న్యూఢిల్లీ: రియల్టీలో స్తంభించిపోయిన ప్రాజెక్టులను తిరిగి పట్టాలకెక్కించి లక్షలాది మంది ఇంటి కొనుగోలుదారులకు ఊరట కల్పించేందుకు ఒక ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం రియల్‌ ఎస్టేట్‌ రంగ ప్రతినిధులతో నిర్వహించిన రెండు ప్రత్యేక సమావేశాల్లో ఈ అంశం పరిశీలనకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ నిధి ఏర్పాటుపై త్వరలో కేబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన మరో సమావేశం నిర్వహిస్తామని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిర్మలా సీతారామన్‌ ఆదివారం క్రెడాయ్‌, నరెడ్కో ప్రతినిధులు, గృహ కొనుగోలుదారుల సంఘాలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
 
నిర్మాణ రంగ సమస్యలు, పరిశ్రమ పటిష్ఠతకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, ఆర్థిక వ్యవహారాలు, రెవెన్యూ, హౌసింగ్‌, సీబీడీటీ, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖలు, రెరా విభాగం అధికారులు పాల్గొన్నారు. 

నిధుల కొరత, అమ్మకాల తగ్గుదలే తమ రంగం మూలనపడడానికి కారణమని క్రెడాయ్‌, నరెడ్కో ప్రతినిధులు ఆ సమావేశాల్లో తెలిపారు. తమ ప్రాజెక్టులకు నిధులందించేలా బ్యాంకులు, ఎన్‌బీఎ్‌ఫసీలను ప్రోత్సహించాలని వారు కోరారు. వచ్చే పండుగల సీజన్‌లో సాధారణంగా డిమాండ్ అధికమని, కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పరిస్థితి దారుణంగా ఉండవచ్చునని కూడా వారన్నారు.
 
రియల్టీ రంగాన్ని కుదిపేస్తున్న పలు అంశాలకు పరిష్కారాలు అన్వేషిస్తామని కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి తెలిపారు. ప్రాజెక్టులు నిలిచిపోవడం వల్ల గృహ కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కూడా తాము చర్యలు తీసుకుంటామని సమావేశం తర్వాత హర్దీప్ సింగ్ పూరీ మీడియాకు చెప్పారు.గృహ కొనుగోలుదారులు చాలా మంది ఇప్పటికే సుప్రీంకోర్డ్టుకు వెళ్లారని, దానిపై కోర్టు తీర్పులు కూడా ఉన్నాయన్నారు. 

అయితే ఈ సమస్యలు పరిష్కరించడం కొంత క్లిష్టమైన అంశమేనని ద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంగీకరించారు. గృహ వినియోగదారులు, పరిశ్రమలో ప్రభుత్వానికి గల మంచి పేరును ఉపయోగించుకు ని తాము ఆ సమస్య పరిష్కరించగలమన్న నమ్మకం ఆయన ప్రకటించారు. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే యోచన ఉన్నదా అన్న ప్రశ్నకు ప్రభుత్వం వివిధ పరిష్కారాలపై దృష్టి సారిస్తుందని హర్‌దీప్‌ సింగ్‌ పురి చెప్పారు.
 
ఆర్థిక వ్యవస్థలో నిధుల కొరతకు కారణమవుతున్న సంక్లిష్టతలు తొలగించి ఉత్పాదక రంగాలకు తగిన నిధులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తగు చర్యలు ప్రకటించే ప్రయత్నం చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పలు రంగాల ప్రతినిధులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధుల, బ్యాంకర్లు, విదేశీ, దేశీయ ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశాల్లో అందిన సలహాలు, సూచనల ఆధారంగానే ప్రభుత్వం ఈ కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 
ఈ చర్యలన్నింటి ప్రధాన లక్ష్యం దేశంలో వృద్ధిరేటును పునరుజ్జీవింపచేయడమేనని ప్రభుత్వ వర్గాలన్నాయి. అయితే స్థూలంగా లిక్విడిటీని పరిష్కరించే ప్రయత్నంలో జీఎస్‌టీ రేట్ల తగ్గింపు జోలికి పోకపోవచ్చునంటున్నారు. దేశంలో పన్నులు ఇప్పటికే కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. 

కొద్ది కాలంగా బ్యాంకింగ్‌, ఎంఎస్ఎంఈ, ఆటోమొబైల్‌ వంటి కీలక రంగాల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమైన విషయం విదితమే. అన్ని రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనే దృష్టి సారించాలని ప్రభుత్వం భావిస్తున్నదంటున్నారు.

ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి 7 శాతం వృద్ధిరేటు లక్ష్యంగా ప్రకటించింది. తొలి త్రైమాసిక గణాంకాలు ఆ లక్ష్యాన్ని సాకారం చేసేవిగా ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల సంవత్సరమైనా దేశంలో జీఎ్‌సటీ వసూళ్లు తొలి త్రైమాసికంలో 9 శాతం పెరగడం, ప్రత్యక్ష పన్ను వసూళ్లు 12.9 శాతం పెరగడం, కార్పొరేట్‌ పన్ను వసూళ్లు కూడా 13.3 శాతం వద్ద నిలకడగా ఉండడం సానుకూలతలని ప్రభుత్వం భావిస్తోంది. 

పారిశ్రామిక కార్యకలాపాలు మందగించినా కూడా తొలి త్రైమాసికంలో జీఎస్టీ వసూళ్లు సగటున రూ.లక్ష కోట్ల వరకు ఉన్నాయి. జీఎస్టీ వసూళ్లు సంతృప్తికరంగానే ఉన్నాయని రాబోయే ఆరు నెలల్లో మరింత పెరగవచ్చునని భావిస్తోంది. పన్ను విధానాలను సరళతరం చేసి, అందరి అంచనాలకు అందుబాటులో ఉండే విధంగా నిలిపితే పన్ను చెల్లింపులకు కట్టుబడే వారి సంఖ్య మరింతగా పెరుగుతుందని భావిస్తోంది.