Asianet News TeluguAsianet News Telugu

సత్యం.. పీఎన్బీని మించిన ఫ్రాడ్.. సందేసరా బ్రదర్స్ ‘స్లెర్లింగ్’

సందేసరా బ్రదర్స్ సారథ్యంలోని స్టెర్లింగ్ బయోటెక్ సంస్థ దేశీయ బ్యాంకులు, విదేశాల్లోని భారత బ్యాంకుల శాఖల నుంచి భారీగా రుణాలు పొందింది. రమారమీ రూ.15 వేల కోట్ల పై చిలుకు రుణాలు పొంది.. డొల్ల కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించారని తెలుస్తోంది

Sterling Biotech case: Sandesara brothers scam much bigger than PNB scam, claims ED
Author
New Delhi, First Published Jun 30, 2019, 11:04 AM IST

ఇప్పటి వరకు బ్యాంకింగ్‌ రంగంలో సంచలనం సృష్టించిన కుంభకోణం పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌(పీఎన్బీ) స్కామ్ అందరికి గుర్తు. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, ఆయన మేనమామ మెహుల్‌ ఛోక్సీ తదితరులు కలిసి పీఎన్బీని దాదాపు రూ. 13,500వేల కోట్లకు మోసగించారు. 

కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద కుంభకోణం వెలుగు చూసింది. ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ప్రమోటర్లు.. సందేసరా సోదరులు పలు బ్యాంకులకు రూ. 14వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా వెల్లడించింది. 

స్టెర్లింగ్‌ కంపెనీ, దాని ప్రమోటర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా, దీప్తి సందేసరా రూ. 5,393కోట్ల బ్యాంకు రుణాల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో 2017లో వీరిపై ఈడీ, సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో కీలక విషయాలు వెలుగుచూసినట్లు ఈడీ వర్గాల సమాచారం. 

భారత్‌లోని బ్యాంకుల నుంచే కాకుండా.. విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖల నుంచి కూడా సందేసరా గ్రూప్‌ దాదాపు రూ. 9000 కోట్ల రుణాలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ, సీబీఐ చెబుతున్న సమాచారం. భారతీయ బ్యాంకుల నుంచి దేశీయ, విదేశీ కరెన్సీల్లో స్టెర్లింగ్‌ రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఆంధ్రాబ్యాంక్‌, యూకో బ్యాంక్‌, ఎస్‌బీఐ, అలహాబాద్‌ బ్యాంక్‌, బ్యాంక్ ఆంఫ్‌ ఇండియా తదితర బ్యాంకుల కన్సోర్షియం నుంచి ఈ రుణాలు పొందినట్లు ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పుడు పత్రాలతో ఈ రుణాలు పొంది వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నారని దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 

వడోదర కేంద్రంగా స్టెర్లింగ్‌ బయోటెక్‌ సంస్థ తన కార్యకలాపాలు నిర్వహించింది. 2008 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ తమ అవసరాలకు రూ.50 కోట్ల విలువైన వస్తు సామగ్రిని కొనుగోలు చేసింది. బ్యాంకులకు సమర్పించిన వివరాల్లో మాత్రం రూ.405 కోట్ల విలువైన వస్తువులు కొన్నట్టు చూపింది. 

2007-08లో గ్రూపు కంపెనీల టర్నోవర్‌ మొత్తం రూ.304.80 కోట్లు ఉంటే.. ఆదాయ పన్ను శాఖకు, బ్యాలెన్స్‌ షీట్లలో రూ.918.30 కోట్లు ఉన్నట్టు చూపింది. వీటికి తోడు స్టెర్లింగ్‌ కంపెనీ, దాని ప్రమోటర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా, దీప్తి సందేసరా అక్రమ మార్గాల్లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి బ్యాంకుల నుంచి 'స్టాండ్‌బై లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌' (ఎస్‌బీఎల్‌సీ) ద్వారా దాదాపు రూ.5,393 కోట్ల బ్యాంకు రుణాలను పొందారు. 

