Asianet News TeluguAsianet News Telugu

దేశ ప్రతిష్టను పణంగా పెడతారా? పర్సనల్ కాదు.. రూ.3500 కోట్ల మాటేమిటి?

ర్యాన్ బ్యాక్, ఫోర్టిస్ మాజీ ప్రమోటర్లు మాల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్ సోదరులపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. జపాన్ ఫార్మా మేజర్ దైచీ శ్యాంకీ దాఖలు చేసిన కేసులో సింగపూర్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు రూ.3,500 కోట్లు ఎలా చెల్లిస్తారో చెప్పాలని, మార్చి 28న పూర్తి ప్రణాళిక సమర్పించాలని స్పష్టం చేసింది. ఇది వ్యక్తిగత గౌరవ అంశం మాత్రమే కాదని, దేశ ప్రతిష్ఠ కూడా ఇమిడి ఉన్నదని పేర్కొన్నది. దేశ ఫార్మా రంగానికి దిక్సూచీగా వ్యవహరించిన మీరు ఇలా వ్యవహరించడం సమంజసం కాదని సుతిమెత్తగా మందలించింది.

SC asks ex-Ranbaxy promoters to apprise it of complying with Rs 3,500 cr arbitral award
Author
New Delhi, First Published Mar 15, 2019, 1:38 PM IST

న్యూఢిల్లీ: రాన్ బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్‌లకు సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సింగపూర్ ట్రిబ్యునల్ ఆదేశం అమలు చేయడం అంటే వ్యక్తిగత గౌరవానికి సంబంధించిన విషయం కాదని, దేశ ప్రతిష్ఠ ఇమిడి ఉన్నదని వారిని హెచ్చరించింది. మధ్యవర్తిత్వ కేసులో రూ.3,500 కోట్లు చెల్లించాలంటూ సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పును ఎలా అమలు పరుస్తారని తెలియజేయాలని సుప్రీం కోర్టు కోరింది. 

ట్రిబ్యునల్‌ ఆదేశాల అమలుపై ఆర్థిక, న్యాయ నిపుణులను సంప్రదించటంతోపాటు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సమర్పించాలని కోర్టుకు హాజరైన సింగ్‌ సోదరులకు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌లు దీపక్‌ గుప్తా, సంజీవ్‌ ఖన్నాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. 

‘దేశీయ ఫార్మా పరిశ్రమకు దిక్సూచీగా ఉన్న మీరు ఇలా కోర్టు ముందు హాజరుకావటం మంచిది కాదని’బెంచ్‌ వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ తీర్పును అమలు పరిచేందుకు అవసరమైన ప్రణాళికతో ఈ నెల 28వ తేదీన కోర్టు ముందుకు హాజరు కావాలని సింగ్‌ సోదరులకు బెంచ్‌ సూచించింది. మీరు కోర్టుకు హాజరు కావటం ఇదే చివరిసారి అవుతుందని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొంది.

మల్వీందర్‌ సింగ్‌, శివీందర్‌ సింగ్‌లకు వ్యతిరేకంగా సింగపూర్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన తీర్పుకనుగుణంగా వీరి నుంచి రూ.3,500 కోట్లను రికవరీ చేయించాలంటూ జపాన్‌ ఫార్మా దిగ్గజం దైచీ సాంక్యో.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాక గ్రూప్‌ సంస్థ ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో కొన్ని షేర్లను కేటాయిస్తామని హామీ ఇచ్చి ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ సింగ్‌ సోదరులపై సుప్రీంకోర్టులో ధిక్కరణ కేసును కూడా దైచీ దాఖలు చేసింది.
 
ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో 31.1 శాతం వాటాలను రూ.4,000 కోట్లకు ప్రిఫరెన్షియల్‌ కేటాయింపు ద్వారా ఐహెచ్‌హెచ్‌ బెర్హాద్‌కు విక్రయించేందుకు గత ఏడాది జూలైలో ఫోర్టిస్‌ బోర్డు ఆమోదం తెలిపింది. కాగా మలేషియా ఐహెచ్‌హెచ్‌ హెల్త్‌కేర్‌ బెర్హాద్‌కు ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌లో నియంత్రిత వాటాలను విక్రయుంచే విషయంలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు గతంలో సుప్రీం కోర్టు నిరాకరించింది. 

ఈ కేసులో గత ఏడాది డిసెంబర్ 14వ తేదీన యధాతథ స్థితిని కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కేసు విషయంలో యథాతథ స్థితిని కొనసాగిస్తున్నట్లు బెంచ్‌ స్పష్టం చేసింది.
 
మరోవైపు తాకట్టు పెట్టిన షేర్ల విషయంలో గతంలో జారీ చేసిన ఉత్తర్వులను సింగ్‌ సోదరులు ఉల్లంఘించటంతో మీపై ఎందుకు కోర్టు ధిక్కారణ ప్రొసీడింగ్స్‌ను చేపట్టరాదో వెల్లడించాలంటూ నోటీసులు జారీ చేసింది. 2008లో సింగ్‌ సోదరుల సారధ్యంలోని రాన్‌బ్యాక్సీని దైచీ సాంక్యో కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 
ర్యాన్ బాక్సీ సంస్థ కొనుగోలు సందర్భంగా అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ మండలి (యూఎస్‌ ఎఫ్‌డీఏ), డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ నుంచి విచారణను ఎదురొంటున్న వివరాలను వెల్లడించకుండా దాచిపెట్టారంటూ సింగపూర్‌లోని ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ను దైచీ ఆశ్రయించింది.

తర్వాత 50 కోట్ల డాలర్లు చెల్లించి యూఎస్‌ ఎఫ్‌డీఏ, న్యాయశాఖలతో ఈ వివాదాన్ని దైచీ పరిష్కరించుకుంది. ఆ తర్వాత 2015లో రాన్‌బ్యాక్సీని రూ.22,679 కోట్లకు సన్‌ ఫార్మాసుటికల్స్‌కు దైచీ విక్రయించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios