స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నిన్నటి వరకు ఉద్రిక్తతలు కొనసాగగా, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించారు. దీంతో సూచీలు కుప్పకూలాయి.

స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య నిన్నటి వరకు ఉద్రిక్తతలు కొనసాగగా, తాజాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పైన యుద్ధం ప్రకటించారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లు కూడా నష్టాల్లోనే ఉన్నాయి. ఉక్రెయిన్‌లో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు పుతిన్ తాజాగా ప్రకటించారు. దీంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. యుద్ధ భయాలతో ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా దేశీ స్టాక్‌ మార్కెట్‌ బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు తీవ్రంగా నష్టపోతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీలు 3 శాతానికి పైగా నష్టపోయాయి. వీఐఎక్స్ 24 శాతంగా నమోదైంది.

ఉదయం 10 గంటల 28 నిమిషాల‌ సమయానికి సెన్సెక్స్ 1874 పాయింట్లు నష్టపోయి 55,357 పాయింట్లకు చేరుకుంది. మార్కెట్ ప్రారంభంలోనే 3.24 శాతం క్షీణించింది. మరోవైపు నిఫ్టీ 552 పాయింట్లు నష్టపోయి 16,510 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఇప్పటికే 3.28 శాతం క్షీణించింది. కానీ ఉక్రెయిన్‌ యుద్ధం ఎఫెక్ట్‌తో కేవలం గంట వ్యవధిలోనే ఇటు సెన్సెక్స్‌, అటు నిఫ్టీలు ఏకంగా 3 శాతానికి పైగా క్షీణించాయి. ఇంత భారీ స్థాయిలో మార్కెట్లు పతనం కావడం ఈ ఏడాదిలో ఇదే మొదటి సారి. 

ఉక్రెయిన్ పైన రష్యా యుద్ధం ప్రకటన నేపథ్యంలో చమురు ధరలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయియ బ్రెంట్ క్రూడ్ 100 డాలర్లను సమీపించింది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశీయ మార్కెట్లలో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్ షేర్లు అత్యధికంగా నష్టపోగా.. భారతీ ఎయిర్​టెల్, టెక్​ మహీంద్ర, ఇండస్ఇండ్​, అదానీ పోర్ట్స్​ షేర్లు నాలుగు శాతానికిపై కుప్పకూలాయి.