Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ మార్కెట్లకు యాపిల్ ‘కోత’! దేశీయంగా ‘విలీనం` దెబ్బ

యాపిల్ అంచనాలు తగ్గించడం, చైనా- అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం దరిమిలా హువావే వైస్ చైర్మన్ వాంగ్ మెంగ్ఝూ అరెస్ట్ వల్లేనని టిమ్ కుక్ ప్రకటించడంతో ఇన్వెస్టర్లలో నెగెటివ్ ట్రెండ్ మొదలైంది. 

Stocks Fall, Bonds and Gold Rally, as Apple China Warning Rattles Global Markets
Author
Washington, First Published Jan 4, 2019, 9:32 AM IST

ఐఫోన్ల విక్రయాలు తగ్గడంతోపాటు హాలీడే త్రైమాసికంలో ఆదాయం తగ్గడంతో ఈ ఏడాది సంస్థ వృద్ధి అంచనాలు తగ్గిస్తూ టెక్ దిగ్గజం ‘యాపిల్` తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్లలో మదుపర్లకు రుచించలేదు.

ఫలితంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లన్నీ పతనం దిశగా పయనించాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగడంతోపాటు అమెరికా డాలర్పై రూపాయి మారకం విలువ తగ్గింది.

ఇదిలా ఉంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ సారథ్యంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం రైతులకు ప్యాకేజీ ప్రకటించనున్నదన్న వార్తలు కూడా ఇన్వెస్టర్లకు రుచించలేదు. ప్రభుత్వ ఖజానాపై పెనుభారం మోపడమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు భారత దేశ మార్కెట్లు కూడా పతనం బాట పట్టాయి. దీనికి తోడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయాబ్యాంక్, డేనా బ్యాంక్ విలీనం కూడా ఇన్వెస్టర్లకు నచ్చలేదు. ఫలితంగా దెనా బ్యాంక్ షేర్లు బేర్మన్నాయి. 

రెండు రోజుల్లో రూ.2.66 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ద్రవ్యలోటు మరింతగా విస్తరిస్తుందనే భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా నిఫ్టీ కీలకమైన 10,700 పాయింట్ల దిగువకు పడిపోయింది.

120 పాయింట్లు తగ్గి 10,672 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 378 పాయింట్లు పతనమై 35,514 పాయింట్ల వద్ద ముగిసింది. లోహ, వాహన, బ్యాంక్ షేర్ల నష్టాలు రెండో రోజూ కొనసాగాయి.

యాపిల్ కంపెనీ తన ఆదాయ అంచనాల్లో కోత విధించింది. గత 12 ఏళ్లలో కాలంలో ఈ కంపెనీ ఆదాయ అంచనాలను తగ్గించడం ఇదే మొదటిసారి. దీంతో అమెరికా మార్కెట్ పతనం కాగా, గురువారం ఆసియా, యూరప్ మార్కెట్లు కూడా నష్టపోయాయి.

ఇది మన మార్కెట్పై కూడా ప్రభావం చూపింది. రైతులకు ఒక్కో ఎకరానికి రూ.4,000 వరకూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని వార్తలు హల్చల్ చేశాయి. ఫలితంగా ఖజానాపై భారీగా భారం పడనున్నదన్న ఆందోళన వ్యక్తమైంది.

 వచ్చే వారం నుంచి కంపెనీల క్యూ3 ఫలితాలు వెల్లడి కానుండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకాలు జరపడం, ముడి చమురు ధరలు పెరగడంతో డాలర్తో రూపాయి మారకం మళ్లీ 70ను దాటిపోవడం సెంటిమెంట్ను దెబ్బతీశాయి.  

దేశీయ స్టాక్ మార్కెట్ బీఎస్ఈలో ప్రారంభంలో సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. ఆరంభ కొనుగోళ్ల జోరుతో 108 పాయింట్లు లాభపడింది. ఆసియా మార్కెట్ల నష్టాలు పెరగడంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోకి జారిపోయింది. అమ్మకాలు కొనసాగడంతో ఒక దశలో 416 పాయింట్ల వరకూ నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 524 పాయింట్ల రేంజ్లో కదలాడింది.

ఇక నిఫ్టీ ఒక దశలో 22 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 131 పాయింట్లు పతనమైంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో దేనా బ్యాంక్, విజయ బ్యాంక్ల విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం సంబంధిత బ్యాంక్ షేర్లపై ప్రభావం చూపింది. 

