Asianet News TeluguAsianet News Telugu

నో డాక్యుమెంట్స్: డెబిట్ కార్డ్ ఆధారంగానే ఈఎంఐ.. ఎస్బీఐ ఆఫర్ ఇది

ఇక రుణాలు తీసుకునేందుకు ఈఎంఐ ఆప్షన్ పొందేందుకు పత్రాలు పూర్తి చేయనక్కరలేదు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన డెబిట్ కార్డులపై పీఓఎస్‌ల వద్ద ఈఎంఐ ఆప్షన్ కింద వస్తువులు కొనుగోలు చేయొచ్చు.

State Bank of India launches debit card EMI facility for account holders; instalments to begin a month after completing transaction
Author
Hyderabad, First Published Oct 8, 2019, 2:40 PM IST

రిఫ్రిజరేటర్, వాషింగ్ మెషీన్​ వంటివి కొంటున్నారా? ఒకేసారి నగదు చెల్లించకుండా ఈఎంఐ పద్ధతిలో తీసుకోవాలని అనుకుంటున్నారా? క్రెడిట్ కార్డు ఉంటే నెలవారీ వాయిదాల పద్ధతిలో చెల్లించొచ్చు. అలాంటి వారి కోసం  భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మరో అడుగు ముందుకు వేసింది. దసరా వేళ ఎస్బీఐ శుభవార్త చెప్పింది. డెబిట్‌ కార్డు కస్టమర్లకు ఎస్బీఐ ‘ఈఎంఐ’ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నట్టు ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది.

దేశ వ్యాప్తంగా 40 వేలకు పైగా వాణిజ్య సముదాయాలు, వ్యాపార సంస్ధల వద్ద ఏర్పాటు చేసిన పాయింట్‌ ఆఫ్‌ సేల్స్‌ (పీఓఎస్‌) వద్ద ఎస్బీఐ డెబిట్‌ కార్డు దారులు వస్తువులను కొనుగోలు చేసి నెలసరి వాయిదాల రూపంలో (ఈఎంఐ)లో చెల్లింపులు చేపట్టే వెసులుబాటు కల్పిస్తున్నామని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు.

దేశవ్యాప్తంగా 1500 నగరాల్లోని 40 వేల మంది వ్యాపారుల నుంచి డెబిట్ కార్డ్ ఈఎంఐపై ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు కొనుగోలు చేయొచ్చు. వస్తువుల కొనుగోలుకు అయ్యే మొత్తం తక్షణమే ఒకేసారి చెల్లించకుండా డెబిట్‌ కార్డుల ద్వారా కస్టమర్లు ఈఎంఐపై వాటిని కొనుగోలు చేయవచ్చని ఎస్బీఐ ఛైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ పేర్కొన్నారు. 

కనిష్టంగా ఆరు నెలల నుంచి 18 నెలల వరకూ వినియోగదారులు ఈఎంఐ గడువును ఎంపిక చేసుకోవచ్చని ఎస్బీఐ ప్రకటన పేర్కొంది. దీనికోసం డెబిట్‌కార్డు కల వినియోగదారులు ఎలాంటి ప్రాసెసింగ్‌, డాక్యుమెంటేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్బీఐ తెలిపింది. 

సేవింగ్స్‌ ఖాతాలో అకౌంట్‌ బ్యాలెన్స్‌తో సంబంధం లేకుండా ఒక్క నిమిషంలోనే ఈ సదుపాయం పొందవచ్చని తెలిపింది. లావాదేవీ పూర్తయిన నెల తర్వాత ఈఎంఐలు మొదలవుతాయి. మెరుగైన క్రెడిట్‌ హిస్టరీ కలిగిన కస్టమర్లంతా వినిమయ రుణాలను పొందవచ్చని ఎస్బీఐ పేర్కొంది. 

కస్టమర్లు తమ అర్హత చెక్‌ చేసుకునేందుకు డీసీఈఎంఐ అని టైప్‌ చేసి 567676 నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేయాలని తెలిపింది. అయితే ఈ నెంబర్‌కు ఎస్‌ఎంఎస్‌ చేసిన పలువురికి ఫెయిల్డ్‌ అని రిప్లై వస్తుండటం గమనార్హం.

వీరందరి దగ్గర ఉన్న 4.5 లక్షల పోస్ మెషిన్ల (స్వైపింగ్​ యంత్రాలు) ద్వారా లావాదేవీ జరపాలి. 6 నుంచి 18 నెలల్లో ఈఎంఐ ఎంచుకోవచ్చు. కొనుగోలు జరిపిన నెల రోజులకు నెలవారీ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. 

కొన్ని ఎంపిక చేసిన బ్రాండ్ల వస్తువులు కొనుగోలు చేస్తే, జీరో డాక్యుమెంటేషన్ రుసుము, జీరో ప్రాసెసింగ్ రుసుము, సున్నా వడ్డీ వంటి ఆఫర్లు వర్తిస్తాయని తెలిపింది ఎస్​బీఐ.

Follow Us:
Download App:
  • android
  • ios