Asianet News TeluguAsianet News Telugu

గంటలో రూ.6.8 లక్షల కోట్ల మదుపు.. టీసీఎస్‌ను దాటేసిన రిలయన్స్

లాభాల జడివానలో తడిసి ముద్దయిన మదుపర్లు...తత్ఫలితంగా మదుపరులు లాభాల జడివానలో తడిసి ముద్దయ్యారు. స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో దూసుకుపోవడంతో శుక్రవారం మదుపరుల సంపద ఏకంగా రూ.7 లక్షల కోట్ల వరకు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.6,82,938 కోట్లు పెరిగి రూ.1,45,37,378.01 కోట్లకు చేరుకున్నది. 

sensex soars 1,900 points after PM Modi's surgical strike on brears : 10 updates
Author
Hyderabad, First Published Sep 21, 2019, 11:32 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దలాల్ స్ట్రీట్ కొనుగోళ్ళతో కళకళలాడింది. దీపావళి కంటే ముందుగానే స్టాక్ మార్కెట్లలో లక్ష్మీ కాంతులు వెల్ల్లివిరిశాయి. కార్పొరేట్ ట్యాక్స్‌ను పది శాతం వరకు తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన మార్కెట్లలో ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. సానుకూలంగా ప్రారంభమైన మార్కెట్లు నిర్మలమ్మ ప్రకటనతో ఒక్కసారిగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయాయి. 

లాభాల జడివానలో తడిసి ముద్దయిన మదుపర్లు
తత్ఫలితంగా మదుపరులు లాభాల జడివానలో తడిసి ముద్దయ్యారు. స్టాక్ మార్కెట్ల భారీ లాభాలతో దూసుకుపోవడంతో శుక్రవారం మదుపరుల సంపద ఏకంగా రూ.7 లక్షల కోట్ల వరకు పెరిగింది. బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.6,82,938 కోట్లు పెరిగి రూ.1,45,37,378.01 కోట్లకు చేరుకున్నది. 

మందకోడి మార్కెట్‌కు ‘కార్పొరేట్’ జోష్
మందకొడిగా కొనసాగుతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మార్కెట్లలో జోష్ పెంచిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. 30 షేర్ల ఇండెక్స్‌లో 25 స్టాకులు లాభాల బాట పట్టాయి. 1,864 షేర్లు లాభాల్లో ముగియగా, 728 షేర్లు నష్టాలను నమోదు చేసుకున్నాయి. కానీ, 144 షేర్లు యథాతథంగా నమోదయ్యాయి.

టీసీఎస్‌ను దాటేసిన ఆర్‌ఐఎల్
మార్కెట్ క్యాపిటలైజేషన్ టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీల మధ్య దోబుచులాడుతున్నది. శుక్రవారం రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు అత్యధికంగా లాభపడటంతో మార్కెట్ క్యాప్‌లో టీసీఎస్‌ను అధిగమించింది. రూ.7,95,179.62 కోట్లతో ఆర్‌ఐఎల్ తొలి స్థానానికి ఎగబాకింది. ఇదే సమయంలో టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.7,75,092.58 కోట్లుగా నమోదైంది. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.20,087.04 కోట్లు. ఆర్‌ఐఎల్ షేర్ విలువ 6.42 శాతం పెరిగి రూ.1,254.40కి చేరుకోగా, టీసీఎస్ షేర్ 1.74 శాతం పడిపోయింది.

1921 పాయింట్లతో ముగిసిన సెన్సెక్స్
శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంట్రాడేలో 2,200 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్ చివరకు 1,921 పాయింట్ల లాభంతో ముగిసింది. గడిచిన పదేండ్లలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో లాభపడటం ఇదే తొలిసారి. దీంతో మదుపరుల సంపద రూ.6.8 లక్షల కోట్లకు పైగా పెరిగింది. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి ఇప్పటికే నాలుగుసార్లు ఉద్దీపన పథకాలు ప్రకటించిన కేంద్రం..ఈసారి ఏకంగా కార్పొరేట్ సంస్థలకు ఊరటనివ్వడానికి పన్నులో కోత విధించింది. 

మదుపర్లలో ఉత్సాహాన్ని నింపిన విత్తమంత్రి ప్రకటన 
ప్రతియేటా లక్ష కోట్లకు పైగా ఆదాయం కోల్పోతున్నా, ఆర్థిక వృద్ధికి నిరంతరంగా కృషి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి ఇచ్చిన సంకేతాలు మదుపరుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఒక దశలో రెండు వేలకు పైగా లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్ వారాంతం ట్రేడింగ్ ముగిసే సరికి 1,921.15 పాయింట్లు లేదా 5.32 శాతం లాభంతో 38,014.62 వద్ద ముగిసింది. 

11 వేల మార్కును దాటిన నిఫ్టీ
జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ మళ్లీ 11 వేల మార్క్‌ను దాటింది. 569.40 పాయింట్ల(5.32 శాతం) లాభంతో 11,274.20 వద్ద స్థిరపడింది. ఏ రంగం చూసిన కొనుగోళ్ళతో కళకళలాడింది. ముఖ్యంగా ఆటోమొబైల్ రంగ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ఎగబడ్డారు. హీరో మోటోకార్ప్, మారుతీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎల్ అండ్ టీల షేర్లు 12.52 శాతానికి ఎగబాకాయి. 

కానీ.. ఐటీ షేర్లకు నష్టం
పవర్‌గ్రిడ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా షేర్లు మాత్రం రెండు శాతానికి పైగా నష్టపోయాయి. కార్పొరేట్ కంపెనీలకు ఊతమిచ్చే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయం మార్కెట్లలో జోష్ పెంచిందని జియోజిట్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రంగాల వారీగా చూస్తే ఆటో, బ్యాంకెక్స్, క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ డ్యూరబుల్, ఫైనాన్స్, ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, టెలికం రంగ షేర్లు మదుపరులు ఆకట్టుకున్నాయి. కానీ, ఐటీ షేర్లు కుదుపునకు గురయ్యాయి. ఈ వారం మొత్తానికి సెన్సెక్స్ 629.63 పాయింట్లు, నిఫ్టీ 198.30 పాయింట్లు ఎగబాకింది.

Follow Us:
Download App:
  • android
  • ios