షేర్ల మార్పిడి నిష్పత్తి సరిగ్గా లేదన్న కారణంగా దేనా బ్యాంక్ 20%  పతనమై రూ.14.40 వద్ద, విజయ బ్యాంక్ 7% తగ్గి రూ.47.60 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో పెరిగినప్పటికీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఎలాంటి మార్పు లేకుండా రూ.119.4 వద్ద ముగిసింది.

స్టాక్ మార్కెట్ పతనంతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.27 లక్షల కోట్లు ఆవిరైంది. మొత్తం 2 రోజుల్లో రూ.2.66 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది.చైనాకు చెందిన హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ మెంగ్ వాంఝూను కెనడాలో అరెస్ట్చేసి అమెరికా తరలించడం చైనాలో ఐఫోన్ అమ్మకాలపై ప్రభావం చూపగలదని యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్కుక్ పేర్కొన్నారు.

జాతీయవాద సెంటిమెంట్తో చైనీయులు ఐఫోన్లను కొనడం మానేసే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లకు తాజాగా రాసిన లేఖలో ఆయన తెలిపారు. ఈ కోత ప్రభావం గురువారం యాపిల్ షేర్పై తీవ్రంగానే పడింది.

ఈ షేర్ ధర గురువారం ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 11.30) 10% క్షీణించి 142 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది ఈ షేర్ ఆల్ టైమ్ హై, 233 డాలర్లను తాకింది. అప్పటి నుంచి చూస్తే, దాదాపు 40 శాతం పతనమైంది.

రూపాయి మారకం విలువ రూ. 70.52కి చేరుకోవడంతో స్వల్ప వ్యవధి తర్వాత వాణిజ్యలోటు పెరుగుతుందన్న ఆందోళన దేశీయ స్టాక్ మార్కెట్లలో వ్యక్తం అయింది. క్రూడాయిల్ కూడా 55 డాలర్లను అధిగమించి ట్రేడ్ అవుతున్నది. ఉత్పత్తి తగ్గింపు ఈ నెల నుంచే ప్రారంభిస్తున్న ఒపెక్ దేశాలు ప్రకటించినందున క్రూడాయిల్ సరఫరా తగ్గిపోనుంది. 

దీంతో ధరలు పెరుగుతాయన్న అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మళ్లీ అమ్మకాలను తీవ్రతరం చేయడంతో కూడా పతనం ఎక్కువగా ఉంది. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల ఒత్తిడి ఎదురుకావడంతో సెక్టోరియల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే ముగిశాయి. 

గరిష్ఠంగా మెటల్ ఇండెక్స్ 2.25 శాతం నష్టపోగా, మీడియా 1.92 శాతం, ఆటో 1.52 శాతం, ఫార్మా 1.33శాతం, బ్యాంక్ నిఫ్టీ 0,79 శాతం చొప్పున నష్టపోయాయి. మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.83 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.82 శాతం పతనమయ్యాయి.

ఎన్‌ఎస్‌ఈలో 1,196 షేర్లు నష్టపోగా, కేవలం 566 షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. నిఫ్టీలో కేవలం 8 షేర్లుమాత్రమే లాభపడ్డాయి. ఇన్‌ఫ్రాటెల్ 3.31 శాతం లాభపడింది. కాగా, టైటాన్, హెచ్‌సీఎల్‌టెక్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు సగటున పావు శాతం మేర లాభపడ్డాయి. 

కాగా, ఐషర్ మోటార్స్ మరో 4.22 శాతం నష్టపోయింది. హింద్ పెట్రో 3.47 శాతం, ఓఎన్‌జీసీ 3.43 శాతం, ఇండియాబుల్స్ హౌజింగ్ 3.36 శాతం, ఐఓసీ 3.32 శాతం చొప్పున నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో 41 షేర్లు కొత్త 52 వారాల కనీస స్థాయిని నమోదు చేశాయి.

కేవలం నాలుగు షేర్లు మాత్రమే 52 వారాల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. కాగా, ఎఫ్‌ఐఐలు మొత్తం రూ. 972.81 కోట్ల అమ్మకాలు జరుపగా, డీఐఐలు రూ.34.52 కోట్ల కొనుగోళ్లు జరిపారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios