Asianet News TeluguAsianet News Telugu

పట్టు బిగించిన బుల్స్ 63000 పాయింట్లను క్రాస్ చేసిన సెన్సెక్స్...మాంద్యం భయాలను అధిగమించిన మార్కెట్లు..

వరుసగా 7 సెషన్లుగా జోరు ప్రదర్శించిన సెన్సెక్స్ ఈరోజు తొలిసారిగా 63,000 మార్క్‌ను దాటింది. మరోవైపు నిఫ్టీ కూడా మరోసారి సరికొత్త రికార్డు స్థాయిని తాకింది. 

Sensex crossed 63000 points by bulls Markets overcame recession fears
Author
First Published Nov 30, 2022, 6:05 PM IST

స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతోంది. గడిచిన ఏడు ట్రేడింగ్ సెషన్లలో స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. ఈరోజు తొలిసారిగా సెన్సెక్స్ కూడా 63,000 పాయింట్ల మార్క్‌ను దాటింది. గత 2 రోజులుగా సెన్సెక్స్, నిఫ్టీలు రికార్డు స్థాయిలో ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోగా, ఈరోజు మళ్లీ అదే జరిగింది. ఉదయం నుంచి స్వల్ప పెరుగుదలతో నడిచిన మార్కెట్ చివరి అరగంటలో ట్రేడింగ్‌లో విపరీతంగా దూసుకెళ్లింది. సెన్సెక్స్ ఈరోజు 417.81 పాయింట్ల జంప్‌తో 63099.65 వద్ద ముగిసింది. నిఫ్టీ 140.30 పాయింట్లు జంప్ చేసి 18758.35 వద్ద ముగిసింది.

ఈరోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్ తన కొత్త రికార్డు స్థాయి 63303ని తాకింది. అదే సమయంలో నిఫ్టీ తొలిసారిగా 18800ను దాటి 18816 స్థాయికి చేరుకుంది. ఈ రోజు మార్కెట్ ప్రారంభం పాజిటీవ్ గా మొదలైంది. ఉదయం సెన్సెక్స్ 61 పాయింట్ల లాభంతో 62,743 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 8 పాయింట్ల లాభంతో 18,626 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. చివరి అరగంట ట్రేడింగ్‌లో మార్కెట్‌లో బుల్స్ పుంజుకొని రికార్డులు సృష్టించాయి.

ఎఫ్‌ఐఐ పెట్టుబడులు పుంజుకోవడంతో స్టాక్ మార్కెట్ కొత్త రికార్డులను తాకుతున్నదని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ప్రపంచ మార్కెట్లలో కూడా కొంత పాజిటీవ్ పరిణామాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. స్వస్తిక్ ఇన్వెస్ట్‌మార్ట్‌కి చెందిన సంతోష్ మీనా మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సందిగ్ధతను పట్టించుకోకుండా దేశీయ ఇండెక్స్ సూచీలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయని అన్నారు. 

మార్కెట్‌కు రోజురోజుకూ కొత్త సెక్టార్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభిస్తోందన్నారు. ఇతర మార్కెట్లతో పోలిస్తే భారతీయ మార్కెట్లు అధిక వాల్యుయేషన్‌తో ట్రేడ్ అవుతున్నాయని, ఈ ట్రెండ్ మరింత కొనసాగుతుందని సంతోష్ మీనా తెలిపారు. బలమైన ఫండమెంటల్స్, కాపిటల్ ఇన్ ఫ్లో కూడా సూచీలకు విపరీతమైన మద్దతు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఇక సెక్టార్ల విషయానికి వస్తే, నిఫ్టీలో మెటల్ (1.81 శాతం) స్టాక్‌లలో భారీగా లాభం కనిపించింది. ఆటో (1.72), రియల్టీ (1.45), ఎఫ్‌ఎంసిజి (1.02), మీడియా (0.76) సహా అన్ని సెక్టార్లలో బయ్యింగ్ బలంగానే ఉంది. మహీంద్రా అండ్ మహీంద్రా (4.05 శాతం), హిందాల్కో (3.19 శాతం), గ్రాసిమ్ (2.55 శాతం), ఎస్‌బిఐ లైఫ్ (2.44 శాతం), అల్ట్రాటెక్ (2.18 శాతం) టాప్ గెయినర్లుగా ఉన్నాయి. ఈ రోజు నిఫ్టీలో కేవలం 4 స్టాక్స్ ఇండస్‌ఇండ్ బ్యాంక్ (-1.07), SBIN (-0.92), HCL టెక్ (-0.62) , ITC (-0.58).మాత్రమే నష్టాల్లో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios