా అన్నవాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టేలా... జాగ్వార్‌పై టాటాలు లాభాల స్వారీ చేశారు. 

టాటామోటార్స్‌ను జాగ్వార్ లాండ్ రోవర్ ఆదుకుందిలా
దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో పోటీపడలేక ఆపసోపాలు పడుతున్న టాటామోటార్స్‌కు జేఎల్‌ఆర్‌ ఆతర్వాత కాలంలో నిజంగా కామధేనువే అయింది. అంతర్జాతీయంగా అమ్మకాల్లో జేఎల్‌ఆర్‌ చిరుతలా దూసుకెడుతూ మాతృసంస్థ టాటా మోటార్స్ సంస్థను ఆదుకుంటూ వచ్చింది. 

11 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్.. జేఎల్ఆర్‌తో నష్టాలు
తిరిగి 11 ఏళ్లు వచ్చే సరికి 2019లో అంతా రివర్స్‌గేర్‌. ఒకప్పుడు సంస్థకు సంజీవనిలా పనిచేసిన అదే జేఎల్‌ఆర్‌... ఇప్పుడు మాతృ సంస్థను కనీవినీఎరుగని నష్టాల లోయలోకి తోసేసింది. ప్రస్తుతం టాటా మోటార్స్‌ చిక్కుకున్న తుపానులో కేంద్ర బిందువు మాత్రం జేఎల్‌ఆర్‌. దీని  మూలధన పెట్టుబడులను రూ.27,838 కోట్లకు తగ్గించడం ప్రభావం చూపింది. 

దెబ్బకొట్టిన చైనా మందగమనం
అసెట్‌ ఇంపెయిర్‌మెంట్‌తో వ్యయాలు తగ్గించవచ్చని టాటా మోటార్స్ భావించింది. అయితే కనీసం 5 త్రైమాసికాల పాటు నగదు ప్రవాహం ప్రతికూలంగా ఉంటుందని కంపెనీయే తెలిపింది. చైనాలో మందగమనం కూడా కంపెనీని దెబ్బకొట్టింది. డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో సంస్థ రిటైల్‌ విక్రయాలు ఆ దేశంలో 47 శాతం మేర తగ్గాయి. జనవరి  2019లో 40% వరకూ క్షీణించాయి. 

బ్రెగ్జిట్ ఎఫెక్ట్ కూడా ఒక కారణమే
టాటా మోటార్స్ కంపెనీ కొనుగోళ్లకు, విస్తరణ కార్యకలాపాలకు భారీగా పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులు కూడా ఏ మేరకు ప్రతిఫలాన్ని ఇస్తాయన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. స్వయంకృతాపరాధాలకు తోడు బ్రెగ్జిట్‌ ప్రభావం వల్ల జేఎల్‌ఆర్‌ లాభాల్లో ఒక బిలియన్‌ పౌండ్ల మేర కోత పడింది. అధిక సామర్థ్యం, అధిక పెట్టుబడులు కాస్తా వ్యయ నిర్మాణాన్నిచిందరవందర చేశాయి. 

హైబ్రీడ్, విద్యుత్ కార్లపై ఇలా భారీగా పెట్టుబడులు
ఇక విద్యుత్‌ కార్లు, హైబ్రిడ్‌ వాహనాలు, స్వయం చోదిత కార్లు.. తదితరాల కోసం భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. ఇది లాభాలపై ఒత్తిడిని పెంచుతోంది. జేఎల్‌ఆర్‌ విషయంలోనూ అదే జరిగింది. అంతర్జాతీయంగా చాలా వరకు ఆటోమొబైల్ సంస్థలకు గడ్డుకాలం నడుస్తోంది.

టాటా మోటార్స్ షేర్లు ఇలా పతనం
ఫలితంగా శుక్రవారం మార్కెట్‌ ముగింపు సమయానికి బీఎస్‌ఈలో టాటా మోటార్స్ షేర్ 17.28% నష్టంతో రూ.151.30 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలో 17.58% మేర తగ్గి రూ.150.70 వద్ద స్థిరపడింది.

