న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లు ఈ వారంలో కేవలం మూడు రోజులు మాత్రమే ట్రేడింగ్‌ ఉండనుంది. ఎందుకంటే నేడు ఆంటే సోమవారం మహావీర్‌ జయంతి కాగా, శుక్రవారం రోజు గుడ్‌ఫ్రైడే ఉండటంతో స్టాక్‌ మార్కెట్లు మూసివేయనున్నారు.

అలాగే శనివారం కూడా తోడవడంతో ఈవారంలో మొత్తం మూడు రోజులకు స్టాక్‌ మార్కెట్లు పరిమితంకానున్నది. దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈవారంలో కాస్త మరింత ఒత్తిడికి గురికావచ్చునని దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. కరోనా వైరస్‌తో ఈ ఏడాది భారీగా పతనమైన సూచీలు ఇప్పట్లో కోలుకునే అవకాశాలు ఏమి కనిపించడం లేదు.  

కరోనా వైరస్‌ మహమ్మారితో భారత్‌తోపాటు అంతర్జాతీయ దేశాలు కూడా అతలాకుతలమవుతుండటంతో ఈక్విటీలు కిందకి పడిపోతున్నాయి. తీవ్ర హెచ్చుతగ్గుదలకు లోనవుతున్న ప్రస్తుత తరుణంలోనే మదుపరులు పెట్టుబడులు పెట్టాలని, భవిష్యత్తులో అధిక రిటర్నులు రావచ్చని జియోజిట్‌ ఫైనాన్షియల్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ అన్నారు.

భారత వృద్ధిపై ఫిచ్‌ ఆందోళన వ్యక్తంచేయడం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 30 ఏండ్ల కనిష్ఠ స్థాయి 2 శాతానికి పడిపోనున్నట్లు అంచనాను విడుదల చేయడం మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నదని తెలిపింది. సోమవారం సేవల రంగానికి సంబంధించి పీఎంఐ నివేదిక కూడా మార్కెట్లో సెంటిమెంట్‌ను ప్రభావితం చేయనున్నది.

అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు కూడా కీలకమని మార్కెట్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతవారంలో సెన్సెక్స్‌ 2,224.64 పాయింట్లు లేదా 7.46 శాతం పతనమైంది.

మరోవైపు గతవారంలో స్టాక్‌ మార్కెట్లు కుదేలుకావడంతో టాప్‌-10 కంపెనీల్లో ఏడింటి మార్కెట్‌ క్యాప్‌ రూ.2.82 లక్షల కోట్లు కోల్పోయాయి. వీటిలో టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌టెల్‌లు అత్యధికంగా నష్టపోయాయి.