న్యూఢిల్లీ: ఆర్ధిక మాంద్యం నేపథ్యంలో కేంద్రం తీసుకోన్న నిర్ణయం  మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో మార్కెట్లలో జోష్ నిండింది.  కార్పోరేట్ ట్యాక్స్ ను 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్  ప్రకటించారు. ఈ ప్రకటన మార్కెట్ వర్గాల్లో ఆశలను నింపింది.

కార్పోరేట్ కంపెనీల పన్నును 34.94 శాతం నుండి 25.17 శాతానికి తగ్గించారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో నుండే ఈ నిబంధనను అమల్లోకి తీసుకువస్తారు. ప్రస్తుతం కార్పోరేట్ ట్యాక్స్ సుమారు 30 శాతంగా ఉంది. ఇక నుండి దాన్ని 22 శాతంగా నే ఉండనుంది.

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటన తర్వాత షేర్ మార్కెట్లు దూసుకుపోయాయి.  సెన్సెక్స్ 000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 300 పాయింట్లు లాభపడ్డాయి. ఇదిలా ఉంటే ఉత్పత్తిరంగంలో పెట్టుబడులు పెట్టే కొత్త సంస్థలకు 17.01 శాతం, మధ్య తరహా పరిశ్రమలకు 15శాతం పన్ను విధించారు. ఉత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ఆహ్వానించడమే తమ లక్ష్యమని నిర్మల అన్నారు.

ఆర్ధిక మాంద్యం కారణంగా ప్రపంచంలో ఆర్ధిక రంగం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. దీని ప్రభావం దేశంలో కూడ ఉంది. ఆటోమొబైల్ తో పాటు ఉత్పత్తి రంగంలో గణనీయంగా ఆర్ధిక మాంద్యం ప్రభావం కన్పిస్తోంది.దరిమిలా కేంద్రం  ఈ నిర్ణయం తీసుకొందని ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శుక్రవారం నాడు ఉదయం నుండే బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 113 పాయింట్లు పుంజుకొని 36,207 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 10,724 వద్ద ట్రేడవుతోంది.