ధీరూబాయి సారథ్యంలో ముకేశ్, అనిల్ లకు ఇలా శిక్షణ
అన్నదములిద్దరికీ వ్యాపార గురువు ఒకరే. కానీ వారు తర్వాత రోజుల్లో అనుసరించిన వ్యాపార విధానాలు ఒకరిని అపర కుబేరుడిని చేస్తే, మరొకరిని అప్పులపాలు చేశాయి. వ్యాపారంలో అన్న దూసుకెళ్తుంటే, తమ్ముడు రుణ ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. 

ఆర్ -కామ్ దివాళా ప్రక్రియ కోసం అనిల్ ఇలా 
అనిల్ అంబానీ నిర్వహణలోని ఒక కంపెనీని దివాలా ప్రక్రియకు అనుమతించాలని కోరేంలా ఇబ్బందులు ఆయన్ను చుట్టుముట్టాయి. ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన  ధీరూబాయ్‌ అంబానీ కొడుకులే ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ. ప్రస్తుతం అనిల్‌ అంబానీ గ్రూపు (అడాగ్‌) అంతు లేని కష్టాల్లో చిక్కుకొన్నది. 

రిలయన్స్ ఇలా రెండుగా చీలిన వైనం
2005లో రిలయన్స్‌ గ్రూపును రెండుగా విడదీసి ఇద్దరు అన్నదమ్ములకు విభజన పంపకాలు చేసిన తర్వాత అనిల్‌ పరిస్థితి నానాటికి దయనీయంగా మారుతూ వచ్చింది. సుమారు రూ.4 లక్షల కోట్ల మార్కెట్‌ విలువ ఉన్న ఆయన కంపెనీల విలువ ఇప్పుడు రూ.25వేల కోట్ల కంటే తక్కువ ఉంది.  ఇందులో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. 

ఆర్ కాం రుణాలు రూ.45 వేల కోట్ల రుణాలుదేశీయ, విదేశీ రుణ సంస్థలకు కలిపి ఆర్‌కామ్‌ దాదాపు రూ.45,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ అప్పులు చెల్లించేందుకు ఆస్తుల విక్రయానికి కంపెనీ ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ముఖ్యంగా టవర్లు, స్పెక్ట్రమ్‌, ఫైబర్‌ను విక్రయించేందుకు ముకేశ్‌ నేతృత్వంలోని జియోతో రూ.17,000 కోట్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది కూడా. 

జియోతో ఒప్పందానికి నియంత్రణ పరమైన అనుమతుల అడ్డంకి
నియంత్రణపరమైన అనుమతులు రాకపోవడం, బ్యాంకర్ల అభ్యంతరాలతో జియోతో ఆర్ కామ్ ఒప్పంద ప్రక్రియకు అవరోధాలు ఏర్పడ్డాయి. ఒకవేళ ఈ ఒప్పంద ప్రక్రియ పూర్తయితే నిధులు సమకూరి ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియకు వెళ్లకపోయేదేమో. ఇదొక్కటే కాదు.. ఆస్తుల అమ్మకం కోసం అనిల్‌ చేసిన మిగిలిన ప్రయత్నాలూ విఫలమవడంతో దివాలా ప్రక్రియకు నిర్ణయం తీసుకున్నారు. 

విభజనకు ముందు రిలయన్స్ ఇలా
రిలయన్స్‌ గ్రూపు వ్యాపార విభజనకు ముందు కీలకమైన ఆర్‌కామ్‌ బాధ్యతలను ముకేశ్‌ అంబానీ చూస్తున్నారు. దీంతోపాటు పెట్రో కెమికల్స్‌ వ్యాపార బాధ్యతలు కూడా ఆయనే నిర్వహిస్తున్నారు. అనిల్‌ అంబానీ ఫైనాన్స్‌ సేవలపై ఎక్కువగా దృష్టి నిలిపేవారు. అప్పటివరకు ఎక్కువ మందికి ధీరూబాయ్‌ అంబానీ వారసుడంటే అనిల్‌ అనేంతగా గుర్తింపు సంపాదించుకున్నారాయన. 

విభజన సమయంలో సోదరుల మధ్య ఇలా డీల్
విభజన సమయంలో రిలయన్స్ కమ్యూనికేషన్స్ కావాలని అనిల్ అంబానీ పట్టుబట్టడంతో తాను ఎంతో కష్టపడి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ముకేశ్‌ ఓవైపు ఎంతో బాధపడుతూనే ఆ కంపెనీని అనిల్‌కు అప్పగించారని ఆయన సన్నిహితులు చెబుతారు. అదే సమయంలో ఒకరికొకరు పోటీ వచ్చే వ్యాపారాలు చేపట్టొద్దని ఇరువురి మధ్య ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. 2010లో ఆ ఒప్పందం గడువు ముగిసింది. 

ఇలా జియోతో టెలికం రంగంలోకి ముకేశ్ అంబానీ రంగ ప్రవేశం
దీంతో 2016లో జియో ఇన్ఫోకామ్‌తో టెలికాం రంగంలోకి ముకేశ్‌ అంబానీ అడుగుపెట్టారు. ఆయన ఓ వ్యాపారాన్ని ఎంత దూరదృష్టితో చూస్తారనడానికి జియో ఓ చక్కటి ఉదాహరణ. అప్పటివరకు టెలికం కంపెనీలు డేటా కోసం భారీ మొత్తంలో వసూలు చేసేవి. కాల్స్‌కు కూడా చార్జీలు ఎక్కువగానే ఉండేవి. జియో అడుగుపెట్టడంతోనే అన్ని కంపెనీలు దిగి వచ్చాయి. అప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్‌కామ్‌ పరిస్థితి నానాటికీ దిగజారి ఇప్పుడు దివాలా అంచున నిలిచింది. 

అడాగ్ తనఖా షేర్లను చట్టవిరుద్ధంగా అమ్మేశారా? 
అడాగ్‌ గ్రూపు తనఖా పెట్టిన షేర్లను ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎడెల్‌వైజ్‌ గ్రూపు సంస్థలు ఓపెన్‌ మార్కెట్‌లో తెగనమ్మడం వల్లే అనిల్‌ గ్రూపులోని ఆయా కంపెనీల షేర్లు దారుణంగా పడిపోయాయని తెలుస్తోంది. ఫిబ్రవరి ఒకటో తేదీన ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియకు అనుమతి కోరడంతో ఫిబ్రవరి 4-7 తేదీల మధ్య రూ.400 కోట్ల విలువైన షేర్లను ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎడెల్‌వైజ్‌ సంస్థలు విక్రయించాయి. 

రూ.13 వేల కోట్ల మేరకు అడాగ్ గ్రూప్ మార్కెట్ విలువ పతనం
ఫలితంగా మార్కెట్‌లో ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. మదుపర్లు ఆయా కంపెనీల షేర్లను భారీగా విక్రయించడంతో సుమారు 55 శాతం వరకు షేర్ల ధరలు పతనమయ్యాయి. దీంతో అడాగ్‌ గ్రూపు మార్కెట్‌ విలువ రూ.13వేల కోట్ల మేర హరించుకుపోయింది.

ఫైనాన్స్ కంపెనీలపై ఇలా రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపణ
చట్టవిరుద్ధంగా తమ గ్రూపు షేర్లను ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, ఎడెల్‌వైజ్‌ విక్రయించాయని, దీంతో తమ కంపెనీల మార్కెట్‌ విలువతోపాటు మదుపర్లకు నష్టం వాటిల్లిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆరోపించింది.  తనఖా పెట్టిన షేర్ల విలువ పడిపోతున్నా, దానికి సమానమైన మొత్తాన్ని సర్దుబాటు చేయమని కోరినా స్పందించకపోవడంతోనే షేర్లను విక్రయించాల్సి వచ్చిందని సదరు సంస్థలు చెబుతున్నాయి. 

ఆర్ దివాళా ప్రక్రియతో జియోతో ఒప్పందం కంచికే
ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియను ఎంపిక చేసుకోవడంతో జియోతో ఒప్పందం కథ దాదాపు ముగిసినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. అంతమాత్రాన ఆర్‌కామ్‌ ఆస్తుల కొనుగోలు నిమిత్తం జియోకు తలుపులు పూర్తిగా మూసుకుపోయినట్లు కాదని అంటున్నారు. లిక్విడేషన్‌ ప్రక్రియలో ఒప్పందం ధర కంటే కూడా చౌకగా వీటిని కొనుగోలు చేసే అవకాశం జియోకు ఉందని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios