స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 28) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపిస్తోంది.
స్టాక్ మార్కెట్లు నేడు (ఫిబ్రవరి 28) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. రష్యా - ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్ పైన కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభంలో మార్కెట్లు కుప్పకూలాయి. అయితే అమెరికా కఠిన ఆంక్షల నేపథ్యంలో రష్యా దూకుడుకు కళ్లెం పడుతుందనే ఉద్దేశ్యంతో గతవారం చివరలో మార్కెట్ భారీ నష్టాల నుండి తప్పించుకుంది. అయితే రష్యాను స్విఫ్ట్ నుండి తప్పించిన వార్తల నేపథ్యంలో మార్కెట్లు ఈ వారం భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి.
సెన్సెక్స్ నేడు ఉదయం గం.11.00 సమయానికి 364.47 (0.65%) పాయింట్లు నష్టపోయి 55,532.30 పాయింట్ల వద్ద, నిఫ్టీ 211.10 (1.27%) పాయింట్లు క్షీణించి 16,589 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ 55,329.46 పాయింట్ల వద్ద ప్రారంభమై, 55,536.12 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 54,833.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. కానీ ఆ తర్వాత నష్టాలు తగ్గాయి. ఓ సమయంలో 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ గం.11.05 సమయానికి 275 పాయింట్ల నష్టాల్లోకి తగ్గింది. నిఫ్టీ కూడా ఉదయం 300 పాయింట్లు పతనమైనప్పటికీ, ఈ వార్త రాసే సమయానికి 68 పాయింట్ల నష్టాల్లోకి వచ్చింది.
వివిధ రంగాల విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగం భారీగా నష్టపోయింది. మెటల్ రంగం లాభాల్లో ఉంది. అమెరికా డాలర్ మారకంతో రూపాయి 40 పైసలు క్షీణించి 75.73 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చమురు ధరలు భారీగా పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 6.27 శాతం ఎగిసి 97.33 డాలర్లు, బ్రెంట్ క్రూడ్ 5.24 శాతం ఎగిసి 103.06 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.
