ముంబై: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా వస్తువులపై సుంకాన్ని 10 శాతం నుంచి 25 శాతానికి పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ ట్వీట్‌ చేయడంతో మదుపర్లను కలవరపెట్టింది. వాణిజ్య యుద్ధ భయాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. 

బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.1.24 లక్షల కోట్లు ఆవిరై రూ.150.37 లక్షల కోట్లకు చేరింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్ ‘నిఫ్టీ’  11,600 పాయింట్ల దిగువకు చేరింది. అయిదో విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ మదుపర అప్రమత్తతకు తోడైంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 18 పైసలు తగ్గి 69.40కు చేరింది. 

సెన్సెక్స్‌ ఉదయం దాదాపు 250 పాయింట్ల నష్టంతో 38,719.33 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లోనే కదలాడిన సూచీ.. ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. అంతర్గత ట్రేడింగ్‌లో 453 పాయింట్లు నష్టపోయి, 38,509.79 పాయింట్ల వద్ద కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్‌.. చివరకు 363.92 పాయింట్ల నష్టంతో 38,600.34 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ సైతం 114 పాయింట్లు కోల్పోయి 11598.25 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 11,571.35- 11,632.55 పాయింట్ల మధ్య కదలాడింది. 

ఇక్రా రేటింగ్‌ తగ్గించడంతో విల్లవిలాడిన ‘యెస్‌’ బ్యాంక్‌ షేర్ ఇంట్రాడేలో 5.75 శాతం పడిపోయి చివరకు 5.30 శాతం నష్టంతో రూ.166.30 వద్ద ముగిసింది. బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ.2,135.29 కోట్లు తగ్గి రూ.38,515.71 కోట్లకు చేరింది. 

ఆకర్షణీయమైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించడంతో టాటా కెమికల్స్‌ షేర్ పరుగులు తీసింది. ఇంట్రాడేలో 9.39 శాతం పెరిగిన షేర్.. రూ.609.90 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 8.59 శాతం లాభంతో రూ.605.40 దగ్గర స్థిరపడింది. 

సెన్సెక్స్‌ 30 షేర్లలో 25 నష్టాలు చవిచూశాయి. టాటా మోటార్స్‌ 4.49%, బజాజ్‌ ఫైనాన్స్‌ 2.33%, టాటా స్టీల్‌ 2.20%, హెచ్‌డీఎఫ్‌సీ 2.13%, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 2.03%, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1.71%, ఏషియన్‌ పెయింట్స్‌ 1.59%, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 1.58%, హీరో మోటోకార్ప్‌ 1.54%, యాక్సిస్‌ బ్యాంక్‌ 1.30%, ఎం అండ్‌ ఎం 1.23% చొప్పున డీలాపడ్డాయి. 

ఐటీసీ 1.12%, టీసీఎస్‌ 1.04%, భారతీ ఎయిర్‌టెల్‌ 0.69% రాణించిన వాటిలో ఉన్నాయి. రంగాల వారీ సూచీల్లో మన్నికైన వినిమయ వస్తువులు, లోహ, స్థిరాస్తి, యంత్ర పరికరాలు, వాహన 2.82 శాతం వరకు నష్టపోయాయి. బీఎస్‌ఈలో 1634 స్క్రిప్‌లు ప్రతికూలంగా, 831 షేర్లు సానుకూలంగాను ముగిశాయి.

200 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్లు కూడా కుప్ప కూలాయి. షాంఘై కాంపోజిట్‌ 5.58 శాతం, స్ట్రైట్స్‌ టైమ్స్‌ 3 శాతం, హాంగ్‌సెంగ్‌ 2.90 శాతం, తైవాన్‌ 1.80 శాతం,  జకర్తా కాంపోజిట్‌ 1 శాతం చొప్పున క్షీణించాయి. జపాన్‌ నిక్కీ, కొరియా కోస్పి పనిచేయలేదు. ఇక ఐరోపా మార్కెట్లు ప్రతికూల ధోరణిలోనే కదలాడాయి. ఫ్రాన్స్‌ సీఏసీ, జర్మనీ డాక్స్‌ సూచీలు 2 శాతం వరకు పడ్డాయి.