స్టాక్ మార్కెట్ నేడు (మంగళవారం, 22 ఫిబ్రవరి) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన నేపథ్యంలో మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. 

స్టాక్ మార్కెట్ నేడు (మంగళవారం, 22 ఫిబ్రవరి) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించడం, విదేశీ ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపిన నేపథ్యంలో మార్కెట్లు నిన్నటి వరకు వరుసగా నాలుగో రోజు నష్టపోయాయి. అమెరికా-రష్యా అధినేతలు జోబిడెన్, పుతిన్ మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో నిన్న నష్టాలు కొంత తగ్గాయి. కానీ నేడు మాత్రం ప్రారంభంలోనే సూచీలు కుప్పకూలాయి. అన్ని రంగాలు కూడా నష్టాల్లోనే ఉన్నాయి.

క్రితం రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 57,683 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం మార్కెట్‌ ప్రారంభం కావడంతోనే నష్టాలు మొదలయ్యాయి. మొదటి పది నిమిషాల లోపే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 1261 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు నిఫ్టీ సైతం 358 పాయింట్లు నష్టపోయింది. ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడి తీవ్రమైంది. దీంతో నిఫ్టీ 17 వేల దిగువకు చేరుకోగా సెన్సెక్స్‌ 57 వేల కిందకు పడిపోయింది.

ఉదయం 9:20 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 916 పాయింట్ల నష్టంతో 1.59 శాతం క్షీణించి 56,767 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 287 పాయింట్లు నష్టంతో 1.67 శాతం క్షీణించి 16,919 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. స్మాల్‌, మిడ్‌, లార్జ్‌ క్యాప్‌ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఉక్రెయిన్‌ వివాదంపై ఈ రోజు ఐక్యరాజ్య సమితి భద్రత మండలి అత్యవసర సమావేశం నిర్వహిస్తామని ప్రకటించింది. దీంతో మార్కెట్‌ నష్టాలకు కొంతైనా బ్రేక్‌ పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

మార్కెట్ నష్టాలకు ప్రధాన కారణం రష్యా-ఉక్రెయిన్ వివాదం. అక్కడి సరిహద్దుల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ ప్రభావం అంతర్జాతీయ మార్కెట్ పైన పడింది. తదనుగుణంగా దేశీయ మార్కెట్ పైన కనిపించింది. ఉక్రెయిన్‌లోని వేర్పాటువాద ప్రాంతాలను రష్యా స్వతంత్ర ప్రదేశాలుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దీనిని ఉక్రెయిన్, అమెరికా సహా నాటో కూటమిలోని దేశాలు తప్పుబట్టాయి. రష్యాపై ఆంక్షలకు వెనుకాడేది లేదని ఐరోపా హెచ్చరించింది. మరోవైపు రష్యా గుర్తించిన ప్రాంతాలపై అమెరికా ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాలు జాతీయ, అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది.