Asianet News TeluguAsianet News Telugu

బిస్లరీ బ్రాండ్ ఇకపై టాటా సొంతం, మొత్తం డీల్ విలువ రూ. 7000 కోట్లు..

దేశంలో మినరల్ వాటర్‌కు పర్యాయపదంగా మారిన బిస్లరీని టాటా గ్రూపు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం 7000 కోట్ల రూపాయలతో టాటాతో ఒప్పందం కుదుర్చుకుంది. రిలయన్స్ రిటైల్, నెస్లే లాంటి కంపెనీలు కూడా రేసులో పాల్గొన్నప్పటికీ, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్  బిస్లరీని సొంతం చేసుకున్నారు. 

 

 

Tata Bisleri deal will be in 7000 crores
Author
First Published Nov 24, 2022, 12:33 PM IST

సాధారణంగా మినరల్ వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లినప్పుడు బిస్లరీ ఇవ్వమని అడుగుతారు. దీన్ని బట్టి మార్కెట్‌లో బిస్లరీ పేరు ఎంత ఫేమస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు టాటా గ్రూప్ కంపెనీ అయిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిస్లరీ బ్రాండను కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం 6000-7000 కోట్లకు డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. రిలయన్స్ రిటైల్, నెస్లే, లాంటి దిగ్గజ కంపెనీలు కూడా కొనుగోలు రేసులో ఉన్నప్పటికీ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ బిస్లరీని దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 

దాదాపు మూడు దశాబ్దాల క్రితం బిస్లరీ ఇంటర్నేషనల్‌కు అధినేత రమేష్ చౌహాన్ తనమ సంస్థకు చెందిన థమ్సప్, గోల్డ్ స్పాట్, లిమ్కా లాంటి దేశీయ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్‌లను కోకా-కోలా సంస్థకు విక్రయించారు. అయితే ఇప్పుడు తాజాగా టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ( TCPL )కి తమ బిస్లరీ బ్రాండును రూ. 6,000 నుంచి 7,000 కోట్లకు విక్రయిస్తున్నారు. 82 ఏళ్ల చౌహాన్ ఆరోగ్యం కొంతకాలంగా క్షీణించిందని, వ్యాపారాన్ని తదుపరి స్థాయి విస్తరణకు తీసుకెళ్లాల్సిన తన వారసుడిని కోల్పోయానని తెలిపారు. అలాగే తన కుమార్తె జయంతికి వ్యాపారంపై పెద్దగా ఆసక్తి లేదని చౌహాన్ తెలిపారు. ప్రస్తుతం బిస్లరీ భారతదేశపు అతిపెద్ద ప్యాకేజ్డ్ వాటర్ కంపెనీగా ఉంది. బిస్లరీ లాభదాయకమైన కంపెనీ కాబట్టి మార్కెట్ ఈ డీల్ గురించి చాలా ఉత్సాహంగా ఉంది. వార్తల ప్రకారం, ఒప్పందం ఉన్నప్పటికీ, ప్రస్తుత మేనేజ్‌మెంట్ రాబోయే 2 సంవత్సరాలకు బిస్లరీకి బాధ్యత వహిస్తుంది.

ఇక బిస్లరీ వ్యాపారం గురించి మాట్లాడుకుంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో బిస్లరీ ఆదాయం 2500 కోట్లు, కాగా లాభం 220 కోట్లు. కంపెనీ 122 ప్లాంట్లలో బిస్లరీని తయారు చేస్తోంది. అందులో 13 సొంత ప్లాంట్స్ ఉన్నాయి. ఇది మాత్రమే కాదు, కంపెనీకి 4500 డిస్ట్రిబ్యూటర్ల నెట్‌వర్క్, 5000 కంటే ఎక్కువ ట్రక్కులు సరుకులను రవాణా చేయడానికి ఉన్నాయి. ప్యాకేజ్డ్ వాటర్ మార్కెట్‌లో బిసిలరీ వాటా 32 శాతంగా ఉంది. 

బిస్లరీని విక్రయించడం ఇప్పటికీ బాధాకరమైన నిర్ణయమని, అయినప్పటికీ టాటా గ్రూప్ తమ సంస్థను మరింత ఎక్కువగా ప్రోత్సహిస్తున్నదని చౌహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, రిలయన్స్ రిటైల్, నెస్లే, డానోన్‌తో సహా పలు కంపెనీలు బిస్లరీని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించాయని, టాటాతో రెండేళ్లపాటు చర్చలు సాగగా, కొన్ని నెలల క్రితం టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, టాటా కన్స్యూమర్ సీఈవో సునీల్ డిసౌజాతో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. బిస్లరీ నిజానికి ఒక ఇటాలియన్ బ్రాండ్, ఇది భారతదేశంలో 1965లో ముంబైలో షాప్‌ను ఏర్పాటు చేసింది. చౌహాన్ 1969లో కొనుగోలు చేశారు.

కోకా-కోలా 1993లో చౌహాన్, అతని సోదరుడు ప్రకాష్ నుండి మొత్తం సాఫ్ట్ డ్రింక్స్ పోర్ట్‌ఫోలియోను కొనుగోలు చేసింది. వీటిలో సిట్రా, రిమ్‌జిమ్, మజా వంటి బ్రాండ్‌లు ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం టాటా కన్స్యూమర్ ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) స్పేస్‌లో చాలా వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో మార్కెట్ లీడర్ గా ఉండాలని ఆశిస్తోంది. ఇప్పటికే ఇది హిమాలయన్ బ్రాండ్‌తో కలిసి టాటా కాపర్ ప్లస్ వాటర్, టాటా గ్లూకో ప్లస్ లాంటి ప్యాక్ చేసిన మినరల్ వాటర్‌ను ఇప్పటికే మార్కె్లో విక్రయిస్తుంది. బిస్లరీని కొనుగోలు చేయడం ద్వారా, ఇది ఈ విభాగంలో నంబర్ 1కి చేరుకునే అవకాశం ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios