SemiconIndia 2023: మైక్రాన్ నుంచి ఫాక్స్ కాన్ వరకూ భారత్ నూతన సెమికండక్టర్ తయారీ గమ్యస్థానం దిశగా అడుగులు..
గుజరాత్ లోని గాంధీ నగర్ లో సెమికాన్ ఇండియా సదస్సు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రపంచ స్థాయి కంపెనీలు కూడా పాల్గొంటున్నాయి. తొలిసారిగా భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో సెమీ కండక్టర్ పరిశ్రమలో తన వెలుగును ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.
ఆసియాలోనే భారతదేశం సెమీ కండక్టర్ పరిశ్రమకు అగ్రగామిగా నిలిచేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం గుజరాత్ లోని గాంధీనగర్ లో ఏర్పాటుచేసిన సెమికాన్ ఇండియా 2023 సదస్సు ఈ విషయాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా భారతదేశ ఆసియాలోనే నూతన పవర్ హౌస్ గా మారేందుకు సిద్ధం అవుతోంది.
ఈ సందర్భంగా మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంజయ్ మెహరోత్రా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ముందుచూపు వల్లనే భారతదేశం సెమీ కండక్టర్ పరిశ్రమకు గ్లోబల్ హబ్ గా మారేందుకు సిద్ధం అవుతోందని పేర్కొన్నారు. అంతే కాదు గుజరాత్ రాష్ట్రంలో మైక్రాన్ సంస్థ త్వరలోనే అతిపెద్ద సెమి కండక్టర్ అసెంబ్లీ టెస్టింగ్ ఫెసిలిటీ ప్లాంటును ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుందని దీని ద్వారా సుమారు 5,000 మందికి నేరుగాను 15000 మందికి పరోక్షంగాను ఉద్యోగాలు వస్తాయని సంజయ్ మెహరోత్ర పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని అలాగే రాబోయే రోజుల్లో ఈ రంగంలో పెద్ద ఎత్తున వ్యాపారం పెరుగుదలతో పాటు సెమీ కండక్టర్ పరిశ్రమ ఎదిగేందుకు ఒక వాతావరణం ఏర్పడుతుందని ఇది భవిష్యత్తు తరాలకు మార్గదర్శి అవుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు డిజిటల్ ఇండియా మేకింగ్ ఇండియా నినాదానికి ఈ చొరవ చోదక శక్తి అవుతుందని అన్నారు.
ఫాక్స్ కాన్ చైర్మన్ యంగ్ లుయ్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ చొరవ తమను కదిలించిందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నట్టు ఐటి అంటే ఇండియా తైవాన్ అని ఇందులో తైవాన్ దేశాన్ని చేర్చి మాట్లాడటం తమకు ఎంతో గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అందుకు తగ్గట్టుగానే తాము నమ్మదగిన స్నేహితుడిగా మాట నిలుపుకుంటామని పేర్కొన్నారు.
సెమీ సీఈవో ప్రెసిడెంట్ అజిత్ మనోచ మాట్లాడుతూ.. భారతదేశ సెమి కండక్టర్ పరిశ్రమలో అత్యంత కీలకమైన భాగస్వామిగా మారబోతోందని, ప్రపంచ పరిశ్రమ నేడు భారతదేశం వైపు తొంగి చూస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు తొలిసారిగా సెమీ కండక్టర్ పరిశ్రమ ఒక ట్రిలియన్ డాలర్ దిశగా సాగుతోందని సెమీ కండక్టర్ పరిశ్రమలో భారతదేశం ఆసియాలోనే ఒక పవర్ హౌస్గా మారబోతోందని పేర్కొన్నారు అలాగే స్థానిక ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చొరవ అలాగే ప్రైవేట్ పార్ట్ నర్ షిప్ అంతర్జాతీయ సంబంధాలు వెరసి ఈ రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు.
సెమికండక్టర్ ప్రొడక్ట్స్ గ్రూప్ ప్రెసిడెంట్ ప్రభు రాజా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి కారణంగానే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో గొప్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయని ముఖ్యంగా గ్లోబల్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో భారతదేశం ఒక వెలుగు వెలుగుతోందని ఆయన పేర్కొన్నారు.దాదాపు 25 గ్లోబల్ సప్లయర్స్ 5 డొమెస్టిక్ సప్లయర్స్ ప్రస్తుతం ఇక్కడ పాల్గొంటున్నాయని, త్వరలోనే భారతదేశం యావత్ ప్రపంచానికి ఒక ఛాలెంజ్ విరిసిరే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు
సెమికాన్ ఇండియా సదస్సు భారత దేశపు సెమీ కండక్టర్ ఇండస్ట్రీ జైత్రయాత్రకు ఒక సాక్షిగా నిలుస్తుందని ఈ రంగంలో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ కారణంగానే మన దేశం ముందు వరసలో నిలిచే అవకాశం ఏర్పడిందని ఈ సదస్సులో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు ముఖ్యంగా మైక్రాన్ టెక్నాలజీ వంటి సంస్థలు మొత్తం 865 మిలియన్ డాలర్లు పెట్టుబడులను పెట్టడం ద్వారా ఈ రంగంలో భారతదేశం చూపిస్తున్న చరవకు తార్కాణం అని పేర్కొన్నారు అలాగే మరో 400 మిలియన్ డాలర్లు ఇంజనీరింగ్ కోలాబరేటివ్ సెంటర్ ఏర్పాటు కూడా సెమీ కండక్టర్ పరిశ్రమకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ సదస్సులో 23 దేశాలు పాల్గొనడం విశేషం. దాంతోపాటు మన దేశానికి చెందిన ఉత్తర ప్రదేశ్ గుజరాత్ కు చెందినటువంటి పలు సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయడం విశేషం. దీంతోపాటు ఇస్రో వంటి సంస్థలు సైతం సెమీ కండక్టర్ పరిశ్రమలో ఆసక్తి చూపించటం అభినందనీయం అని నిర్వాహకులు పేర్కొంటున్నారు. అంతేకాదు ఈ సదస్సులో ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్, బిట్స్ పిలాని, గణపత్ యూనివర్సిటీ, నిర్మ యూనివర్సిటీ వంటివి కీలక భాగస్వాములు అయ్యాయి.
సెమికాన్ ఇండియా సదస్సు సెమి కండక్టర్ పరిశ్రమ వాతావరణం భారతదేశంలో ఏర్పాటు చేసేందుకు హితోధికంగా తోడ్పడే అవకాశం ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు తద్వారా ప్రపంచ యవనికపై భారత దేశపు జెండా రెపరెపలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.