Asianet News TeluguAsianet News Telugu

అనిశ్చితితోనే ‘ఆటో డౌన్ ట్రెండ్’: క్యాబ్‌లు, అద్దె కార్లకే మొగ్గు.. ఎస్‌బీఐ చైర్మన్‌

దేశీయంగా డిజిటల్ చెల్లింపులు పెంపొందించాలని ఎస్బీఐ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం 70 వేల యోనో యాప్ క్యాష్ చెల్లింపు పాయింట్లు ఉంటే వచ్చే 18 నెలల్లో దాన్ని 10 లక్షల పాయింట్లకు విస్తరించాలన్న లక్ష్యంతో దూకుడుగా ముందుకు వెళుతోంది. 

SBI YONO Cash Points Hikes
Author
Jaipur, First Published Aug 22, 2019, 3:52 PM IST

జైపూర్‌: ‘ఉద్యోగాల్లో అనిశ్చితి కారణంగా వినియోగదారులు సొంత కార్లను కొనుగోలు చేయడం కంటే.. క్యాబ్‌లు, అద్దెకార్లకే మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రభావం ఎంత మేర ఉందనే విషయాన్ని పరిశీలించాలి’ అని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో
మీడియాతో మాట్లాడుతూ దేశంలో డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

అందులో భాగంగా యోనో క్యాష్ పాయింట్లను పెంచుతామని రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. మరోవైపు ఆటోమొబైల్ రంగంలో మందగమనం ప్రభావం ఎంతో విశ్లేషణ జరుగాల్సి ఉందన్నారు. 

మరోవైపు దేశీయంగా డిజిటల్‌ లావాదేవీలను గణనీయంగా పెంచే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిర్ణయాలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా ‘యోనో’ క్యాష్‌ పాయింట్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 70వేల యోనో క్యాష్‌ పాయింట్లు ఉండగా.. వీటి సంఖ్యను వచ్చే 18 నెలల్లో 10 లక్షలకు చేర్చనున్నామని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల వినియోగం పెరిగే చర్యలు తీసుకోవడం వల్ల డెబిట్‌ కార్డు వాడకం తగ్గిపోతుందని, కార్డుల జారీని నిలిపివేసే యోచన తమకు లేదని స్పష్టం చేశారు. 

వ్యవసాయ రంగంలో అవసరాలేమిటో, వ్యవసాయాన్ని వాణిజ్యపరంగా అనుసంధానించే అంశాన్ని పరిశీలించాల్సి ఉన్నదని తెలిపారు. పంటల దిగుబడితోపాటు కొన్నిసార్లు రైతులు రుణాల చెల్లింపుల్లో కష్టాల పాలవుతున్నారని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ చెప్పారు. పంట రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నా రైతుల పరిస్థితులు మెరుగు పడటం లేదన్నారు. 

ఎస్బీఐ డిజిటల్ యాప్ ‘యోనో’ వల్ల డిజిటల్ చెల్లింపులు పెరిగాయని రజనీశ్ కుమార్ తెలిపారు. స్మార్ట్ ఫోన్ల నుంచి లావాదేవీలు జరుపొచ్చన్నారు. నగదు విత్ డ్రాయల్స్, చెల్లింపులు తదితర లావాదేవీలు జరిగాయని తెలిపారు. బ్యాంక్ న్యూ ఆఫర్ ప్రకారం రెపో రేట్ లింక్డ్ హోమ్ రుణాల అనుసంధానానికి మంచి ప్రతిస్పందన వస్తున్నదని తెలిపారు. యోనో ఆప్‌తో వ్యవసాయ రంగానికి సంబంధించి రసాయనాలు, విత్తనాలు, పరికరాలు సరసమైన ధరకు కొనుగోలు చేయొచ్చునన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios