తమ క్లయింట్ల పవర్ ఆఫ్ అటార్నీని వినియోగించుకుంటామన్న కార్వీ అభ్యర్థనను మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తోసిపుచ్చింది. సొంత అవసరాల కోసం క్లయింట్ల సెక్యూరిటీలను తాకట్టు పెట్టిందన్న ఆరోపణల్ని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ (కేఎస్‌బీఎల్) ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థను స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాల నుంచి సెబీ బహిష్కరించిన సంగతీ విదితమే. 

క్లయింట్లు జరిపిన లావాదేవీల సెటిల్మెంట్ల కోసం పవర్ ఆఫ్ అటార్నీ వాడుకుంటామంటూ సెక్యూరిటీస్ అప్పీలెట్ ట్రిబ్యునల్ (శాట్)ను కార్వీ ఆశ్రయించింది. అంతకుముందూ ఈ విషయమై సెబీని కార్వీ సంప్రదించింది. ఈ క్రమంలో దీనిపై స్పష్టత ఇవ్వాలని సెబీకి శాట్ సూచించగా, పవర్ ఆఫ్ అటార్నీలను వాడుకోవడం కుదరదని స్పష్టం చేసింది. 

కేసు పూర్వాపరాలను పరిశీలించాక 95 వేలకుపైగా క్లయింట్లకు చెందిన రూ.2,300 కోట్ల విలువైన సెక్యూరిటీలను కార్వీ అక్రమంగా బదిలీ చేసిందని గుర్తించినట్లు తెలిపింది.

బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్‌ఈ)పై తన పేరుపై ఉన్న ఓ ‘డీమ్యాట్’ అకౌంట్‌లోకి క్లయింట్ల సెక్యూరిటీలను కార్వీ బదిలీ చేసిందని సెబీ , ఈ ఖాతా వివరాలను ఎప్పుడూ కార్వీ బయటపెట్టలేదని కూడా అన్నది. ఈ సెక్యూరిటీలను తమవిగా చూపి రూ.600 కోట్ల రుణాలను పొందినట్లు చెప్పింది. 

పూర్తిగా చెల్లించిన క్లయింట్ల సెక్యూరిటీలనూ తమ సొంత/గ్రూప్ సంస్థల కోసం వాడుకోవడానికి నిధుల సమీకరణార్థం తాకట్టు పెట్టారని వివరించింది. ఈ నేపథ్యంలో కార్వీని నమ్మలేమని సెబీ గత శుక్రవారం రాత్రి పొద్దుపోయాక విడుదల చేసిన ఓ ఆదేశంలో తేల్చిచెప్పింది.

తమ సెక్యూరిటీలను బ్రోకర్ ద్వారా అమ్ముకోవాలని భావించే కార్వీ క్లయింట్లు ఎలక్ట్రానిక్/భౌతిక డెలివరీ ఇన్‌స్ట్రక్షన్ స్లిప్ (డీఐఎస్)లను మాత్రం వినియోగించుకునే వీలుందని సెబీ తెలియజేసింది. కాగా, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ).. కార్వీపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతున్నదని సెబీ ప్రకటించింది.

కార్వీ క్లయింట్ల నిధులను దుర్వినియోగం చేయడమేగాక, తమ ఆదేశాల అనంతరం కూడా సంస్థ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిందని సెబీ మండిపడింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ ట్రేడింగ్ లైసెన్స్‌ను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు సోమవారం సస్పెండ్ చేశాయి. 

కార్వీ నిబంధనల అతిక్రమించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టాక్ ఎక్సేంజీలు ప్రకటించాయి. ‘ఎక్సేంజీల నిబంధనలను పాటించనందుకు డిసెంబర్ 2, 2019 నుంచి కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌పై నిషేధం విధిస్తున్నాం’ అని వేర్వేరు ప్రకటనల్లో బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు తెలియజేశాయి. 

మరోవైపు కార్వీపై సెబీ తీసుకున్న చర్యలతో 90 శాతం క్లయింట్ల సెక్యూరిటీలు సురక్షితంగా ఉన్నాయి. దాదాపు 83 వేల మంది ఇన్వెస్టర్లు తమ సెక్యూరిటీలను తిరిగి పొందగలిగారు. సెబీ ఆదేశాల మేరకు కార్వీ ఖాతాదారుల షేర్లను వారి ఖాతాల్లోకి కొద్ది సమయంలోనే నేషనల్‌ సెక్యూరిటీస్‌ డిపాజిటరీ లిమిటెడ్‌ (ఎన్‌ఎస్డీఎల్‌) బదిలీ చేసింది. కార్వీకి చెల్లింపులు చేయాల్సిన ఖాతాదారులు తప్ప మిగిలిన వారందరికీ షేర్లు లభించాయి.

ఎవరైనా ఖాతాదారులు ప్రత్యేక పరిస్థితుల్లో షేర్లు పొందలేకపోయినా.. వారికి సెబీ ఇన్వెస్టర్‌ రక్షణ నిధి నుంచి నగదు రాగలదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. సెబీ నిర్ణయం మార్కెట్‌లోనూ, మదుపర్లలోనూ విశ్వాసాన్ని నింపుతుందని.. ఇది ఊహించని నిర్ణయమేకాక సెబీ కఠిన వైఖరికి నిదర్శనమని అంటున్నారు. 

కార్వీ విషయమై సెబీ చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందని.. త్వరలోనే ఫోరెన్సిక్‌ నివేదిక కూడా అందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఖాతాదారుల ఖాతా నుంచి అనుమతి లేకుండా షేర్లను కార్వీ తన ఖాతాలోకి బదిలీ చేసి, తాకట్టు పెట్టింది. 

95వేల మందికి చెందిన రూ. 2,300 కోట్ల విలువైన షేర్లను తాకట్టు పెట్టి కార్వీ దాదాపు రూ.600 కోట్ల నిధులను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్సీల నుంచి సమీకరించిందని ఎన్ఎస్ఈ విచారణలో తేలింది. సెబీ ఆదేశాల మేరకు ఎన్‌ఎస్ఈ పర్యవేక్షణలో ఎన్‌ఎస్డీఎల్‌ షేర్లను బదిలీ చేసింది.
 
ఇదిలా ఉంటే గత ఏడాది జనరల్‌ అట్లాంటిక్‌ చేతుల్లోకి వెళ్లిన కార్వీ ఫిన్‌టెక్‌ పేరు కేఫిన్‌ టెక్నాలజీస్‌గా మారింది. సంస్థకు కొత్త చైర్మన్‌గా మావిల విశ్వనాథన్‌ నాయర్‌ను నియమించినట్లు జనరల్‌ అట్లాంటిక్‌ తెలిపింది. 

ప్రస్తుతం ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎంవీ నాయర్‌ పలు ప్రైవేట్‌ ఈక్విటీలు, వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ కంపెనీలకు సలహాదారుగా ఉన్నారు. గత కొద్దికాలం వరకు ఆయన యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌, ఎండీగా పనిచేశారు. 

స్విఫ్ట్‌, ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌కూ చైర్మగా వ్యవహరించారు. కార్వీ గ్రూప్‌ నకు చెందిన ఈ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ సేవల కంపెనీలో మెజారిటీ వాటా (83 శాతం)ను జనరల్‌ అట్లాంటిక్‌ కొనుగోలు చేసింది. మిగతా వాటా కార్వీ ప్రమోటర్ల చేతుల్లో ఉంది.