ఇరాన్- అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాల మధ్య చమురు మంటలకు దారి తీస్తున్నాయి. ఆరామ్ కో సంస్థ చమురు భావులపై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో వరుసగా రెండు రోజులు స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. రెండు రోజుల్లో రూ.2.72 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.
ముంబై: స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో భగ్గుమన్న చమురు ధరలతో రెండోరోజు భారీ పతనాన్ని మూటగట్టుకున్నది. సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాలపై మరోసారి దాడులు చేస్తామని హౌతీ ఉగ్రవాదులు హెచ్చరికల చేయడంతో మదుపరుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. మరోమారు చమురు ధరల భగ్గుమనే అవకాశం ఉన్నదన్న అంచనాతో ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలకు మొగ్గుచూపారు.
వరుసగా రెండు రోజుల్లో మదుపరులు రూ.2.72 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. మధ్యప్రాచ్యంలో నెలకొన్ని రాజకీయ అనిశ్చిత పరిస్థితికి తోడు దేశ జీడీపీ ఆరేండ్ల కనిష్ఠానికి పడిపోవడం, క్రూడాయిల్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదన్న అంశాలు మార్కెట్ల పతనాన్ని శాసించాయని రెలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.
దీంతో స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల విలువ రూ. 2,72,593.54 కోట్లు తగ్గి రూ. 1,39,70,356.22 కోట్లకు జారుకున్నది. సౌదీ అరేబియాలోని ఆరాంకో చమురు క్షేత్రాలపై యెమెన్ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడులు చేయడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు నాలుగు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
అమెరికాలో కూడా ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. ఈ పరిణామాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. చమురు ధరలు పెరుగడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్ల నుంచి భారీగా నిధులను ఉపసంహరించుకోవడం కూడా పతనానికి ఆజ్యంపోశాయి. భారత వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం కూడా మార్కెట్ల పతనానికి కారణం అని విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్ని రంగాల షేర్లు దిగువముఖం పట్టాయి. ఆటో, రియల్టీ, మెటల్, బ్యాంకెక్స్, ఫైనాన్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇంధనం, టెక్, ఐటీ రంగ షేర్లను కొనుగోలు చేయడానికి మదుపరులు ముందుకురాలేదు. దీంతో ఈ రంగాల షేర్లు నాలుగు శాతం వరకు నష్టపోయాయి. మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ ఈ విభాగానికి చెందిన షేర్లన్నీ పతనం బాట పట్టాయి.
చమురు ధరలు భగ్గుమంటే కరెంట్ ఖాతా, ద్రవ్యలోటు మరింత పెరిగే ప్రమాదం ఉన్నదన్న రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ వ్యాఖ్యలు కూడా మదుపరుల్లో ఆందోళనను పెంచింది. దేశీయంగా వినియోగిస్తున్న చమురులో 80 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర స్థాయిలోప్రభావం చూపనున్నదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
దిగజారుతున్న వృద్ధిరేటును ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్ల పతనాన్ని ఆపలేకపోయాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.808.29 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. బీఎస్‌ఈలో 1,696 స్టాకులు నష్టపోగా, 829 లాభపడ్డాయి.
ఇప్పటికే ఆర్థిక మాంద్యం దెబ్బకు ఢీలా పడుతున్న ఆర్థిక వ్యవస్థపై ఈ చమురు రూపంలో మరో పిడుగు పడే అవకాశం ఉండటం మార్కెట్లను అతలాకుతలం చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన బలహీన సంకేతాలు కూడా పతనాన్ని శాసించాయి. మంగళవారం ఒక దశలో 700 పాయింట్లకు పైగా నష్టపోయిన బీఎస్‌ఈ బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 642.22 పాయింట్లు లేదా 1.73 శాతం నష్టపోయి 36,481.09 వద్ద ముగిసింది.
జాతీయ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 185.90 పాయింట్లు(1.69 శాతం) నష్టపోయి 10,817.60 వద్ద స్థిరపడింది. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 262 పాయింట్లు, నిఫ్టీ 90 పాయింట్ల నష్టపోయిన విషయం తెలిసిందే. హీరో మోటోకార్ప్, టాటా మోటర్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతి, ఎస్బీఐలు 6.19 శాతం వరకు నష్టపోయాయి. 30 షేర్ల ఇండెక్స్‌లో కేవలం మూడంటే మూడు హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్‌లు లాభపడ్డాయి.