ఈ బ్యాంకు రుణ కుంభకోణం కోసం ప్రమోటర్లు దేశీయంగా 249, విదేశాల్లో 96 డొల్ల కంపెనీల్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బినామీ కంపెనీల ద్వారా సందేసరాలు స్టెర్లింగ్‌ బయోటెక్‌తో పాటు గ్రూపులోని మరో కంపెనీ స్టెర్లింగ్‌ ఇంటర్నేషనల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేర్లలోనూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిపినట్టు సీబీఐ గుర్తించింది. 

స్టెర్లింగ్ గ్రూపు కంపెనీల గొలుసుకట్టు లావాదేవీలతో ఆ సంస్థ బ్యాంకుల నుంచి తీసుకున్న వేల కోట్ల రుణాలను విదేశాల్లోని కంపెనీలకు దారి మళ్లించినట్టు విచారణలో తెలింది.

ఎక్కువ మొత్తంలో రుణాలు పొందేందుకు గ్రూపు కంపెనీల టర్నోవర్‌ను అధికం చేసి చూపడం, లేని ఆస్తులను ఉన్నట్టు చూపడం, కల్పిత టర్నోవర్‌పై పన్నులు చెల్లించడం వంటి మోసాలకు పాల్పడినట్టు సీబీఐ పేర్కొంది. 

దీంతో కంపెనీ డైరెక్టర్లు చేతన్‌ జయంతిలాల్‌ సందేశర, విలాస్‌ జోషి, దీప్తి చేతన్‌ సందేశర, రాజభూషణ్‌ ఓంప్రకాశ్‌ దీక్షిత్‌, నితిన్‌ జయంతిలాల్‌ సందేశర, కంపెనీ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ హేమంత్‌ హాతి, ఆంధ్రా బ్యాంకు మాజీ డైరెక్టర్‌ అనూప్‌ గర్గ్‌లపై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసిన విషయం తెలిసిందే.

నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ, అవినీతి వంటి ఆరోపణలపై వీరందరిపైనా అభియోగాలు ఉన్నాయి. స్టెర్లింగ్ కంపెనీ, దాని ప్రమోటర్లు నితిన్‌ సందేసరా, చేతన్‌ సందేసరా, దీప్తి సందేసరాలు దాదాపు రూ.15 వేల కోట్ల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వీరిలో చాలా మంది ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

బ్యాంకు అధికారుల సాయంతో పాటు సందేసరాలకు ఉన్నత స్థాయి రాజకీయ నేతలతో మంచి సంబంధాలున్నాయని తెలుస్తోంది. ఈ పలుకుబడిని వినియోగించుకొనే వారు వేలాది కోట్ల మేర బ్యాంక్‌ మోసాలకు పాల్పడ్డారన్న విమర్శలు వినవస్తున్నాయి. ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐ, ఆదాయ పన్ను విభాగం దర్యాప్తు నిర్వహిస్తున్నాయి.

స్టెర్లింగ్‌ బయోటెక్‌ కేసులో ఇటీవల ఈడీ రూ. 9,778 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసిన విషయం తెలిసిందే.

ఇందులో నైజీరియాలోని నాలుగు చమురు రిగ్గులు, ఓఎంఎల్‌ 143 అనే చమురుక్షేత్రం, తుల్జాభవానీ, వరింద, భవ్య, బ్రహ్మణి ఈటీసీ అనే పేర్లతో పనామాలో రిజిస్టరైన నాలుగు నౌకలు, సైబ్‌ఎల్‌ఎల్‌సీ పేరుతో అమెరికాలో రిజిస్టరైన ఓ విమానం, లండన్‌లోని విలాసవంతమైన ఫ్లాట్‌ ఉన్నాయి. ఈడీ జారీ చేసిన అతిపెద్ద ఆస్తుల జప్తు ఆదేశాల్లో ఇదొకటని అధికారులు తెలిపారు. ఇందులో ఎక్కువ భాగం విదేశాల్లోని ఆస్తులే ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios