Asianet News TeluguAsianet News Telugu

రికార్డులు బద్దలు కొడుతున్న స్టాక్ మార్కెట్లు,సెన్సెక్స్ మ్యాజికల్ ఫిగర్ 1 లక్ష పాయింట్లను ఎప్పుడు తాకుతుంది ?

ఓ వైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం భయపెడుతున్నప్పటికీ  భారత స్టాక్ మార్కెట్లు మాత్రం దూసుకెళ్తున్నాయి. తాజాగా స్టాక్ మార్కెట్  బెంచ్ మార్క్ సూచీలు అయిన,  సెన్సెక్స్, నిఫ్టీ  ఆల్టైమ్ రికార్డు స్థాయి వద్ద ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ మంగళవారం కూడా 62800 పాయింట్ల ఎగువన ట్రేడవుతోంది.  దీంతో త్వరలోనే సెన్సెక్స్ లక్ష పాయింట్ల స్థాయిని తాకడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

Stock markets breaking records, when will Sensex magical figure touch 1 lakh points
Author
First Published Nov 29, 2022, 3:05 PM IST

ఈ వారం ప్రారంభం నుంచే భారత స్టాక్ మార్కెట్  బెంచ్మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ  రెండూ కూడా జీవిత కాల ఆల్ టైమ్ రికార్డు స్థాయిని తాకాయి.  మంగళవారం కూడా 62800 పాయింట్ల ఎగువన తాకి  ఆల్టైమ్ రికార్డు నమోదు చేసింది.  మరోవైపు నిఫ్టీ కూడా 18,678 పాయింట్ల వద్ద అ ఆల్టైమ్ రికార్డు స్థాయిని తాకింది. 

 ఈ నేపథ్యంలో  సెన్సెక్స్ 1,00,000 పాయింట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ఎప్పుడు తాకుతుందనే  ఎదురుచూపులు మొదలయ్యాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టర్లు, మార్కెట్ నిపుణులు కూడా లెక్కలు, అంచనాలు వేయడం ప్రారంభించారు.  నిజానికి సెన్సెక్స్  లక్ష పాయింట్లు తాకడం అనేది  సైకలాజికల్ గా ఇన్వెస్టర్లకు ఒక  బూస్ట్ ఇస్తుంది. 

 దీనికి సంబంధించి జెఫరీస్‌లోని గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీస్ క్రిస్టోఫర్ వుడ్  కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 ఆర్థిక సంవత్సరం లేదా 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి సెన్సెక్స్ 1 లక్ష మార్కును తాకే అవకాశం ఉందని అంచనా వేశారు. దలాల్ స్ట్రీట్ , వెటరన్ ఫండ్ మేనేజర్ హిరెన్ వేద్ సైతం 2025 ప్రారంభంలోనే సెన్సెక్స్ 1 లక్ష పాయింట్ల ను తాకే వీలుందని  ఆశాభావం వ్యక్తం చేశారు. 

1 లక్ష పాయింట్ల స్థాయిని తాకితే ఏమవుతుంది..? 
మరోవైపు 2023 డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 80,000 మార్కును తాకుతుందని బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ  అంచనా వేసింది. మరోవైపు, కేడియా అడ్వైజరీ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ కేడియా మాట్లాడుతూ, ఏడాదిన్నర వ్యవధిలో, సెన్సెక్స్ మ్యాజికల్ ఫిగర్ 1 లక్షను తాకడం  ఖాయం అని,  భారత  ఈక్విటీ మార్కెట్లలో జోరును చూసి  ప్రపంచం మొత్తం  ఆశ్చర్య పోతుందని తెలిపారు.  అటు  కరోనా తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితి చాలా మెరుగుపడిందని, ఇప్పుడు పారిశ్రామిక డిమాండ్ కూడా  పెరిగిందని, అందుకే సెన్సెక్స్ కొత్త ఎత్తులను తాకుతుందని అంచనా వేశారు.

10 ఏళ్లలో 2,00,000 పాయింట్లకు సెన్సెక్స్
సెన్సెక్స్ రాబోయే పదేళ్లలో 2,00,000 పాయింట్ల స్థాయికి చేరుకుంటుందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్ రామ్‌దేవ్ అగర్వాల్ తెలిపారు. ఏప్రిల్ 2024 నాటికి సెన్సెక్స్ 1,00,000 పాయింట్లకు చేరుకుంటుందని సామ్‌కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ అపూర్వ సేథ్ అంచనా వేశారు. అయితే పెరుగుతున్న చమురు ధరల తో భారత స్టాక్ మార్కెట్ ముప్పు పొంచి ఉందన్నారు. విదేశీ  మదుపుదారులు (FPIలు) భారతదేశంలో బలంగా పెట్టుబడిని కొనసాగిస్తారని అంచనా వేశారు. 

20 ఏళ్లలో సెన్సెక్స్ 20 రెట్లు పెరిగింది
గత 20 ఏళ్లలో సెన్సెక్స్ 3,000 పాయింట్ల నుంచి 20 రెట్లు పెరిగి 60,000 పాయింట్ల స్థాయిని దాటింది. ఏడాదికి 15% చొప్పున మార్కెట్ వృద్ధిని కొనసాగిస్తే, ఇప్పటి నుండి 4 సంవత్సరాలలో మార్కెట్ మ్యాజిక్ ఫిగర్ 1 లక్షను దాటుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. రాబోయే కాలంలో పరిస్థితులు మెరుగుపడతాయని , భారత స్టాక్ మార్కెట్ వేగంగా పెరుగుతుందని నిపుణులు ఆశిస్తున్నారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios