Mibot: ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు జపాన్ కంపెనీ సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. మిబోట్ అనే పిలిచే ఈ బుల్లి కారు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?

రోడ్లపై ట్రాఫిక్ జామ్, ఇరుకు రోడ్లు.. ఇవి నగరాల్లో సర్వసాధారణం కదా.. ముఖ్యంగా ఇండియాలో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉంటుంది. స్కూల్స్, ఆఫీస్ టైమింగ్ లో అయితే చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఈజీగా డ్రైవ్ చేసుకుంటే వెళ్లగలిగే కారును తయారు చేస్తోంది ఓ జపాన్ కంపెనీ. ఆ బుల్లి కారు ప్రత్యేకతలు తెలుసుకుందాం రండి.  

ఈ బుల్లి కారు పేరు మిబోట్

జపాన్ కు చెందిన కేజీ మోటార్స్ అనే కంపెనీ కొత్త చిన్న ఎలక్ట్రిక్ కారును ఇటీవల ప్రదర్శించింది. ఇది సింగిల్ సీటర్ కారు. దీని పేరు మిబోట్. అంటే మొబిలిటీ రోబోట్ అని అర్థం.

మిబోట్ లో ఒకే ఒక సీటు ఉంటుంది

కేజీ మోటార్స్ జపాన్‌లోని హిరోషిమా దగ్గర ఉన్న స్టార్టప్ కంపెనీ. ఈ కంపెనీ మిబోట్ అనే ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసింది. ఇది సాధారణ కారులా కనిపించదు. అలా అని లగ్జరీ SUV లా కూడా ఉండదు. ఇది ఫ్యూచరిస్టిక్ గోల్ఫ్ కార్ట్ లా కనిపిస్తుంది. దీనికి ఒకే సీటు ఉంటుంది.

మిబోట్ ధర రూ.5.98 లక్షలు

దీని ధర కేవలం 7,000 డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు 5.98 లక్షల రూపాయలన్న మాట. దీని ఎత్తు 1,500 మిల్లీమీటర్ల కంటే తక్కువ. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఈ బుల్లి కారు పూర్తిగా ఛార్జ్ కావడానికి ఐదు గంటలు పడుతుంది. 

3,300 యూనిట్లు తయారు చేయడం లక్ష్యం

కేజీ మోటార్స్ 2025 అక్టోబర్ నుంచి ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 3,300 యూనిట్లు తయారు చేయాలని ప్లాన్ చేశారు. ప్రొడక్షన్ స్టార్ట్ కాకముందే వీటిలో సగం కంటే ఎక్కువ బుక్ అయ్యాయని కంపెనీ తెలిపింది. 2027 మార్చి నాటికి అన్ని వాహనాలను డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది. అంతా సజావుగా సాగితే జపాన్ EV మార్కెట్లో టయోటా లాంటి దిగ్గజ కంపెనీలను కేజీ మోటార్స్ అధిగమించే అవకాశం కూడా ఉంటుంది.

జపాన్‌లోని ఇరుకు రోడ్లపై పెద్ద వాహనాలు నడుస్తున్న దృశ్యాలను చూసిన తర్వాత ఈ ఆలోచన వచ్చిందని కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో కుసునోకి చెప్పారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో చిన్న, కాంపాక్ట్ వాహనాలు మంచి పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు.