న్యూఢిల్లీ: ఆర్బీఐ నూతన గవర్నర్‌గా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ను నియమిస్తూ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో దాస్‌ను నియమిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. శక్తికాంత దాస్ మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు.

ఉర్జిత్‌ పటేల్ రాజీనామా తర్వాత ముందుగా ఎవరినైనా తాత్కాలిక గవర్నర్‌గా నియమిస్తూ ప్రభుత్వం గవర్నరుగా నియమిస్తుందేమోనని అందరూ భావించారు. కాని అలా కాకుండా కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే శక్తికాంత్‌ దాస్‌ను ఎంపిక చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నియామకాల మంత్రివర్గ కమిటీ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ఉర్జిత్‌ రాజీనామాకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ట్వీట్‌ చేశారు.

1980 బ్యాచ్‌ తమిళనాడు కేడర్‌ ఐఏఎస్‌ అధికారి శక్తికాంత్‌ దాస్‌. ఆయన ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్‌ కాలేజీలో హిస్టరీలో డిగ్రీ పట్టా అందుకున్నారు. హిస్టరీలో డిగ్రీ చేసినా తన 37 ఏళ్ల సుదీర్ఘ ఉద్యోగ జీవితంలో ఆర్థిక శాఖ విభాగాల్లోనే ఎక్కువ కాలం పనిచేయడం గమనార్హం. 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెవెన్యూ విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. 

ఆ తర్వాత ఆర్‌బీఐ సంబంధ విషయాలు, పరపతి విధాన వ్యవహారాలు చూసుకునే ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అయ్యారు. గతేడాది మేలో పదవీ విరమణ చేశారు. గతేడాది పదవీ విరమణ చేసిన తర్వాత 15వ ఆర్థిక సంఘం సభ్యుడిగా శక్తికాంత దాస్‌ను ప్రభుత్వం నియమించింది. జీ-20 దేశాల సదస్సులో భారత్‌ తరపు ప్రతినిధిగా కూడా ఎంపిక చేసింది. ఇప్పుడు ఆర్బీఐ 25వ గవర్నర్‌గా బాధ్యతలు అప్పగించింది. అలా నార్త్‌ బ్లాక్‌ నుంచి మొదలైన శక్తికాంత దాస్ ప్రయాణం ఇప్పుడు మింట్‌ స్ట్రీట్‌ వరకు కొనసాగింది.

శక్తికాంత దాస్‌కు ముగ్గురు ఆర్థిక మంత్రులతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది. ప్రణబ్‌ ముఖర్జీ, చిదంబరం, అరుణ్‌ జైట్లీ హయాంలో ఆయన వివిధ బాధ్యతలు నిర్వహించారు. ప్రణబ్‌, చిదంబరం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ల్లోనూ సంయుక్త కార్యదర్శిగా, అదనపు కార్యదర్శిగా ఆయన తన వంత పాత్ర పోషించారు. కీలక సమస్యల పరిష్కార సమయంలో అందర్నీ ఏకతాటిపైకి తెచ్చి పరిష్కరించే సామర్థ్యమున్న అధికారిగా శక్తికాంత్‌ దాస్‌కు పేరుంది.

2016 నవంబర్ నెల ఎనిమిదో తేదీన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంలోనూ, జీఎస్టీ అమల్లోనూ శక్తికాంత్‌ దాస్‌ భాగస్వామ్యం ఉంది. మరోవైపు గత ఐదేళ్లలో ఆర్బీఐ గవర్నర్‌గా ఒక ఐఏఎస్‌ అధికారి నియమితులవ్వడం ఇదే తొలిసారి. చివరి సారి ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి దువ్వూరి సుబ్బారావు. 2013 సెప్టెంబర్ నెలలో ఆయన పదవీకాలం ముగిసింది.

ఈ నెల 14న (శుక్రవారం) జరగనున్న ఆర్బీఐ బోర్డు సమావేశంలో ఎటువంటి మార్పులు లేవని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ తెలిపారు. ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మిక రాజీనామాతో శుక్రవారం జరగాల్సిన ఆర్‌బీఐ సమావేశంపై అనిశ్చితి తలెత్తింది. ఈ నేపథ్యంలో గార్గ్‌ స్పష్టతనిచ్చారు. ఆర్బీఐలో పరిపాలనా సంస్కరణల సహా వివిధ అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.