Gold Jewelry: బంగారు నగలు ఇష్టమడని మగువలు ఉంటారా? కాస్త డబ్బులెక్కువైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనడానికే ఇష్టపడతారు. అయితే తయారీ ఛార్జీలు, వేస్టేజ్ లేకుండా బంగారు నగలు ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

బంగారు నగలు కొనుక్కోవడం అంటే మహిళలకు చాలా ఇష్టం. ఇవి వారి ఆడంబరాలు తీరుస్తాయి. అదేవిధంగా అవసరానికి తాకట్టు పెట్టుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. అందుకే రిస్క్ ఎక్కువగా ఉన్న రంగాల్లో పెట్టుబడి పెట్టడం కంటే బంగారంలో పెట్టుబడి పెట్టడమే సేఫ్ అని ప్రజలు నమ్ముతారు. బంగారం ధర పెరుగుతున్న కొద్దీ ఆస్తి కూడా పెరుగుతుంది. బంగారు నగలు కొనేటప్పుడు ఛార్జీలు లేకుండా లేదా తక్కువ పడాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. 

నగల షాపుల్లో సేవింగ్స్ స్కీమ్స్ లో చేరండి

సామాన్యులు కూడా బంగారం కొనుక్కొనేందుకు చాలా నగల షాపుల్లో బంగారం లేదా నగల పొదుపు పథకాలు ఉన్నాయి. వీటిల్లో చేరి నెలనెలా ఒక నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్ చేసి బంగారం కూడబెట్టుకోవచ్చు. టైమ్ పీరియడ్ పూర్తయ్యాక మనం డిపాజిట్ చేసిన మొత్తం డబ్బుకి సమానమైన బంగారాన్ని అదే షాపులో కొనుక్కోవచ్చు. దీనికి కొన్ని ఆఫర్లు కూడా ఉంటాయి.

బంగారం కొనడంలో లాభ శాతం ఎలా ఉంటుందంటే..

బంగారం డైరెక్ట్ గా కొంటే లాభం 9 శాతం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే నగలుగా కొన్నప్పుడు 7 శాతం మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అందులో జీఎస్టీ, తయారీ ఛార్జీలు, వేస్టేజ్ లాంటివి ఉంటాయి.

డిజిటల్ బంగారం విషయంలో లాభం 8 శాతం ఉంటుంది. ఈటీఎఫ్ పెట్టుబడిలో 8.9 శాతం లాభం వస్తుంది. అదే గోల్డ్ బాండ్లలో వడ్డీతో కలిపి 11.5 శాతం లాభం వస్తుంది. 

బంగారం కొనడంలో రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవే..

అయితే నగలుగా కొన్న బంగారాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో చాలా రిస్క్ ఉంటుంది. దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. డిజిటల్ బంగారంలో సరైన నియమాలు లేకపోవడం వల్ల అందులో కూడా కొంత రిస్క్ ఉంటుంది. 

ఈటీఎఫ్‌లను సెబీ పర్యవేక్షిస్తుంది. దీనివల్ల, ఈటీఎఫ్ పెట్టుబడిలో రిస్క్ తక్కువ. గోల్డ్ బాండ్లను ప్రభుత్వమే నిర్వహిస్తుంది కాబట్టి అందులో రిస్క్ లేదని నిపుణులు చెబుతున్నారు. మన అవసరాన్ని బట్టి బంగారంలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు పొందవచ్చు.

బంగారు నగలలో వేస్టేజ్ అంటే ఏమిటి? 

చేతితో లేదా యంత్రాలతో బంగారాన్ని కరిగించి నగలు చేసేటప్పుడు కొంత బంగారం వృథా అవుతుంది. దీన్నే వేస్టేజ్ అంటారు. నగలు కొనేటప్పుడు బంగారం ధరతో పాటు తయారీ ఛార్జీలు కూడా చెల్లించాలి. సింపుల్ డిజైన్ నగల కంటే క్లిష్టమైన డిజైన్ల నగలకు తయారీ ఛార్జీలు ఎక్కువ. కాబట్టి పొదుపు, పెట్టుబడి కోసం నగలు కొనేవారు సింపుల్ డిజైన్ నగలను ఎంచుకుంటే మంచిది. దీనివల్ల ఛార్జీలు కొంత తగ్గుతాయి.

కేరళ మోడల్ నగలు బెస్ట్

కేరళ మోడల్ నగల్లో డిజైన్ తక్కువగా ఉంటుంది. వాటిని తయారు చేసేటప్పుడు వేస్టేజ్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి ఛార్జీలు తక్కువగా ఉంటాయి. బెంగాల్ మోడల్, యాంటిక్ మోడల్ నగల్లో డిజైన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి ఛార్జీలు, వృథా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి నగలను కొనకుండా ఉంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.