బిగ్ టెక్ కంపెనీలు గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), మైక్రోసాఫ్ట్, యాపిల్, ట్విటర్, అమెజాన్ లాంటి సంస్థలు, భారతీయ వార్తాపత్రికలు, డిజిటల్ న్యూస్ పబ్లిషర్‌ల కంటెంట్  ఉపయోగించి పెద్ద ఎత్తున ఆదాయాన్ని పొందుతున్నాయి. దీనిపై పలు వార్త సంస్థలు తమకు సదరు బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆదాయంలో వాటా కావాలని చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే కంటెంట్ పబ్లిషర్ల డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది.  

డిజిటల్ న్యూస్ కంటెంట్ పబ్లిషర్లకు బిగ్ టెక్ కంపెనీలు తమ ఆదాయంలో వాటాను వారికి చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం చూస్తోందని, ఇప్పటికే ఆస్ట్రేలియాలో, యూరోపియన్ యూనియన్‌లో ఈ తరహా వైఖరిని అనుసరిస్తున్నారని, రెగ్యులేటరీ జోక్యం ద్వారా ఈ చర్య తీసుకుంటామని, ఇది ప్రస్తుత ఐటీ చట్టాల సవరణల్లో భాగంగా జరగవచ్చని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.

"భారతీయ మీడియా కంపెనీలపై, బిగ్ టెక్ మేజర్‌ కంపెనీలు ప్రస్తుతం అమలు చేస్తున్న డిజిటల్ ప్రకటనల విధానం, చట్టబద్ధత, రూపొందించాల్సిన నియమాలను కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తోందని రాజీవ్ చంద్రశేఖర్ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తా సంస్థకు తెలిపారు.

గ్లోబల్ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు దేశంలో జరిగిన ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్‌ల వేగవంతమైన వ్యాప్తి ద్వారా విపరీతంగా లాభపడ్డాయి. ప్రకటనల ఆదాయాలతో పాటు వ్యూయర్స్ సంఖ్యను పొందగలిగాయి. అయితే ఈ కంటెంట్ సృష్టిస్తున్న వార్తాపత్రికలు, డిజిటల్ వార్తా ప్రచురణకర్తలు తమ కంటెంట్ ద్వారా బిగ్ టెక్ కంపెనీలకు చాలా లాభం కలిగించాయి. అయితే బిగ్ టెక్ కంపెనీలు మాత్రం వారికి న్యాయ బద్ధంగా చెల్లించాల్సిన వాటాను ఇవ్వడం లేదని మంత్రి అభిప్రాయపడ్డారు.

సోషల్ మీడియా, టెక్ ప్లాట్‌ఫారమ్‌ల పెరుగుదల ఫలితంగా కొన్ని బిగ్ టెక్ కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని, అసలైన కంటెంట్ సృష్టికర్తలు మాత్రం పెద్దగా లాభపడలేదని, అయితే ఈ విషయంలో వార్తా సంస్థలకు మేలు చేకూర్చేలా చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇది మాకు ముఖ్యమైన అంశం” అని చంద్రశేఖర్ అన్నారు.

ఇప్పటికే ఈ విషయాన్ని డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA), ఇండియన్ న్యూస్‌పేపర్ సొసైటీ (INS) లేవనెత్తాయి, వారు గూగుల్‌కు వ్యతిరేకంగా ఫెయిర్‌ప్లే వాచ్‌డాగ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI)ని ఆశ్రయించారు. వార్తా ప్రచురణకర్తలపై అన్యాయమైన షరతులను విధిస్తోందని ఇందులో పేర్కొన్నారు. 

ఆరోపణలపై CCI గూగుల్‌పై విచారణకు ఆదేశించింది, INS కూడా తన ఫిర్యాదులో “డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉన్న వార్తల నిర్మాత/పబ్లిషర్‌కు వారి కంటెంట్‌కు తగిన మూల్యం చెల్లించడం లేదనే వాస్తవాన్ని హైలైట్ చేసింది. 

భారతీయ వార్తాపత్రిక , డిజిటల్ పబ్లిషింగ్ బాడీలు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ , స్పెయిన్‌తో సహా అనేక దేశాల తరహాలోనే తమ కంటెంట్ కు తగిన పరిహారం Googleతో సహా టెక్ కంపెనీలు చెల్లించేలా అవసరమయ్యే చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.