ముంబై: ఫారెక్స్ మార్కెట్‌లో అమెరికా డాలర్‌పై రూపాయి విలువ గురువారం తిరిగి రూ.73.55లకు పతనం కావడం, అక్టోబర్ డెరివేటివ్స్ నేటితో ముగియడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు పతనం అయ్యాయి. బ్లూ చిప్ కంపెనీలు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర స్టాక్స్ భారీగా నష్టపోయాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) ఇండెక్స్ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) ఇండెక్స్ కూడా భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 450కి పైగా పాయింట్లు నష్టపోయి 34 వేల పాయింట్లకు దిగువన ట్రేడవుతోంది. మరోవైపు నిఫ్టీ - 50 ఇండెక్స్ 10,150 మార్క్ వద్ద కదలాడుతోంది. 

బ్యాంకింగ్ సూచీతోపాటు మెటల్, క్యాపిటల్ గూడ్స్ సహా అన్ని సెక్టోరల్ ఇండెక్స్‌లు కూడా నెగిటివ్‌గానే సాగాయి. గురువారం మధ్యాహ్నం 12.25 గంటలకు సెన్సెక్స్ అంతర్గత ట్రేడింగ్‌లో 33,553 పాయింట్లను తాకింది. 30- షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 346.33 పాయింట్లు కోల్పోయి 33,687 పాయింట్ల వద్ద కదలాడింది. మరోవైపు నిఫ్టీ 104.20 పాయింట్లు నష్టపోయి 10,120.55 పాయింట్ల వద్ద తచ్చాడుతోంది. 

అక్టోబర్ నెల డెరివేటివ్స్ సెగ్మెంట్ ముగింపు కావడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందించారు. మరోవైపు దిగుమతి దారుల నుంచి డాలర్ల కోసం డిమాండ్ పెరుగడంతో రూపాయి మారకం విలువ బక్క చిక్కింది. మధ్యాహ్నం వరకు రూపాయి విలువ 19 పైసలు నష్టపోయింది. బీఎస్ఈ - 30 ఇండెక్స్ సెన్సెక్స్‌లో 21 స్టాక్స్ నష్టాల బాటలోనే పయనించాయి. వాటిలో వేదాంత, ఆదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్ తదితర సంస్థలు 2.6 నుంచి నాలుగు శాతం వరకు నష్టపోయాయి. 

మరోవైపు 50 -స్క్రిప్‌ల నిఫ్టీలో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వేదాంత, హిందాల్కో, ఆదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్ టెల్ స్టాక్స్ 3.6 నుంచి 5.1 శాతం నష్టపోయాయి. అంతర్జాతీయంగా ఆసియా షేర్లు కూడా బిలియన్ల డాలర్లను కోల్పోయాయి. క్రూడాయిల్ ధరలు తగ్గిపోవడంతోపాటు అంతర్జాతీయ వ్రుద్ధిపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 69 సెంట్లు పడిపోయి బ్యారెల్ ముడి చమురు ధర 75.48 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. మరోవైపు అమెరికా క్రూడాయిల్ ధర 54 సెంట్లు తగ్గి 66.28 డాలర్ల వద్ద నిలిచింది. వరుసగా నాలుగు రోజులు పతనం బాటలో పయనించిన స్టాక్స్ బుధవారం లాభాలు గడించాయి.