ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి రూపొందించిన అడ్వెంచర్ బైక్ ‘సుజుకి వీ స్ట్రోమ్ 650’ త్వరలో ఈ నెలాఖరులో రోడ్లపైకి రానున్నది. ఇప్పటికే ఈ బైక్ కొనుగోళ్ల కోసం వినియోగదారుల నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. సీకేడీ రూట్ ద్వారా భారతదేశానికి సుజుకి ఈ బైక్‌ను తేనున్నది. దీని ధర రూ.7.7 లక్షల నుంచి రూ.7.9 లక్షల వరకు పలుకుతున్నది. ఒక్కో బైక్‌పై డీలర్లు కొనుగోలు దారుడి నుంచి రూ.50 వేలు తీసుకుని బుకింగ్‌లు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది నిర్వహించిన 2018 ఆటో ఎక్స్ పోలో సుజుకి సంస్థ ‘వీ స్ట్రోమ్ 650’ మోటార్ బైక్‌ను ప్రదర్శించింది. 

సుజుకి వీ స్ట్రోమ్ 650 మోటార్ బైక్ 645సీసీ సామర్థ్యం గల వీ- ట్విన్ ఇంజిన్ కలిగి ఉంటుంది. 8,800 ఆర్పీఎం సామర్థ్యం గల ఇంజిన్ 71 హార్స్ పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6- స్పీడ్ ట్రాన్సిమిషన్, ట్విన్ ఓవర్ హెడ్ కంషాఫ్ట్స్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, లిక్విడ్ కూలింగ్ సదుపాయం కలిగి ఉంటుంది. 

సుజుకి వీ స్ట్రోమ్ 650 మోటార్ బైక్‌కు హ్యాండ్ గార్డ్స్‌తోపాటు ఇన్స్ట్రూమెంట్స్ ఉంటాయి. బ్రైట్‌నెస్‌తో కూడిన ఎల్సీడీ స్ర్రీన్ కలిగి ఉన్న స్పీడోమీటర్, ఒడోమీటర్, డ్యుయల్ ట్రిప్ మీటర్, రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ తదితర సదుపాయాలు ఉన్నాయి. వీటికితోడు స్మార్ట్ ఫోన్ల చార్జింగ్ కోసం 12 ఓల్టుల పవర్ ఔట్ లెట్ కూడా ఉంటుంది. 

సుజుకి న్యూ అడ్వెంచర్ మోటార్ బైక్ వీ- స్ట్రోమ్ 19 అంగుళాల పొడవు గల ముందు ఫ్రంట్ వీల్, 17 అంగుళాల రేర్ వీల్, డిస్క్ బ్రేక్స్, రెండు వైపులా నాన్ స్విచ్ఛబుల్ ఏబీఎస్ కలిగి ఉన్నది. ట్విన్ స్పేర్ అల్లోయ్ ఫ్రేమ్, వైర్ స్పోక్ రిమ్స్, ట్యూబ్ లెస్ టైర్స్ తోపాటు కన్వెన్షనల్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, వెనుక వైపు అడ్జస్టబుల్ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, వైండ్ స్క్రీన్, హ్యాండిల్ బార్ గార్డ్స్ తోపాటు వీ - స్ట్రోమ్ 650 బరువు 213 కిలోలు ఉంటుంది. 

భారతదేశంలో సుజుకి సంస్థ తయారు చేస్తున్న మూడో మోటార్ బైక్ ‘సుజుకి వీ - స్ట్రోమ్ 650’. ఇంతకుముందు హయాబుస్సా, జీఎస్ఎక్స్-ఎస్750 మోడల్ బైకులు భారతదేశంలో మార్కెట్‌లోకి విడుదల చేసింది. సుజుకి వీ - స్ట్రోమ్ బైక్.. కవాసాకీకి చెందిన వెర్స్యేస్ 650 మోడల్ బైక్‌తో తలపడనున్నది.